కరోనా కట్టడికి మొబైల్ కంటైనర్ వైరాలజీ ల్యాబ్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– దేశంలోనే మొదటిది హైదరాబాద్‌లో ఏర్పాటు
– ఈఎస్‌ఐ మెడికల్‌లో 22న ప్రారంభం
– డీఆర్‌డీవో సహకారంతో మధుమోహన్‌రావు రూపకల్పన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి శాస్త్రవేత్తల బృందం దేశంలోనే మొట్టమొదటి బహుళ ప్రయోజనకరమైన బయో సేఫ్టీ లెదర్‌ (బీఎస్‌ఎల్‌)-3 అంతర్జాతీయ ప్రమాణాలతో మొబైల్‌ కంటైనర్‌ వైరాలజీ ల్యాబ్‌ హైదరాబాద్‌లో సిద్ధమైంది. నిమ్స్‌ ఆస్పత్రి పరిశోధన, అభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్‌ కె మధుమోహన్‌రావు ఈ ల్యాబ్‌ను రూపకల్పన చేశారు. ఈఎస్‌ఐ వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఇందుకు సంపూర్ణ సహకారం అందించారు. ఈనెల 22న ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీలో ఈ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తల బృందం వై శ్రీనివాస్‌, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, నారాయణమూర్తి మొబైల్‌ కంటైనర్‌ నిర్మాణానికి కావాల్సిన సాంకేతికతను అందించారు. ఈ సాంకేతికను ఉపయోగించి ఈకామ్‌ అనే సంస్థ రెండు భారీ కంటైనర్లను ఉచితంగా తయారుచేసింది. బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజుల్లో సిద్ధం చేసింది. సాధారణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో బీఎస్‌ఎల్‌-3 వైరాలజీ ప్రయోగశాలను సిద్ధం చేయడానికి కనీసం 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. అయితే కరోనా ఉధృతి దృష్ట్యా ఈ సంస్థ యుద్ధ ప్రాతిపదికన కేవలం 15 రోజుల్లో ల్యాబ్‌ను సిద్ధం చేసింది. సాధారణ వైరస్‌లపై ప్రయోగాలకు బీఎస్‌ఎల్‌-2 సరిపోతుంది. అయితే కోవిడ్‌-19 వంటి ప్రాణాంతక వైరస్‌లపై ప్రయోగాలు చేయాలంటే బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాల తప్పనిసరి కావాలి. దీంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది ఆ వైరస్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు.

వ్యాధి నిర్ధారక పరీక్షలు జరుగుతాయి : మధుమోహన్‌రావు
ఈ ప్రయోగశాలలో కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారక పరీక్షలు జరుగుతాయని డాక్టర్‌ మధుమోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నియంత్రిత వాతావరణంలో వైరస్‌లను పెంచుతారని పేర్కొన్నారు. వైరస్‌ జన్యుక్రమాన్ని అధ్యయనం చేసి వ్యాక్సిన్‌ను కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తామని వివరించారు.అమెరికా, యూరప్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి ప్రయోగశాలలున్నాయని తెలిపారు. బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలతో కూడిన మొబైల్‌ కంటైనర్‌ వైరాలజీ ప్రయోగశాల దేశంలోనే ఇది మొదటిదని వివరించారు. కరోనాకే కాకుండా ఇతర వైరస్‌ల వ్యాధి నిర్ధారక పరీక్షలు, పరిశోధనలకు ఈ ల్యాబ్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రదేశాలకు ఈ ల్యాబ్‌ను తరలించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. సైనిక అవసరాల కోసం దీన్ని ఉపయోగించవచ్చని సూచించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates