వలస కార్మికుల్ని పట్టించుకోరా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

శ్రామిక్‌ రైళ్ల కోసం రైల్వేను ఎందుకు అడగలేదు?
తరలింపు చర్యలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

శ్రామిక్‌ రైళ్లు నడుపుతామని రైల్వే చెబుతోంది. కానీ రాష్ట్రంలో ఒక్క కలెక్టర్‌ కూడా వీటి గురించి రైల్వేను కోరలేదు. వారి తీరు అర్థం కావడంలేదు. ఇది పెద్ద సంక్షోభ పరిస్థితి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది వలస కార్మికుల సంక్షేమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పినా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వమే ముందుకు వచ్చి ప్రజల సంక్షేమ బాధ్యత చూసుకుంటామని చెబితే అది సుపరిపాలన. అధికారుల తీరు చూస్తుంటే మా ఉత్తర్వులు అమలవుతున్న అభిప్రాయం కలగడంలేదు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది

 -హైకోర్టు

హైదరాబాద్‌: వలస కార్మికుల రవాణాతోపాటు ఆశ్రయం, ఆహారం అందించడానికి చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను తరలించడానికి ఏర్పాట్లు చేయలేదంటూ రిటైర్డ్‌ లెక్చరర్‌ ఎస్‌.జీవన్‌కుమార్‌ దాఖలు చేసి ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల తరలింపుపై నివేదిక ఏదని ప్రశ్నించగా అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ ఇప్పుడే దాఖలు చేశామని చెప్పారు. ఈనెల 2న తాము ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ శ్రామిక్‌ రైళ్లను నడపటంలేదన్న వార్తలు చూశామనగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి బిహార్‌, ఒడిశాకు చెందిన సుమారు 9 వేలమంది ఇటుక బట్టీల కార్మికులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారన్నారు. రైల్వే తరఫు న్యాయవాది పుష్పేందర్‌ కౌర్‌ తమకు శ్రామిక్‌ రైళ్లను నడపటానికి అభ్యంతరం లేదని, అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి వినతి పత్రం రాలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ రైల్వే సిద్ధంగా ఉన్నపుడు కలెక్టర్లు ఎందుకు అడగటంలేదో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించింది. వలస కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదంది. రైళ్లు ఏర్పాటు చేయాలని, అప్పటివరకు వారికి ఆహారం, ఆశ్రయం వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చినా అమలుకావడంలేదంది. జిల్లా యంత్రాంగం రైల్వే స్టేషన్లకు వెళ్లి చూస్తే పరిస్థితులు అర్థమవుతాయంది. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారు.. ఎలా ఉన్నారు.. ఆశ్రయం.. ఆహారం వంటి సదుపాయాలేంటో చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

వ్యవసాయంపై ఒక విధానం ఉండాలి
వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఓ విధానం ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంత పండిస్తున్నారు.. వినియోగమెంత.. ఎంత రవాణా చేయాలి అన్నదానితోపాటు ఏవైనా ఉపద్రవాలు వస్తే పరిహారం అందించడానికి ఓ విధానం ఉండాలని వ్యాఖ్యానించింది. కరోనా అలాంటి ఉపద్రవమేనని, నష్టపోయిన రైతులకు ఏదైనా సాయం అందించే ప్రతిపాదన ఉందో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పండ్ల రవాణాకు ఏర్పాట్లు చేయాలంటూ విశ్రాంత పశువైద్యుడు నారాయణరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారించింది.

బియ్యం, నగదు ఎందుకివ్వలేదు?
మూడు నెలలుగా రేషన్‌ బియ్యం తీసుకోనివారికి 12 కిలోల బియ్యం, రూ.1500 ఎందుకు పంపిణీ చేయలేదో కారణాలు చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలను సడలించి ఆదుకోవాల్సిన సమయంలో లేని నిబంధనలను అమలు చేయడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించింది. 8.5 లక్షలమందికి బియ్యం, రూ.1500 నగదు పంపిణీని నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ ఎ.సృజన, మక్సూద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ఏజీ స్పందిస్తూ 8.5 లక్షలమందికి బియ్యం, నగదు పంపిణీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాజస్థాన్‌లో 3 నెలలు బియ్యం తీసుకోని పక్షంలో తరువాత రద్దవుతుందని, ఇలాంటి నిబంధన ఇక్కడ లేనపుడు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తమ ఉత్తర్వుల అమలును నిలిపివేయనపుడు వాటిని ఇక్కడ అమలు చేసి తీరాల్సిందేనంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను 22కి వాయిదా వేసింది.

లాక్‌డౌన్‌ పొడిగించాలన్న పిటిషన్‌ కొట్టివేత
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తివేతను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ప్రజలు బయటికి వెళ్లాలని ఎవరూ బలవంతం చేయలేదని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates