ఇడ్చిపెడ్తె.. వెళ్ళిపోతాం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– రైల్వేస్టేషన్‌కు వచ్చిన వలస కార్మికులపై ఖాకీల వీరంగం
– ముంబయిలో ఘటన

బాంద్రా: సొంతూళ్ళకు పోదామని ముంబయిలోని బాంద్రా రైల్వేస్టేషన్‌కు వచ్చిన వలసకార్మికులపై పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. లాక్‌డౌన్‌ ఇంకెంతకాలం పొడిగిస్తారోనన్న భయాందోళనలతో పెద్దసంఖ్యలో కార్మికులు స్టేషన్‌కు తరలివచ్చారు. కాగా, వారు ఎక్కాలనుకున్న రైలుకు కేవలం వెయ్యి మందికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశమున్నది. శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్‌లో వెళ్దామనుకున్న సుమారు ఐదువేల మంది కార్మికులు మంగళవారం ఉదయం స్టేషన్‌కు వచ్చారు. గంట గంటకు ఊహించనివిధంగా కార్మికులు వస్తుండటంతో…స్టేషన్‌ బయట పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ముంబయి నుంచి బీహార్‌కు వెళ్లే శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్‌ కోసం వీరంతా స్టేషన్‌ వచ్చారు. గుంపులు.. గుంపులుగా చేరుకోవటంతో.. బాంద్రా స్టేషన్‌ పరిసరాల్లో తీవ్ర రద్దీ ఏర్పడింది. వీరిలో పెద్దసంఖ్యలో మహిళలు… చిన్నారులు ఉన్నారు. లాఠీలు ఝుళిపించి కార్మికులను చెదరగొట్టారు. ‘మేం ఏం తప్పుచేశామని కొడుతున్నారు..’ ‘ఇడ్చిపెడ్తె తమ ఊళ్లకు పోతాం’ అంటూ గాయాలపాలైన కార్మికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రస్తుతం స్టేషన్‌ చుట్టూ భారీగా పోలీసు బలగాలు మొహరించాయి.
గతంలో కూడా..

సరిగ్గా నెల రోజుల కిందట ముంబయిలోని బాంద్రా స్టేషన్‌ వద్ద వేలసంఖ్యలో వలసకార్మికులు తరలివచ్చారు. సొంతూర్లకు వెళ్తామంటూ బైటాయించి..ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు వీరంగం సృష్టించారు. లాఠీలతో బాదారు. దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. వలసకార్మికులను రెచ్చగొట్టారంటూ ఓ జర్నలిస్టు సహా ఆరుగురిపై కేసులు పెట్టారు.

20లక్షల మంది ఘర్‌ వాపసీకి విన్నపం
ముంబయిలో 20 లక్షల మంది వలసకార్మికులు తమ సొంతూర్లకు వెళ్లాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం మూడు లక్షల మందిని థాక్రే సర్కార్‌ ఆయా రాష్ట్రాలకు పంపింది. అయితే కాలిబాటన..సైకిళ్లు..ఇతరత్రా వాహనాలపై వెళ్తున్న వారి రికార్డులు ఎవరి వద్దా లేవు.

గుజరాత్‌లో వలస కార్మికులపై విరిగిన లాఠీ..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో వలస కార్మికుల చిక్కుకుపోయారు. ఉపాధి కరువవ్వడంతో స్వస్థలాలకు ఏలాగోలా వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అధికారులు వారిని అడ్డుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు.. వాస్త్రాపూర్‌లోని జీఎండీసీ గ్రౌండ్‌కు చేరుకుని తమను స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వారి సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసులు.. వలస కార్మికులపై లాఠీఛార్జిచేశారు. దాదాపు 500 మందికి గాయాలయ్యాయి.

రైల్వేశాఖతో రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలి!
న్యూఢిల్లీ : వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు మరిన్ని శ్రామిక రైళ్లను నడపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు అవసరమైన ప్రత్యేక వసతులు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అజరు భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో పాటు ఉపాధి కోల్పోతామనే ఆందోళనతోనే కూలీలు స్వస్థలాలకు పయనమవుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉందని సూచించారు. ఈ క్రమంలో మరిన్ని రైళ్లు నడపడం, విశ్రాంతి సముదాయాలు ఏర్పాటు చేయడం, శానిటైజేషన్‌, ఆరోగ్యం, ఆహారం వంటి వసతుల్ని కల్పించాలని కోరారు. రైళ్లు, బస్సులు ఎప్పుడు ఎప్పుడు బయలుదేరుతాయన్న విషయంలో సందిగ్ధత ఉండొద్దని, ఇది కూలీల అసహనానికి దారితీసే అవకాశం ఉందని అభరు భల్లా పేర్కొన్నారు. కాలినడకన బయలుదేరిన కూలీలను సంబంధిత రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లు, విశ్రాంతి సముదాయాలకు తరలించే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకోవాలని సూచించారు. వలస కూలీల బస్సులను రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపొద్దని కోరారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates