మీ లక్ష్మీదేవుల్లో ఈ అమ్మాయి వుందా లేదా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రమా సుందరి

మోడీజీ కి ఉత్తరం…
                          లా విదార్థిని ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోలో మిమ్మల్ని ఏం వేడుకొన్నది? ‘మోడీజీ! ప్లీజ్‌ ప్లీజ్‌…నాకు సహాయం చేయండిఅని కదూ. తనలాగా ఎంతో మంది అమ్మాయిలు ఆయన కబంధ హస్తాలలో ఉన్నారని చెప్పలేదు? పోలీసులూ, జిల్లా మేజిస్ట్రేట్‌ చిన్మయానంద జేబు లోనే ఉంటారనీ, తన దగ్గర అతనికి వ్యతిరేకమైన సమాచారం చాలా ఉందనీ, తనను రక్షించమనీ వేడుకోలేదు? మీరేం చేశారు ఆమెకు? ఆమె ఆ తరువాత మీ నుండి సహాయం రాక ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోవాల్సి వచ్చింది.

‘కుమార్తెను లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయం. అలాంటి మన కూతుళ్లను గ్రామాల్లో, నగరాల్లో బహిరంగంగా సన్మానించుకోలేమా?’ మోడీజీ…మొన్న మీరు దేశం గల్లా పట్టుకొని ప్రశ్నించారు. ‘మన మహిళలు చేస్తున్న అద్భుతమైన పనులను సోషల్‌ మీడియాలో ‘భారత్‌ కీ లక్ష్మీ’ హాష్‌ ట్యాగ్‌ తో విస్తృతంగా ప్రచారం చేయాలని’ మన్‌ కీ బాత్‌ లో మీరు పిలుపు ఇచ్చారు.
వాV్‌ా మోడీ జీ! మీరు చెబుతున్న లక్ష్మీదేవిలలో ఉత్తరప్రదేశ్‌ లోని షాజహాన్‌పూర్‌, ఉన్నావ్‌ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు ఉన్నారా లేదా? వాళ్లెవరని అడుగుతున్నారా? బీజేపీ నాయకుడు చిన్మయానంద స్వామి సంవత్సర కాలం ఆమె మీద లైంగిక నేరాలకు పాల్పడితే భరించలేక కేసు పెట్టి, ఇప్పుడు జైల్లో ఉందే ఆ అమ్మాయి. బీజేపీ మాజీ ఎమ్‌ఎల్‌ఎ కుల్‌దీప్‌ సింగ్‌ చేత అత్యాచారానికి గురి అయ్యి, కేసు పెట్టినందుకు తండ్రినీ పినతల్లినీ కోల్పోయి, పిన తండ్రి జైలు పాలయ్యి, ఇప్పుడు చావు బతుకుల మధ్యన ఊగిసలాడుతోందే…ఆ అమ్మాయి. ఇటీవలే మన ప్రధాన న్యాయమూర్తి మీద లైంగిక ఆరోపణలు చేసి, న్యాయం కోసం అర్ధించి మీ అందరి చేత అపహాస్యానికి గురైన ఆ కోర్టు ఉద్యోగి అయినా ఆ లక్ష్మీ దేవుల్లో ఉందా మోడీజీ?
‘పార్లమెంట్‌లో కూర్చున్న 545 మందిలో నలభై శాతం స్త్రీలకు సంబంధించిన నేరారోపణలకు గురి అయి ఉంటారు’ అంటే నమ్మలేక పోయాం కానీ, ఆ సంఖ్య నిజమని వాళ్లే రుజువు చేసుకొంటున్నారు. మరీ మీ ప్రభుత్వం వచ్చాక పచ్చి పురుషోన్మాదం, లైంగిక వికారం, పితృస్వామ్యం, మత దురహంకారం, శిక్షలకు అతీతులమనే దర్జాతనం-ఐదు పడగల పాములాగా ఆడవాళ్లను కబళించి వేస్తోంది. ఇలాంటి వాటన్నిటికీ ఒక పథకంతో మీరు వహించే మౌనం స్త్రీల పట్ల నేరాలు చేసేవారికి ఊతంగా బాగానే ఉపయోగ పడుతుంది. మీ పార్టీ జండా పట్టుకోవటం, మీ పార్టీకి నిధులు ఇవ్వటం, మీ పార్టీని గెలిపించటం, మీ హిందూ ఫాసిస్ట్‌ ఎజండాను ముందుకు తీసుకొని వెళ్లటమే మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. వాటి వెనకాల వారు మహిళల పట్ల అవలంబిస్తున్న వైఖరి మీకు ఇబ్బంది కలిగించలేదని అర్థం అవుతుంది. కావాలనే మీ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని ‘టైమ్స్‌ నౌ’ లాంటి మీరు కొనుక్కొన్న మీడియా ప్రచారం చేస్తుంది. మహిళలపై అమలు అవుతున్న హింస అనాదిగా ఉన్నా మోడీజీ, ఇప్పుడు దానికి మీ ఆమోదం బహిరంగంగా లభిస్తుందనీ, మీకు ఆ స్త్రీలకు న్యాయం చేయటం కంటే మీ పాలనను కాపాడుకోవడమే ముఖ్యమనీ, అందుకే బాధిత స్త్రీలు న్యాయం కోసం బయటకు వస్తే వారు జైల్లో పడటమో, లారీ కింద పడటమో, లేక తీవ్ర అవమానానికీ మనస్తాపానికీ గురి అయ్యి నోరెత్తకుండా ఉండటమో జరుగుతుందని అనుకొంటున్నారు.
