మోడెర్నా వ్యాక్సిన్‌ సత్ఫలితాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • మనుషులపై తొలిదశ ప్రయోగాలు ఆశాజనకం

వాషింగ్టన్‌  : మొట్టమొదటి ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’తో తొలి దశ ప్రయోగ పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయి. అమెరికాకు చెందిన బయోటెక్‌ కంపెనీ మోడెర్నా, నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధిచేసిన ఈ వ్యాక్సిన్‌ను 18 నుంచి 55 ఏళ్లలోపు 45 మంది వలంటీర్లపై పరీక్షించారు. దీని రెండు డోసులను అందించగా.. వారిలో రోగ నిరోధక వ్యవస్థ పునరుత్తేజాన్ని సంతరించుకున్నట్లు గుర్తించారు. కరోనాకు ఆయువుపట్టయిన స్పైక్‌ ప్రొటీన్‌ను తటస్థపరిచేందుకు యత్నించే ప్రతిరక్షకాల(యాంటీబాడీ)ను ప్రేరేపించి, వాటిని వైర్‌సపైకి ఉసిగొల్పడంలో ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ సఫలమైందని వెల్లడించారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి కంటే.. ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్న వలంటీర్లలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీల సంఖ్య భారీగా పెరిగిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ లీసా జాక్సన్‌ తెలిపారు. ‘కచ్చితంగా చెప్పలేను.. కానీ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ ప్రయోగాల తుది ఫలితాలు రావచ్చు’ అని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’తో మొదటి దశలో సానుకూల ఫలితాలు రావడంతో జూలై 27 నుంచి మూడో దశ ప్రయోగ పరీక్షలకు మోడెర్నా సిద్ధమవుతోంది. రెండో దశ ప్రయోగాలు మేలోనే ప్రారంభమయ్యాయి. మూడో దశ ప్రయోగాలు కొవిడ్‌ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌తో నిర్వహించే ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనగా నిలిచిపోనున్నాయి. కీలకమైన ఈ చివరి దశలో 30వేల మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. ఇప్పటివరకు ప్రయోగాల్లో 25, 100, 250 మైక్రోగ్రాముల డోసులను పరీక్షించినప్పటికీ.. తుది దశ పరీక్షలకు 100 మైక్రోగ్రాముల డోసును వాడాలని నిర్ణయించారు. అమెరికాలోని తమ ఉత్పత్తి విభాగం, స్విట్జర్లాండ్‌ ఫార్మా కంపెనీ లోంజా తయారీ యూనిట్లలో ఏటా 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయాలని మోడెర్నా లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, తొలి దశ ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్న 45 మందిలో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తలేదు. కేవలం ముగ్గురిలోనే కొద్దిపాటి ప్రతికూలతలు బయటపడ్డాయి. కానీ రెండోసారి వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత సగం మందిలో ఇంజెక్షన్‌ చేయించుకున్న భాగంలో నొప్పి, చలి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినా.. ఎక్కువసేపు కొనసాగలేదు. మోడెర్నా వ్యాక్సిన్‌ సత్ఫలితాల దిశగా దూసుకెళ్తుండటంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో ఆ కంపెనీ షేరు ధర అమాంతం 18 శాతం పెరిగింది.

‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ ఎలా పనిచేస్తుందంటే..
ఈ వ్యాక్సిన్‌ వేయగానే.. అందులోని ‘రైబో న్యూక్లిక్‌ యాసిడ్‌’(ఆర్‌ఎన్‌ఏ) రసాయన దూత(కెమికల్‌ మెసెంజర్‌)లా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది మన శరీర కణాల వద్దకు ఓ ముఖ్యమైన సమాచారాన్ని మోసుకెళ్తుంది. అచ్చం కరోనా వైరస్‌ బాహ్య ఉపరితలాన్ని తలపించే ప్రొటీన్లు తయారు చేసుకోవాలంటూ శరీర కణాలను నిర్దేశిస్తుంది. దీనికి స్పందనగా కణాలు విడుదల చేసే కరోనా లాంటి ప్రొటీన్లను అంతమొందించేందుకు రోగ నిరోధక వ్యవస్థ దాడిని మొదలుపెడుతుంది. ఈక్రమంలో అది విడుదల చేసే ప్రతిరక్షకాలు(యాంటీబాడీ) కరోనా లాంటి ప్రొటీన్లతో పాటు.. అసలు సిసలైన కరోనా వైర్‌సలను కూడా తుదముట్టిస్తాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates