మోడీ బృందం అబద్ధాలు – వాస్తవాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– జి. కృష్ణమూర్తి

ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజం అయిపోతుందనేది గోబెల్స్‌ థియరీ. 1939-1945 మధ్య కాలంలో గోబెల్స్‌ జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ వద్ద ప్రచారశాఖ మంత్రి. అబద్ధపు ప్రచారంలో దిట్ట. జర్మనీలో యూదులకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టి, హిట్లర్‌ ఫాసిస్టు ఎజెండాను దేశంపై రుద్దడంలో గోబెల్స్‌ కీలక పాత్ర పోషించాడు. నేడు పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్‌ఆర్‌సీ) పై పచ్చి అబద్ధాలను పరమ సత్యాలుగా ప్రచారంలో పెడుతున్న మోడీ, షా అండ్‌ కో ముందు ఆ గోబెల్స్‌ కూడా దిగదుడుపే. బీజేపీ, ఆరెస్సెస్‌ అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, హూంకరింపులు, బెదిరింపులు, కపట నాటకాల వెనుక ఉన్న కుట్రలను సాధారణ ప్రజలు సైతం ఇట్టే గ్రహిస్తున్నారు. అందుకే దేశవ్యాపితంగా విద్యార్థులు, మేధావులు, లౌకిక ప్రజాతంత్రవాదులు ఇప్పటికే వీధుల్లోకి వచ్చి గత రెండు మాసాలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. అయినా బీజేపీ తన గోబెల్స్‌ ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ అసంబద్ధ వాదనలను చీల్చి చెండాడి, వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత లౌకిక రాజ్యాంగ పరిరక్షకులందరిపైనా ఉంది. ప్రధాన మంత్రి మొదలుకొని మంత్రులు, గవర్నర్లు, సీడీఎస్‌ చీఫ్‌ దాకా ఈ గోబెల్స్‌ ప్రచారాన్ని ఎలా సాగిస్తున్నారో చూడండి.

ప్రచారం నెం. 1 : ”మా ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది లగాయతు ఎక్కడా కూడా ఎన్‌ఆర్‌సీ మీద చర్చ జరగలేదు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.”
డిసెంబర్‌ 22న ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ

వాస్తవం : పుకార్లు పుట్టించి, మత ఘర్షణలు రాజేసి ఆ మంటల వెలుగులో తమ రాజకీయానికి బాటలు వేసుకున్న నికృష్ట చరిత్ర సంఫ్‌ుపరివార్‌ది. గో గూండాలు, మూకదాడుల నుంచి గోద్రా ఘటన వరకు అన్నీ పుకార్లతోనే రాజుకున్నాయి. ఇంత చేసిన ఈ పరివార్‌ నేతలు ఈరోజు పౌరసత్వ చట్టంపై జరుగు తున్న ప్రజాస్వామ్యయుత ఆందోళనలన్నీ పుకార్లు నమ్మడం వల్లనే జరుగుతున్నాయనడం, సాక్షాత్తూ ప్రధానే ఈ తరహా అసత్య ప్రచారానికి పూనుకోవడం అత్యంత దురదృష్టకరం. మోడీజీ ఎన్‌ఆర్‌సీపై చర్చే జరగలేదంటున్నారు. 2019 జూన్‌ 20 పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి, ”అక్రమ వలసదారులు ప్రవేశించే ప్రాంతాల్లో ప్రాధాన్యతా క్రమంలో జాతీయ పౌరసత్వ రిజిస్టరును అమలుపరచాలని మా ప్రభుత్వం నిర్ణయించింది..” అని రాష్ట్రపతి నోట పలికించింది మీరు కాదా? కేంద్ర ప్రభుత్వం రూపొందించే విధాన పత్రాన్నే రాష్ట్రపతి చదువుతారనేది జగమెరిగిన సత్యం. 2019 నవంబర్‌ 21న హోం మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో మాట్లాడుతూ, జాతీయ పౌరసత్వ రిజిస్టరు (ఎన్‌ఆర్‌సి)ని దేశవ్యాపితంగా అమలు చేస్తామని ప్రకటించారు. మరి అలాంటప్పుడు ఎన్‌ఆర్‌సీ గురించి చర్చించలేదని మీరు (మోడీ) ఎలా చెబుతారు? దేశవ్యాపితంగా విద్యార్థులు, మహిళలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా గొంతెత్తడంతో బీజేపీ నాయకులు మేకవన్నె తోడేలులా మాట్లాడుతున్నారు. ఎన్‌ఆర్‌సీ ఉద్దేశమే లేనప్పుడు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పీఆర్‌ను ఆరునూరైనా అమలు చేసి తీరుతామని ఎందుకంత మొండిగా వాదిస్తున్నారు.

ప్రచారం నెం.2 :పొరుగు దేశాల్లో మత వేధింపు లకు గురైన వారిని భారత్‌లో ఆశ్రయం కల్పించాలని మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారు. దానినే మేము అమలులో పెడుతున్నాము. పౌరసత్వ చట్ట సవరణ వల్ల ఈ దేశంలో ముస్లింలకెవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు?
మీరట్‌ ర్యాలీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

వాస్తవం : మహాత్ముణ్ణి బలిగొన్న వారే ఆయన ప్రబోధాలను ఆచరించామని చెప్పడం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద జోక్‌. గాంధీజీ చెప్పిన పొరుగు దేశాలంటే భారత్‌తో సరిహద్దు పంచుకున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, చైనా, మయన్మార్‌, శ్రీలంక అన్నీ వస్తాయి కదా! కానీ, మీరు సీఏఏలో చేసిందేమిటి? భారత్‌తో ఎలాంటి సరిహద్దు లేని అఫ్ఘనిస్థాన్‌ గురించి ప్రస్తావిస్తారు. కానీ, పక్కన ఉన్న శ్రీలంకను విస్మరిస్తారు. మయన్మార్‌లో దారుణమైన ఊచకోత కారణంగా భారత్‌లోకి వచ్చిన రోహింగ్యా శరణార్థులను నిర్దాక్షిణ్యంగా గెంటివేస్తారు. దీనికి గాంధీజీ పేరును ఉటంకిస్తారు. ఇంతకన్నా దిగజారుడు ఏముంటుంది? కులం, మతం, ప్రాంత భేదం లేకుండా రాజ్యాంగం ముందు దేశ పౌరులందరూ సమానమేనన్న మౌలిక సూత్రానికి భిన్నంగా పౌరసత్వ చట్టం, ముస్లిం మైనార్టీలపట్ల తీవ్రమైన వివక్ష చూపుతోంది.

ప్రచారం నెం. 3 : దేశంలోని చొరబాటు దారులను ఏరెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయి.
కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా వ్యాఖ్య

వాస్తవం : చొరబాటుదారులను గుర్తించొద్దని ఎవరూ అనడం లేదు. కానీ, ఎవరు చొరబాటు దారులో, ఎవరు కాదో మతం ప్రాతిపదికన నిర్ణయించ బూను కోవడమే తప్పు . అది అమెరికాలో చేసినా, బ్రిటన్‌లో చేసినా, పాకిస్థాన్‌లో చేసినా తప్పు తప్పే. వారు అలా చేశారు కాబట్టి ఇక్కడ కూడా అలా చేస్తాననడం మూర్ఖత్వం. అదీగాక ఒక్కో దేశానికి ఒక్కో రకమైన నిర్దిష్ట పరిస్థితులుంటాయి. మన దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునాదులను ఆధారం చేసుకుని భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించడమే లక్ష్యమని మన రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా పేర్కొన్నారు. మన జాతీయోద్యమ లక్ష్యం కూడా అదే. వీటికి పూర్తి విరుద్ధంగా మీరు సీఏఏను తీసుకొచ్చారు. ఏమిటీ అన్యాయం అని ప్రశ్నిస్తే, చొరబాటుదారులకు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయనడం దొంగే దొంగ అని అరిచిన చందంగా ఉంది.

ప్రచారం నెం.4 : గతంలో హిందూ శరణార్థులకు మద్దతిచ్చిన ప్రతిపక్ష పార్టీలు నేడు ఓటుబ్యాంకు కోసం పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకి స్తున్నాయి. బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన మైనార్టీ మతస్తుల కోసం ఒక చట్టం చేయాలని సీపీఐ(ఎం) గతంలో డిమాండు చేసిందని ప్రధాని మోడీ డిసెంబర్‌ 22న చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. 2012లో జరిగిన పార్టీ 20వ మహాసభ తీర్మానాన్ని, నాటి ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ రాసిన లేఖను వారు ఉటంకించారు.

వాస్తవం: వాస్తవానికి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా మెజారిటీ హిందువుల ఓట్లు కొల్లగొట్టే దుర్బుద్ధితోనే బీజేపీ ఈ చట్టం తెచ్చింది. బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని విభజించడంతో బంగ్లాదేశ్‌ ప్రాంతం నుంచి వలస వచ్చిన లక్షలాది మంది శరణార్థుల హక్కుల కోసం సీపీఐ(ఎం) అవిరళంగా కృషి చేసింది. అభాగ్యులైన ఈ శరణార్థులకు సరైన పునరావాసం కల్పించడానికి పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమం ఎనలేని కృషి చేసింది. ఆ కష్టకాలంలో కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడితే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేక్షక పాత్ర వహించింది. కానీ సీపీఐ(ఎం) ఏనాడూ ముస్లింల పట్ల వివక్ష ప్రదర్శించే ఎటువంటి చట్టాన్నీ బలపరచలేదు. మతం పేరుతో పౌరసత్వాన్ని ఇచ్చే విధానాన్ని సీపీఐ(ఎం) తొలినుంచీ వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ 22వ మహాసభ ఆమోదించిన తీర్మానం దీనినే పునరుద్ఘాటించింది.

ప్రచారం నెం. 5 : సీఏఏకీ, ఎన్‌ఆర్‌సీకీ సంబంధం లేదు. రెండూ పూర్తిగా వేరువేరు. ప్రతిపక్షాలు రెంటినీ కలపడానికి ప్రయత్నిస్తున్నాయి.
వాస్తవం : రెంటికీ మధ్య స్పష్టమైన సంబంధం ఉంది. ఎన్‌ఆర్‌సీ.. దేశంలో పౌరులెవరో, పౌరులు కానివారెంరో గుర్తిస్తుంది. పౌరులు కాని వారిని అక్రమ వలసదారులుగా ప్రకటిస్తారు. పౌరసత్వ చట్టం అక్రమవలసదారుల్లో ముస్లింలకు మినహా మిగిలిన మతాలవారికి పౌరసత్వం ఇస్తుంది. అప్పుడు ముస్లింలు మాత్రమే అక్రమ వలసదారులుగా మిగిలిపోతారు. హోంమంత్రి అమిత్‌ షా 2019 డిసెంబర్‌ 9న పార్లమెంటులో మాట్లాడుతూ సీఏఏ తరువాత ఎన్‌ఆర్‌సీని దేశవ్యాపితంగా తీసుకువస్తాం అని చెప్పారు. సీఏఏ మీద జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ”మేము దేశవ్యాపితంగా ఎన్‌ఆర్‌సీని తెస్తాం. ఒక్క అక్రమ వలసదారుణ్ణి కూడా వదిలిపెట్టబోం” అన్నారు. అందువల్ల సీఏఏకూ ఎన్‌ఆర్‌సీకీ లింకు పెట్టింది బీజేపీ ప్రభుత్వ నాయకులే.

ప్రచారం నెం. 6 : ”ఎన్‌ఆర్‌సీ ఇంకా నోటిఫై చేయలేదు కనుక ఎవరూ భయపడక్కర లేదు” అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. ఇతర మంత్రులు, బీజేపీ నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు.
వాస్తవం : భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా 2003లో వాజ్‌పేయి ప్రధానిగా, అద్వానీ హోం మంత్రిగా ఉన్నప్పుడు పౌరసత్వ చట్టంలో భాగంగా ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెట్టారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఎన్‌ఆర్‌సీకి రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తారని నిర్దేశించారు. అందువల్ల ఎన్‌ఆర్‌సీ ఇప్పటికే అమలులో ఉంది కనుక ప్రత్యేకంగా దీనికోసం మరో చట్టం అక్కరలేదు.

ప్రచారం నెం. 7 : ఎన్‌ఆర్‌సీ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. దానికోసం నోటిఫికేషన్‌ జారీ కాలేదు.
వాస్తవం : జాతీయ జనాభా రిజిస్టరు కోసం ఇంటింటి వివరాలు సేకరించడంతోనే ఎన్‌ఆర్‌సీ కార్యక్రమం ప్రారంభమవుతుందని వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఎన్‌ఆర్‌సీ అమలుకోసం నిర్దేశించిన నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. దీనిపై 2014 జులై 23న నాటి హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జు పార్లమెంటులో మాట్లాడుతూ ”ఎన్‌పీఆర్‌ పథకం కింద సేకరించిన సమాచారం ఆధారంగా దేశంలోని ప్రజలందరి పౌరసత్వ స్థాయిని ధృవీకరించడం ద్వారా జాతీయ పౌరసత్వ రిజిస్టరు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని చెప్పారు. ఎన్‌పీఆర్‌ కార్యక్రమం ప్రారంభమైనట్టు 2019 జులై 30న మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం 2020 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరుగుతుంది. అందువల్ల ఎన్‌ఆర్‌సి కార్యక్రమం ప్రారంభం కాలేదు అన్నది పచ్చి అబద్ధం.

ప్రచారం నెం. 8 : ఎన్‌పీఆర్‌కీ ఎన్‌ఆర్‌సికీ సంబంధం లేదని అమిత్‌ షా చెప్పారు.
వాస్తవం : షా గారి హోం మంత్రిత్వ శాఖ 2018-19 వార్షిక నివేదికలోని 15వ చాప్టర్‌ 15వ పేరాలో ఇలా పేర్కొన్నారు: ”దేశంలోని సాధారణ నివాసితులందరికి సంబంధించిన నిర్ధిష్ట సమాచారాన్ని సేకరించి జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) తయారుచేసే పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) ఏర్పాటుకు జనాభా రిజిస్టరు (ఎన్‌పీఆర్‌) అనేది మొదటి మెట్టు. 2010లో సేకరించిన జనాభా సమాచారాన్ని 2015లో తాజాపరచడం జరిగింది. ఈ పథకం కింద 33.43 కోట్ల మంది ప్రజల బయోమెట్రిక్‌ నమోదు కూడా జరిగిపోయింది.” అందువల్ల అబద్ధాలకోరు ఎవరు? హోం మంత్రిత్వ శాఖా, లేక హోం మంత్రిగారా? మొదట ప్రభుత్వం సీఏఏకీ ఎన్‌ఆర్‌సీకి మధ్య సంబంధం లేదంది. ఈ విషయంలో ప్రభుత్వం చెబుతున్నది అబద్ధమని తేలిపోయినాక ఎన్‌ఆర్‌సీకీ ఎన్‌పీఆర్‌కీ సంబంధం లేదని చెప్పడం ప్రారంభిం చింది. ఇది కూడా అబద్ధమని తేలిపోయింది. దాంతో అసలు జనాభా రిజిస్టరు అనేది జనాభా లెక్కలకు సంబంధించిన విషయమని బుకాయిస్తోంది. కానీ జనాభా లెక్కలు 2021లో జరుగుతాయి. జనాభా లెక్కలకూ, జనాభా రిజిస్టరుకూ ఏమాత్రం సంబంధం లేదు. జనాభా రిజిస్టరు అనేది నేరుగా పౌరసత్వ రిజిస్టరుకు సంబంధించినది.

ప్రచారం నెం. 9 : సీఏఏ-ఎన్‌ఆర్‌సీ- ఎన్‌పీఆర్‌లవల్ల ఎవరూ భయపడాల్సింది లేదు.
వాస్తవం : ఇవి ముస్లింలను లక్ష్యం చేసుకున్నప్పటికీ వీటివల్ల దేశంలోని పేద ప్రజలు, గిరిజనులు, దళితులు సంచార జాతులు ఇతర బలహీనవర్గాలు కూడా తీవ్రంగా నష్టపోతారు. మధ్యతరగతి ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఇప్పటికే ఆధార్‌, ఓటర్‌ గుర్తింపుకార్డులు, రేషన్‌ కార్డులు వగైరా ఉండగా మళ్లీ గుర్తింపు కార్డులకు భారీ ఖర్చు అవుతుంది. ఇంతా చేసిన తరువాత ప్రజలవరాలు వారి ఆధార్‌ కార్డుల్లోని బయోమెట్రిక్స్‌తో సరిపోల్చుతారు. గతంలోనే ఆధార్‌ కార్డుల్లోని బయోమెట్రిక్‌ సరిపోలకపోవడం వల్ల అనేక లక్షల మంది ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడూ అదే జరిగితే కోట్ల మంది ప్రజలు నరకం అనుభవిస్తారు. ఆధార్‌ వెరిఫికేషన్‌ తరువాత వారి పేర్లు స్థానిక జనాభా రిజిస్టర్‌లోకి ఎక్కుతాయి. స్థానిక రిజిస్ట్రార్‌ వాటిని పరిశీలిస్తాడు. ఈ పరిశీలనలో వారి వివరాల్లో ఏమైనా తేడాలు వస్తే అతను వారి పేర్ల ఎదుట ”డి” మార్కు పెడతాడు. డి అంటే డౌట్‌ఫుల్‌ (అనుమానాస్పదం) అని. ‘డి’ మార్కు పొందిన వారికి సమాచారం ఇస్తారు. అప్పుడిక ఆ వ్యక్తులు తాము భారతీయ పౌరులమేనని నిరూపించుకోడానికి నరకయాతనపడాలి. పేద వర్గాలకు ఎవరిని కలవాలో, ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. నిరూపించుకోలేకపోతే వారిని ”అక్రమ వలసదారుల” జాబితాలో చేరుస్తారు. విశేషమేమంటే ఎన్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారం మన దగ్గర ఉన్న పత్రాలు – జనన ధృవీకరణ పత్రం, ఆధార్‌, ఓటర్‌ కార్డు, పాన్‌కార్డు లేక పాస్‌పోర్టు వేటినీ కూడా పౌరసత్వ గుర్తింపుగా అంగీకరించరు. ఒక వ్యక్తి ఇక్కడి పౌరుడిని అని రుజువు చేసుకోవాలంటే అతను మాత్రమే కాక అతని లేక ఆమె తల్లిదండ్రులు కూడా ఇక్కడే పుట్టినట్లు రుజువు చేయాలి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates