‘ఉపాధి’కి నిధుల కోత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 బడ్జెట్‌లో రూ. 61,500 కోట్ల కేటాయింపులు
గతేడాది సవరించిన అంచనాల కంటే రూ. 9,500 కోట్లు తక్కువ
కేటాయించినదాన్లో ఆరో వంతు పెండింగ్‌ వేతనాలకే..
సుమారు లక్ష కోట్లు కావాలి : ది పీపుల్స్‌ యాక్షన్‌ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ

న్యూఢిల్లీ : గ్రామీణ భారతంలో నిరుపేదలకు ఉపాధినిచ్చే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ) ఈ బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని ‘ది పీపుల్స్‌ యాక్షన్‌ ఫర్‌ ఎంప్లారుమెంట్‌ గ్యారంటీ’ (పీఎఈజీ) ఆరోపించింది. ఈ సంస్థ ‘ఉపాధి’ కార్మికుల వేతనాలు, రక్షణ, వారి సంక్షేమం గురించి పోరాడుతున్నది. రెండ్రోజుల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోవనీ, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న మాంద్యం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించడానికి దీనికి నిధులు పెంచాల్సి ఉండేదని పీఎఈజీ అభిప్రాయపడింది. 2020-21కి గానూ కేంద్రం ఎంజీఎన్‌ఆర్‌ఈజీకి రూ. 61,500 కోట్లను కేటాయించింది. ఇది గతేడాది బడ్జెట్‌లో సవరించిన అంచనాల (రూ.71 వేల కోట్లు) కంటే రూ. 9,500 కోట్లు తక్కువ. ఈ చట్టానికి నిధులు తగ్గించడం చూస్తే మోడీ సర్కారు ఎవరి వైపునకు ఉండదలుచుకున్నదో స్పష్టమవుతున్నదని పీఎఈజీ ఆరోపించింది. ఈ విషయంలో మోడీ సర్కారు పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశం ఎదుర్కొంటున్న మందగమనం నుంచి గ్రామీణ భారతాన్ని కాపాడటంలో ఉపాధి హామీ కీలక పాత్ర పోషిస్తుందనీ, దీనికి నిధులు పెంచి పల్లె ప్రజల వినిమయ శక్తిని పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నా మోడీ సర్కారు దానిని పెడచెవిన పెట్టిందని పీఎఈజీ విమర్శించింది. దేశంలో నిరుద్యోగం మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోవడం, ఆహార ద్రవ్యోల్బణం రేటు రెండంకెల సంఖ్యకు చేరుకోవడం, సాగు పనులు కరువై గ్రామీణ భారతం పట్టణాలకు వలస వెళ్తున్న తరుణంలోనూ కేంద్రం మరోసారి ఈ చట్టానికి నిధులు తగ్గించి అన్యాయం చేసిందని తెలిపింది. ఉపాధి హామీకి కేంద్రం ఖర్చు చేస్తున్న నిధుల్లో ఆరోవంతు పెండింగ్‌ బకాయిలకే వెళ్తున్నదని వివరించింది. పనిచేసిన తర్వాత పదిహేను రోజుల్లోనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని చట్టంలో నిబంధన ఉన్నా కేంద్రం మాత్రం నెలలకొద్దీ పెండింగ్‌లోనే ఉంచుతున్నదని పేర్కొంది.

మొత్తంగా ఉపాధి హామీని సమర్థవంతంగా నిర్వహించాలంటే దానికి ఏటా సుమారు లక్ష కోట్ల రూపాయలకు తగ్గకుండా నిధులు కేటాయించాలని కోరింది. ఉపాధి హామీ కింద పనిచేస్తున్న వేలాది మంది కూలీలకు సరైన వేతనాలు లేవనీ, పలు రాష్ట్రాల్లో అయితే కనీస వేతనాలు కూడా అందడం లేదని అది ఆరోపించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు రూ. 268ల వేతనం అందించాలనీ, ఆ మేరకు బడ్జెట్‌లలో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేసింది. ఏటా ఫిబ్రవరి 2ను ‘ఉపాధి హామీ’ దినోత్సవంగా పాటిస్తుండగా.. దానికి ఒక్కరోజు ముందే కేంద్రం దీనికి నిధులు తగ్గించి ఈ చట్టాన్ని దారుణంగా అవమానపరించిందని పీఎఈజీ విమర్శలు చేసింది. దీనిద్వారా మోడీ సర్కారు పేద ప్రజల పక్షాన లేదనే విషయం స్పష్టమవుతున్నదని ఆ సంస్థ ఆరోపించింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates