వలసకూలీ… కడుపు ఖాళీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆకలితీర్చే మార్గాలేవీ?

దేశంలో చాలినన్ని ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయిదు కోట్ల 30లక్షల టన్నుల ధాన్యం అందుబాటులో ఉందని, అందులో మూడు కోట్ల టన్నులు వరి కాగా- మిగిలినది గోధుమ అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల గణాంకాలు వెల్లడించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 76 లక్షల టన్నుల వరి, కోటి 38 లక్షల టన్నుల గోధుమ- మొత్తంగా కలిపి రెండు కోట్ల 14 లక్షల టన్నుల అదనపు నిల్వలు భారత ఆహార శాఖ వద్ద ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అవసరమైన దానికంటే చాలా పెద్దమొత్తంలోనే దేశంలో అదనపు ఆహార నిల్వలు పోగుపడ్డాయి. కానీ, ఇంత ధాన్యం మన గాదెల్లో మగ్గుతున్నా 20 కోట్లమంది ఆకలితో సతమతమవుతుండటమే విచిత్రం. పేదవాడి ఆకలి మాపాల్సిన ఆహార ధాన్యాలు గిడ్డంగులకే పరిమితమవుతున్న దుస్థితి మనముందుంది. రబీ పంట చేతికొచ్చే సమయమిది. 2019-20 కాలానికి దేశంలో ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 29.2 కోట్ల టన్నులుగా ఉండబోతోందని అంచనా. ఆ రకంగా నిరుటితో పోలిస్తే 67.4 లక్షల టన్నుల అదనపు ఉత్పత్తి దఖలుపడుతోందన్నమాట. దేశాన్ని ఇప్పుడు ఒకవైపు ఆకలి, మరొకవైపు కరోనా వణికిస్తున్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోని వలస కూలీలకు ఈ జంట ప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జాతి జనుల ఆకలి తీర్చగల స్థోమత ప్రభుత్వానికి ఉంది. అందుకోసం సర్కారీ వ్యవస్థలను సవ్యంగా పట్టాలకెక్కించాల్సి ఉంది.

సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరిసేలా…
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌), సమీకృత బాలల అభివృద్ధి కార్యక్రమా(ఐసీడీఎస్‌-అంగన్‌వాడీ)లకోసం దేశం నలుమూలలా పెద్దయెత్తున సిబ్బంది ఉన్నారు. వీటి నిర్వహణకోసం గడచిన 40 ఏళ్లకాలంలో పల్లెపల్లెలోనూ విస్తృతమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకోగలిగాం. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్‌కు 17 లక్షల సిబ్బంది ఉన్నారు. ఇది త్రివిధ దళాల మొత్తం సంఖ్యకన్నా ఎక్కువ. వీళ్లంతా సామాజిక సంక్షేమం కోసం పాటుపడుతున్న వీరులు. కరోనా ఉరుముతున్న ఈ తరుణంలో వలస కార్మికుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. అసంఘటిత రంగం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనాపై యుద్ధమంటే ఎక్కడికీ కదలకుండా ఎవరికివారు ఇళ్లలో ఉండిపోవడమే! జిల్లానుంచి మరో జిల్లాకు, రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసలు సాగితే తప్ప అసంఘటిత రంగానికి మనుగడ లేదు. వలస కూలీలు ఒక ప్రాంతంనుంచి మరో చోటికి వెళ్ళడానికి కారణం… ఆకలి! కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తలుపులు బిడాయించుకుని ఇళ్లలో కూర్చోకుండా అటు ఇటు తిరిగితే కరోనా కాటేసే ప్రమాదం ఉంది. ముందు చూస్తే నుయ్యి… వెనకకు వెళితే గొయ్యి లాంటి పరిస్థితి ఇది. కరోనాను కట్టడి చేస్తూనే…. వలస కూలీల ఆకలి సమస్యను తీర్చడమెలా అన్నదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. ఈ యుద్ధంలో పీడీఎస్‌, ఐసీడీఎస్‌ సిబ్బందిని; వైద్య ఆరోగ్య మానవ వనరులను తొలి వరస సామాజిక సేనావాహినిగా తీర్చిదిద్ది ముందుకు దూకించాల్సి ఉంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో దేశంలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వెళ్ళేందుకు వీరికి నియంత్రణలతో కూడిన అనుమతులు ఇవ్వాలి. అవసరమైన సాధన సంపత్తిని తీసుకువెళ్ళేందుకూ వీరికి తగిన అనుమతులివ్వాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిసలైన సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాలి. పేదలకు రుణ సదుపాయాలకోసం ఆర్‌బీఐ, కేంద్ర గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాల సరఫరా కోసం ఎఫ్‌సీఐ చురుగ్గా రంగంలోకి దిగాలి. రుణ మొత్తాలను సమర్థంగా అర్హులకు చేర్చడం; ఆహార ధాన్యాలను లబ్ధిదారులకు సరఫరా చేయడం వంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో సాగాలి.

