ఫెడరల్ స్ఫూర్తికి మోడీ సర్కారు తూట్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఒకే దేశం- ఒకే పన్ను, ఒకే దేశం…ఒకేసారి ఎన్నికలు, ఒకే దేశం…ఒకే రాజ్యాంగం…ఇలా జాతీయత ముసుగులో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ హిందూత్వ ఎజెండా అమలు కోసం మోడీ సర్కారు ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఫాసిస్టు ఆలోచనలతో అఖండ భారత్‌ నినాదంతో ప్రజల హక్కులను కాలరాస్తూ బిజెపి ముందుకు వెళ్తున్నదని అన్నారు. సిపిఐ నేత ఇంద్రజిత్‌ గుప్తా శతజయంతి వేడుకలు ఆదివారం మగ్దూం భవన్‌లో నిర్వహించారు. ‘ఆర్టికల్‌ 370 రద్దు – కాశ్మీర్‌ పరిణామాలు’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్‌లోనే వేరే వారు భూమి కొనే హక్కు లేదనట్లుగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు విషప్రచారం చేస్తున్నాయన్నారు. వాస్తవానికి హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కింతో పాటు పలు రాష్ట్రాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో వేరేవాళ్లు భూమి కొనే హక్కు లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఒక్క జమ్మూ కాశ్మీర్‌కే ప్రత్యేకంగా ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారనే దానిలో వాస్తవం లేదని, నాగాలాండ్‌, మణిపూర్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఏజేన్సీ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఆర్టికల్స్‌ ఉన్నాయని గుర్తు చేశారు. జమ్మూకాశ్మీర్‌ సంస్థానం భారత్‌లో ఏ పరిస్థితుల్లో చేరిందో? ఎందుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారో? వివరించకుండా, చరిత్రను తొక్కిపెట్టి ఆ రాష్ట్రంపై విష ప్రచారం చేయడం సరిగాదన్నారు. ఏ రాష్ట్రాన్నైనా విడగొట్టేముందు అసెంబ్లీ చర్చజరగాలనీ, ఆ రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా.. ఇవేమీ చేయకుండా దొడ్డిదారిన ఒకే రోజులో హడావిడిగా ఆర్టికల్‌ 370ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పాలని మోడీ సర్కారును ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర హోదాను రద్దు చేయడం దారుణమన్నారు. ప్రశ్నించేవారిపైనా, ఎదిరించేవారిపైనా, ప్రజాస్వామ్యవాదులపైనా టెర్రరిస్టు అనే ముసుగు తొడిగి జైలు పాలుచేసేందుకు ఎన్‌ఐఏ, ఆర్టీఐ తదితర చట్టాలకు ఏకపక్షంగా మోడీ సర్కారు సవరణలు చేసిందని విమర్శించారు. మోడీ సర్కారు చెప్పినట్లుగా అక్కడి గవర్నర్‌ తలఊపుతూ ప్రజాజీవనాన్ని స్తంభింపజేశారన్నారు. కాశ్మీర్‌లో కర్ఫ్యూ నేటికీ కొనసాగుతున్నదనీ, అఖిలపక్షం నేతలమంతా అక్కడి పరిస్థితులను చూసేందుకు వెళ్తే అడ్డుకుని ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపారనీ, ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో కనీసం ఫోన్లు పనిచేయట్లేదనీ, నెట్‌ సౌకర్యాన్ని తొలగించారనీ, ప్రజలకు వైద్యసేవలు అందించడం లేదనీ అన్నారు. దీంతో ప్రజలు తీవ్ర నిర్బంధంలో మగ్గుతున్నారనీ వివరించారు. వ్యూహాత్మంగానే అక్కడ పిడిఎఫ్‌ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బిజెపి పక్కకు తప్పుకుని, అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టించి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు లడక్‌, లేV్‌ా వాసులు కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ప్రత్యేక హక్కులు గల ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారని, దీనికి మోడీ సర్కారు ఏం చెబుతుందని ప్రశ్నించారు. సదస్సు ప్రారంభంలో తనకు ఇంద్రజిత్‌ గుప్తాతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, సహాయ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, నాయకులు గుండా మల్లేష్‌, పశ్యపద్మ, బాలమల్లేష్‌, శ్రీనివాస్‌, ఈజీ నర్సింహ, ఐలయ్య, సామాజిక వేత్త సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

(COURTECY NAVA TELANGANA)

RELATED ARTICLES

Latest Updates