చిన్మయానంద స్వామి నేర చరిత్ర ఇప్పుడు కొత్తది కాదని మీకు తెలుసు. ఆయన వాజ్‌పేయి ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా పని చేశాడు. మూడు సార్లు బీజేపీ ఎంపీ గా ఎన్నిక అయ్యాడు. అవి కాకుండా ఆయన సుఖ్‌ దేవానంద పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీకి (తన సొంతదే, అక్కడే బాధితురాలు చదివింది) చైర్‌ పర్సన్‌ కూడా. ఇవి కాకుండా ఆయన షాజహాన్‌పూర్‌ లో ముముక్షు ఆశ్రమాన్ని నడిపాడు. ఆ ముముక్షు గురువుకి ఇంకో శిష్యుడైన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ తరచూ ఆ ఆశ్రమాన్ని దర్శించేవాడు. మీ ఇద్దరు బీజేపీ నేతలూ ఒకే కంచంలో తినేవారని అనుకొంటారు. వారిద్దరి మధ్య రాజకీయ స్నేహమే కాక, ఆధ్యాత్మిక స్నేహం కూడా ఉండేది. బహుశా అదే ఇప్పుడు ఆ ఆడపిల్లలకు శాపం అవుతుంది.
2011లో ఆ ఆశ్రమంలో ఉండే అమ్మాయి ఇదే రకమైన ఆరోపణలు చిన్మయానంద మీద చేసిన సంగతి మీరు హాయిగా మర్చి పోయి ఉంటారు. ఇప్పుడు లా విదార్థిని ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియో లో మిమ్మల్ని ఏం వేడుకొన్నది? ‘మోడీజీ! ప్లీజ్‌ ప్లీజ్‌…నాకు సహాయం చేయండి’ అని కదూ. అచ్చూ గతంలో మహిళ చెప్పినట్లు గానే ఆమె తనలాగా ఎంతో మంది అమ్మాయిలు ఆయన కబంధ హస్తాలలో ఉన్నారని చెప్పలేదు? పోలీసులూ, జిల్లా మేజిస్ట్రేట్‌ చిన్మయానంద జేబు లోనే ఉంటారనీ, తన దగ్గర అతనికి వ్యతిరేకమైన సమాచారం చాలా ఉందనీ, తనను రక్షించమనీ వేడుకోలేదు? మీరేం చేశారు ఆమెకు? ఆమె ఆ తరువాత మీ నుండి సహాయం రాక ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మిమ్మల్ని అంతగా నమ్మిందంటే మీకు ఓటు వేసే ఉంటుంది. మిమ్మల్ని మాట పడనీయని దేశభక్తుల సైన్యంలో కూడా బహుశా ఉండి ఉంటుంది.
ఇప్పుడు జరిగిందేమిటి? మీరు పట్టించు కోకుండా ఉన్న కేసులో యూపీ ప్రభుత్వం ‘సిట్‌’ను వేసింది. ఇంతకీ ఆ ‘సిట్‌’ ఏమి చేసింది? ఆ అమ్మాయి డబ్బులు కోసం చిన్మయానందను బ్లాక్‌మెయిల్‌ చేసిందని తేల్చి అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌ కు పంపింది. అందుకు వారు ప్రవేశ పెట్టిన సాక్షి ఎవరో తెలుసా? ఒక పేద ట్యాక్సీ డ్రైవర్‌. ఈ అమ్మాయి ఆ ట్యాక్సీలో ఇతర కుర్రాళ్లతో కలిసి ఈ కుట్ర చేస్తుండగా విన్నాడనేదే సాక్ష్యం. ఫేస్‌ బుక్‌లో ఆమె పెట్టిన వీడియో లాగా ఆ ట్యాక్సీ డ్రైవర్‌ దగ్గర ఉన్న వీడియో ఎవరూ చూడలేదు. మొదట ఆ అమ్మాయిని తన మొబైల్‌ ఇవ్వమని పోలీసులు బలవంతం చేస్తే ఆమె ఇవ్వలేదనీ తరువాత ఈ ట్యాక్సీ డ్రైవర్‌ పాత్ర ముందుకు వచ్చిందనీ అందరికీ అర్థం అయ్యింది మోడీజీ. మీరు సినిమాలు ఎక్కువ చూడరేమో. మరీ ప్రజలను అంత వెర్రివాళ్లు అనుకొంటున్నారు కదూ. నిజమే మీకు అంత మెజారిటీ మళ్లీ ఇచ్చిన వాళ్లు వెర్రివాళ్లు కాక ఇంకెవరు?
చిన్మయానందకు వ్యతిరేకంగా ఆమె దగ్గర ఉన్న రహస్య కెమెరా మొదలైన వాటిని సేకరించకుండా ఆమె ఫోన్‌ కోసం ‘సిట్‌’ సిబ్బంది ఎందుకు పట్టు బట్టారో! మా దగ్గర ఫోరెన్సిక్‌, డిజిటల్‌ సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారట ‘సిట్‌’ సిబ్బంది. ఎలాంటి సాక్ష్యాలు? ప్రధాన మంత్రిని హత్య చేయటానికి కుట్ర చేశారని, సాక్ష్యాలు వాళ్ల మెయిల్‌లో ఉన్నాయని చెప్పి ఇప్పటికి ఏడాది పైగా అర్బన్‌ నక్సలైట్ల పేరుతో యెర్రవాడ జైల్లో పెట్టిన ఇద్దరు వృద్ధులు, ఇద్దరు స్త్రీలు, ఒక విద్యార్థి, ఇద్దరు లాయర్లు, ఒక కళాకారుడు-వీళ్లకు వ్యతిరేకంగా పోలీసులు పుట్టించిన సాక్ష్యం లాంటిదా? అది కూడా ఇంకా సరిగ్గా పుట్టించలేదనీ, కోర్టులో ప్రొడ్యూస్‌ చేయలేదనీ విన్నామే!
ఆ అమ్మాయి మీద బ్లాక్‌ మెయిలింగ్‌, క్రిమినల్‌ ఇంటిమిడేషన్‌, సాక్ష్యాలు రూపుమాపటం, నేర ప్రణాళికతో నేరం చేయటం లాంటి కేసులేవో మోపారట కదా. చిన్మయానంద మీద ఏమి కేసులు పెట్టారో చెప్పటం లేదు మరి. అసలు సాక్ష్యాలే సేకరించటానికి ఆసక్తి చూపటం లేదు కదా. పోలీసులు నిర్భయంగా, నిజాయితీగా, కనీసం ఆర్టికల్‌ 15 సినిమాలో హీరోలాగా పని చేసి ఉంటే ఈ అమ్మాయిలందరూ తమపై జరుగుతున్న హింసకు మీబోటి దేశ ప్రముఖ వ్యక్తులైన ముఖ్యమంత్రినీ, ప్రధాన మంత్రినీ, సుప్రీం కోర్టు న్యాయమూర్తినీ ఎందుకు వేడుకొంటారు మోడీజీ? మీరు మాత్రం ఏమి చేస్తారు పాపం? ‘నాకు న్యాయం చేయండ’ని మిమ్మల్ని వేడుకొన్న ఆ అమ్మాయి జైలులో ఉంది. మీ మాజీ మంత్రి గారు అయిన చిన్మయానంద స్వామివారు దర్జాగా జైలు ఆసుపత్రిలో రెస్ట్‌ తీసుకొంటున్నారు. ఈ సారి ఆయనకు సీటు గ్యారెంటీనే కదా.
ఇంతకీ మీ లక్ష్మీ దేవుల్లో ఈ అమ్మాయి ఉందా లేదా? చెప్పనేలేదు!

RELATED ARTICLES

Latest Updates