ఆదివాసీలను దెబ్బతీస్తున్న మోడీ సర్కార్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రిటైర్డ్‌ ఫారెస్టు అధికార్లు పర్యావరణ ముప్పుకు, పోడు వ్యవసాయం గిరిజనులే కారణమంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. వారి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, బహుళజాతి సంస్థలు వెన్నుదన్నుగా వున్నాయి. చివరికి గిరిజనుల పక్షాన నిలవాల్సిన బాధ్యత వున్న మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లాయర్‌ను గానీ, అధికార్ని గానీ పంపలేదు. ఫలితంగా పట్టాలు లేని గిరిజనులను భూమి నుండేగాదు, అడవి నుండే గెంటివేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అనేక గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు గిరిజనులను కదిలించి దేశవ్యాపితంగా ఆందోళన చేయగా, లోక్‌సభ ఎన్నికల ముందున్నందున కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లక తప్పలేదు. సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఆ కేసు నవంబర్‌ 26న విచారణకు వస్తున్నది. ప్రభుత్వం ఏం చేస్తుందో? కోర్టు ఏం తీర్పు ఇస్తుందో తెలియదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి, సుప్రీం కోర్టుకు ప్రజల ఆందోళన తెలిపేందుకు ‘భూమి అధికార ఆందోళన మంచ్‌ కమిటీ’ రాష్ట్రాల్లో ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 12న ఏజెన్సీ బంద్‌ చేయాలని గిరిజన సంఘం (ఏ.పి.జి.యస్‌) పిలుపునిచ్చింది. ఏజెన్సీ మొత్తం బంద్‌ చేయడం ద్వారా ఆదివాసీల సమస్య తీవ్రత ఢిల్లీకి తాకాలి. ఆదివాసీలకు సుప్రీం కోర్టులో న్యాయం జరగాలి.

1929 అటవీ చట్ట సవరణ
దీంతోబాటు ఆదివాసీలకు పెను ముప్పుకాబోతున్న 1927 అటవీ చట్టం సవరణను కూడా బంద్‌ డిమాండ్లలో భాగం చేసింది గిరిజన సంఘం. మోడీ ప్రభుత్వం అడవిలోకి కార్పొరేట్ల (దేశ విదేశీ) చొరబాటుకు సవరణ చేసింది. 1927 చట్టం అడవిని మూడు రకాలుగా రిజర్వు, రక్షిత, కమ్యూనిటీ అడవులుగా విభజన చేసింది. మోడీ ప్రభుత్వం ‘ప్రొడెక్టివ్‌ ఫారెస్టు’ను అదనంగా చేర్చి ఫారెస్టును దేశ విదేశీ కార్పొరేట్లకు ఇచ్చేందుకు నేరుగా అవకాశం కల్పిస్తున్నది. ‘1927 అటవీ చట్టం’లో గానీ, ‘2006 అటవీ హక్కుల చట్టం’ గానీ, ‘రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌’లో గానీ అడవిలోకి గిరిజనేతర యజమానులు చొరబడే అవకాశం లేదు. అయితే అంబానీ, అదానీలు, పోస్కో వంటి బడా కార్పొరేట్‌ సంస్థలు మోడీపై ఒత్తిడి చేసి 1927 అటవీ చట్టానికి సవరణ చేయిస్తున్నాయి.
రాజ్యాంగమూ, చట్టాలు అడ్డుగా వున్నా మోడీ ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల ఎకరాలను దేశ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చింది. కంపెనీలకు అండగా రాష్ట్ర ప్రభుత్వాలను నిలబెడుతున్నది. తమను వెళ్లగొడుతున్న కార్పొరేట్‌ కంపెనీ లకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాడుతున్నారు. రేపు 1927 అటవీ చట్టానికి సవరణ వస్తే ఇక తమకు బతుకే ఉండదని గుర్తించిన ఆదివాసీలు మరింత విస్తృతంగా, ఐక్యంగా, సమర శీలంగా పోరాడక మానరు. గిరిజనులను అణచి పెట్టేందుకు పోలీసు బలగం చాలదని గుర్తించింది. అందువలనే ఫారెస్టు సిబ్బందికి తుపాకి ఇవ్వడమేగాక, అడవిలో ఆయుధ గిడ్డంగులు, జైళ్ళ ఏర్పాటుకు చట్టంలో ప్రతిపాదించింది. ఫారెస్టు లోకి మిలటరీని దించేందుకు కూడా చోటు కల్పిస్తూ అటవీ భద్రతా కమిటీలో దేశ సైన్యాధిపతిని భాగస్వామిని చేస్తున్నది. కాశ్మీర్‌ వలె ఆదివాసీలపై కిరాతకానికి మోడీ ప్రభుత్వం సిద్ధం అవుతుందనడానికి 1927 అటవీ చట్ట సవరణలో ఇదో చిహ్నం.
ఇదేగాక ఆదివాసీలు తమకు పట్టాలు ఉన్న భూమిలో తప్ప అడవిలో గొర్రె, బర్రెను మేపినా, ఫారెస్టు అధికార్ల అనుమతి లేకుండా పుల్ల తెచ్చినా కేసు పెట్టవచ్చు. అరెస్టు చేయవచ్చు. కాల్చి వేయవచ్చు. భూమి పట్టాలు కూడా రద్దు చేయవచ్చు. గిరిజనులు ఎటువంటి పౌర హక్కులు లేని కట్టుబానిసల్లా బతకాలి. ఇదీ 1927 చట్టంలో మరో దారుణం. బ్రిటీష్‌ పాలనలో, స్వాతంత్య్రానం తరం ఆదివాసీ లకు రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్‌తో సహా 2006, పీసా చట్టాలకు చెల్లు చీటి పాడుతున్నది. ఆదివాసీలు పోరాడి సాధించుకున్న ప్రతి ఒక్క హక్కును 1927 అటవీ చట్ట సవరణతో మోడీ ప్రభుత్వం తుడిచివేస్తున్నది.

గిరిజన యూనివర్శిటీ
బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రంలో గిరిజనులకు తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్శిటీ ఇస్తానన్నది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తానన్నది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తే అది కూడా మన ఆదివాసీలకే ఉపయోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని స్వయంగా ప్రధానమంత్రే రాజ్యసభలో ప్రకటన చేశారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపిని ఎన్నుకుంటే విభజన చట్టం అమలు జరుపుతామని ఎన్నికల్లో చెప్పని సభ లేదు. ప్రజలు మరచి పోదామన్నా గుర్తుండిపోయేలా ప్రచారం చేశారు. 6 సంవత్సరాలు కావస్తున్నా గిరిజన యూనివర్శిటీకి అతీ గతీ లేదు. చంద్రబాబు మొదట సాలూరు ప్రకటించారు. చివరకు కొత్తవలస ఖరారు చేశారు. జగన్‌మోహన్‌ రెడ్డి అరకులో పెట్టిస్తామన్నారు. ఇప్పుడు సాలూరుకు ఇచ్చేస్తామంటు న్నారు. బిజెపి, టిడిపి, వైసిపి నాటకాలతో ఏళ్ళు గడిచిపోతున్నాయి. గిరిజన యూనివర్శిటీ మాత్రం అడ్రస్‌ లేకుండా చేశారు.

జాతీయ విద్యా విధానం
మోడీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ప్రకటించింది. అందులో ఉన్నత విద్య మొత్తం ప్రయివేటు పరం చేయడానికి నిర్ణయించింది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఉన్నత విద్యలో దళితులకు, గిరిజనులకు ఇచ్చే స్కాలర్‌షిప్పులకు కోత పెట్టింది. విద్యా రంగం నుండి ప్రభుత్వం తప్పుకుంటే ఇక గిరిజనులకు ఉన్నత విద్య అందదు. ప్రయివేటు విద్యను గిరిజనులు ఖరీదు పెట్టి కొనుక్కోలేరు. మోడీ గారి జాతీయ విద్యా విధానంలో 30 మంది పిల్లల లోపు ఉన్న స్కూళ్ళు మూసి వేసి పక్క స్కూళ్లల్లో కలిపివేయ మంటున్నది. మరోవైపు మూడేళ్ళ పిల్లలను స్కూళ్లో చేర్పించమంటున్నది. మూడేళ్ళ విద్యార్థి 3 లేక 4 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోగలడా? ఒకవేళ అదే జరిగితే అంగన్‌వాడీ సెంటర్లు మూతపడతాయి. అంగన్‌వాడీ సెంటర్‌ ద్వారా ఇప్పుడందుతున్న పౌష్టికాహారం అందదు. స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లు మూసివేస్తే టీచర్లు, అంగన్‌వాడీ వర్కర్లు వుంటారా? ఎటువంటి స్పష్టత లేదు.
విద్యా హక్కు చట్టం మూలంగా ప్రయివేటు విద్యా సంస్థలు 25 శాతం విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాలి. ఆ చట్టం గిరిజనులకు, దళితులకు ఉపయోగ పడుతున్నది. నేషనల్‌ విద్యా మిషన్‌ ద్వారా ఆదివాసీల మాతృభాషలో చెప్పేందుకు భాషా వాలంటీర్లు వున్నారు. ఈ జాతీయ విద్యా విధానం చట్టంగా మారితే విద్యాహక్కు చట్టం ఉండదు. భాషా వాలంటీర్ల వ్యవస్థ వుండదు. మొత్తంమీద ఆదివాసీలకు చదువు ఉండదు. టీచర్లకు, వర్కర్లకు, వాలంటీర్లకు ఉద్యోగాలు ఊడిపోతాయి. చదువుకున్న వారికి ఉద్యోగాలు రావు. మోడీ జాతీయ విద్యా విధానం ఆదివాసీలకు ద్రోహమే.

పట్టా లేదు – భరోసా ఇవ్వరు
సంవత్సరాలు గడుస్తున్నా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు చేసుకుంటున్న గిరిజనులకు, పట్టాలు ఇవ్వడం లేదు. సర్వేలు చేస్తాం అంటారు – చేయరు. సర్వే చేసినా పట్టాలు ఇవ్వరు. పోడుకు పట్టా లేదు గనుక గిరిజనుడికి రైతు భరోసా ఇవ్వలేదు. పోడు భూమికి పట్టా ఎవరు ఇవ్వాలి? ఎవరి పట్టా వాళ్ళు రాసుకోవచ్చా? లేదు కదా! ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వమే పట్టా ఇవ్వకపోగా పట్టాలేదుగనుక రైతు భరోసా ఇవ్వం అనడం అన్యాయం కదా? ప్రభుత్వం చేసిన తప్పుకు గిరిజనుడికి శిక్షా? జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజన రైతుకు ‘రైతు భరోసా’ ఇవ్వాలనే డిమాండ్‌ కూడా నవంబర్‌ 12 ‘ఏజెన్సీ బంద్‌’లో భాగమే.
అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిని ఆధారం చేసుకుని బతికే ఆదివాసీలను ఆక్రమణదార్లుగా, అడవిని ధ్వంసం చేసే వారిగా, పర్యావరణానికి నష్టం చేసే వారిగా వేసిన కేసు దురుద్దేశ పూరితమైనది. అడవిని ధ్వంసం చేసే కార్పొరేట్లను, అడవి దొంగలను వదిలిపెట్టి ఆ నేరం ఆదివాసీలపై నెట్టేయడం దారుణం.

యం.కృష్ణమూర్తి
( వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )

RELATED ARTICLES

Latest Updates