నగరాలు, పట్టణాల్లోని అన్ని పేదల బస్తీల్లోనూ; గ్రామాల్లోని బడుగుల వాడల్లోనూ ఉచిత ఆహారశాలలను అందుబాటులోకి తీసుకురావాలి. వలస కూలీలు, ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అన్వేషించాలి. ఆ రకంగా దేశంలో 20 కోట్లమందినీ ఆహారశాలల పరిధిలోకి తీసుకురావాలి. అంగన్‌వాడీ కార్మికుల తోడ్పాటుతో తొలుత ప్రతి కేంద్రంలోనూ ఈ భోజనశాలలు ప్రారంభించాలి. అందుకోసం అంగన్‌వాడీ కార్మికుల పనిగంటలు పెంచాలి. ఈ బృహత్తర క్రతువులో పాల్పంచుకునే అంగన్‌వాడీ కార్మికులకు అవసరమైన భద్రత కల్పించాలి. వేతనం పెంచాలి. కరోనా వైరస్‌ బారినపడకుండా వారికి రక్షణాత్మక ఉపకరణాలన్నీ సమకూర్చాలి. ఔషధాలు సరఫరా చేయాలి. భౌతిక దూరం పాటించే విషయంలో శిక్షణ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికీ కుటుంబ బీమా కల్పించాలి. అన్నార్తులను గుర్తించి వారి దగ్గరికి సమర్థంగా చేరుకునే యంత్రాంగం చాలా ముఖ్యం. దక్షిణాది రాష్ట్రాల్లో పీడీఎస్‌, ఐసీడీఎస్‌లకు నిర్దిష్ట వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా దక్షిణ భారత గ్రామాల్లో అర్హులను గుర్తించడం, వారిని చేరుకోవడం సులభ సాధ్యం. ఉత్తరాదిన ఈ వ్యవస్థలు అంత పకడ్బందీగా లేవు. సార్వత్రిక ఎన్నికల సమయాల్లో మారుమూల గ్రామాలను చేరుకొని, సేవలను అందించేందుకు ఉపయోగించే పద్ధతులను ఇప్పుడు అమలు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వ సిబ్బందిని సన్నద్ధం చేసి, వారికి అదనపు వేతనాలు చెల్లించి, భౌతిక దూరంపై శిక్షణ ఇచ్చి, కుటుంబ బీమా సమకూర్చి రంగంలోకి దింపాలి.

అన్నార్తులను ఆదుకోవడమే కీలకం
ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారం సమకూర్చడమే అంతిమ లక్ష్యంగా ఈ కృషి సాగాలి. గుర్తింపు కార్డులు లేనివారినుంచి తక్షణం అవసరమైన వివరాలు రాబట్టి, చుట్టుపక్కల వారి ద్వారా వాటిని ధ్రువీకరించుకుని వారికి తాత్కాలిక కూపన్లు అందజేయాలి. ఆ రకంగా వలస కూలీల ఆత్మ గౌరవాన్నీ కాపాడాలి. లాక్‌డౌన్‌ కొనసాగినంతకాలం వలస కూలీల ఆకలి తీర్చే సాధనాలుగా ఈ కూపన్లు ఉపయోగపడతాయి. ఎవరూ ఆకలి సమస్యతో బాధపడకుండా చూడటమే పరమార్థం కావాలి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చి స్థిరపడిన వలసకూలీలెవరికీ ఆకలి సమస్య తలెత్తకుండా బాధ్యత తీసుకుంటామనడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా తొలి అడుగులు వేశారు. ప్రభుత్వాలు అడుగు ముందుకు వేస్తే దాతలు, స్వచ్ఛంద సేవకులూ పెద్దయెత్తున ఆ వెంట కదులుతారు. ఆకలిగొన్నవారికి పట్టెడన్నం పెట్టడాన్ని మతాలన్నీ మహోన్నత సేవగా గుర్తిస్తున్నాయి. అన్నదానం చేయడానికి సాధారణంగా భారతీయులు చాలా ఉత్సాహంగా ముందుకు కదులుతుంటారు. మరోవంక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమంలో వేతనంగా ఆహార ధాన్యాలనూ ఇవ్వాలి. ‘నరేగా’ పనివారికి రోజువారి అవసరాలకు సరిపడా    రెండున్నరనుంచి మూడు కిలోల ధాన్యాలను వేతనంలో భాగంగా ఇవ్వాలి. కరోనా కట్టడికి వీలైనంత విస్తృతంగా పరీక్షలు చేయడమే పరిష్కారంగా చెబుతున్నారు. అలాగే ఆకలితో ఉన్న వీలైనంతమందిని చేరుకుని వారికి అన్నం పెట్టడమే వలస కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం. పరిశ్రమలకు తిరిగి ప్రాణం పోసేందుకు వేలు, లక్షల కోట్ల రూపాయలను ఉద్దీపన కార్యక్రమాలకింద ఇచ్చేందుకు సిద్ధపడే ప్రభుత్వాలు ఒకవిషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పారిశ్రామిక రథ చక్రాలు ముందుకు కదలాలంటే కార్మికుల కష్టం తీరాలి… వారి ఆకలి మలగాలి… వారి జబ్బలకు సత్తువ సమకూరాలి. అప్పుడే ఉత్పత్తి రంగం ఉరకలెత్తుతుంది… ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుంది. ఆ క్రమంలో ప్రభుత్వాలు తిరుగులేని చొరవ కనబరచాల్సిన తరుణమిది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates