నిరాదరణకు గురౌతున్న వలస కార్మికులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హర్షమందిర్‌

లాక్‌డౌన్‌ కాలంలో పని, ఆహారం లేక పట్టణాలలో అర్ధాంతరంగా వదిలివేయబడిన మిలియన్ల సంఖ్యలో ఉన్న వలస కార్మికులు, యోగ్యత లేని ఆశ్రయ కేంద్రాల్లో తిండి కోసం బారులు తీరి నిల్చొని, వారి కుటుంబాలతో వందల మైళ్ళు నడుచుకుంటూ, వారి తల్లిదండ్రులకు, పిల్లలకు ఆహారం, మందులు ఏ విధంగా సమకూర్చాలో తెలియని స్థితిలో గౌరవప్రదమైన జీవనానికి దూరమవుతున్నారు.

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా భారతదేశంలో మార్చి 24 అర్థరాత్రి నుంచి భౌతికపరమైన కదలికలులేని కఠినతరమైన లాక్‌ డౌన్‌ అమలు మొదలై, ప్రపంచంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. మూడు వారాల అనంతరం, ‘స్ట్రాండెడ్‌ వర్కర్స్‌ ఆక్షన్‌ నెట్వర్క్‌’ (స్వాన్‌) అనే సంస్థ 11,159 మంది కార్మికులను సర్వే చేసి, అర్థంతరంగా వదిలివేయబడిన వలస కార్మికులు ఈ లాక్‌డౌన్‌ వలన పెద్ద ఆపదలో ఉన్నారని తేల్చింది. ఆ సర్వే ఒక భయంకరమైన ఆకలి సంక్షోభాన్ని తెలియపర్చింది. 50శాతం మంది కార్మికులకు ఒక్క రోజుకు సరిపోని రేషన్‌ మాత్రమే దొరికింది. 72శాతం మంది కార్మికులు తమ రేషన్‌ రెండు రోజులలోనే అయిపోతాయని ‘స్వాన్‌’ టీం సభ్యులతో చెప్పారు. ఎందుకంటే వారి వద్ద కొద్ది డబ్బుండటం లేదా అసలు డబ్బు లేకపోవడంతో, తరువాత భోజనాలు ఎప్పుడు, ఎలా అనే అనిశ్చిత పరిస్థితిని తీవ్రంగా ఎదుర్కొన్నారు. కొందరు చాలా మితంగా, పొదుపుగా తింటున్నారు. బెంగుళూర్‌లో 240మంది కార్మికులు, ”తాము ఆహార ధాన్యాలు పొదుపు చేయడానికిగాను రోజుకు ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తున్నట్టు” ‘స్వాన్‌’ సభ్యులతో చెప్పారు.

పంజాబ్‌ రాష్ట్రంలోని భటిండాలో అర్థంతరంగా వదిలివేయబడిన బీహార్‌కు చెందిన సుజిత్‌కుమార్‌ అనే కార్మికుడు, తాను నాలుగు రోజులుగా భోజనం చేయలేదని చెప్పాడు. నోయిడాలో మధ్యస్థంగా ఆగిపోయిన యాస్మిన్‌ అనే 10వ తరగతి చదువుతున్న కుర్రాడు ”మా కుటుంబంలో నలుగురు పాలు తాగే చిన్న పిల్లలు ఉన్నారు. పాలు లేక వారికి పంచదార నీళ్లు తాగిస్తున్నట్టు” చెప్పాడు.

పొడవైన వరుసలు
96శాతం మంది కార్మికులు ప్రభుత్వం నుంచి ఏ విధమైన రేషన్ను, 70శాతం మంది ఏ విధమైన వండిన ఆహారాన్ని పొందలేదు. బీహార్‌ రాష్ట్రాంలోని ముజఫర్‌పూర్‌కు చెందిన సురేష్‌, ఢిల్లీలో ఒక భవన నిర్మాణ కార్మికుడు. అతడు అనేక సందర్భాల్లో ఒక ప్రభుత్వ ఆహార కేంద్రానికి వెళ్ళాడు, కానీ ”పొడవైన వరుసల (లాంగ్‌ క్యూ) వలన నేను దగ్గరకు చేరే సరికి భోజనం అయిపోయేదని” అన్నాడు. దిల్‌ మహమ్మద్‌ ఒక డ్రైవర్‌. తాను ఆహార సరఫరా కేంద్రానికి తన ఇద్దరు పిల్లల కోసం వెళ్ళి నాలుగు గంటలు వరుసలో నిలబెడితే, చివరకు భోజనం అయి పోయిందని కేవలం నాలుగు అరటి పండ్లు ఇచ్చారని చెప్పాడు.

ఆహారంతో పాటు అనేక మంది కార్మికులకు నగదు అందని పరిస్థితి ఉంది. 78శాతం మంది కార్మికులు రూ.300 కన్నా తక్కువ నగదును పొందారు. 70శాతం మంది కార్మికులు మిగిలిన లాక్‌డౌన్‌ కాలానికి రూ.200 కన్నా తక్కువ (ఒక రోజు కూలీలో సగం కన్నా తక్కువ) పొందినారు. ”నాకు ఒక సంవత్సరం వయసున్న కూతురు, మానసికంగా కుంగిపోయిన భర్త ఉన్నారు. వారి కొరకు మందులు కొనాల్సిన అవసరం ఉంది. కానీ నా వద్ద డబ్బులేదని” బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌కు చెందిన హైదరాబాదులో అర్థంతరంగా ఆగిపోయిన అఫ్సనా ఖతూన్‌ చెప్పింది. 98శాతం మంది కార్మికులు ప్రభుత్వం నుంచి ఏ విధమైన నగదు సహాయాన్ని పొందలేదు. లాక్‌డౌన్‌ కాలంలో 89శాతం మంది కార్మికులు తమ యాజమానుల నుంచి ఏ విధమైన చెల్లింపులు పొందలేదు. సుమారు 9శాతం మందికి మాత్రమే పాక్షికంగా చెల్లింపులు జరిగినాయి. యజమానుల ద్వారా రేషన్‌ పొందిన వారికి, ఆ రేషన్‌కు సంబంధించిన డబ్బును, తరువాత వారికి ఇచ్చే చెల్లింపుల నుంచి మినహాయిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని బయట ఫిర్యాదు చేయవద్దని కొంత మంది కార్మికులను బెదిరించినారు.

41శాతం మంది కార్మికులు పట్టణాలు, నగరాలలో ఉంటామని తెలిపారు. 1/3వ వంతు కార్మికులు అదే పనిలో, అదే యజమాని వద్ద పనిచేస్తామని అంటున్నారు. మరొక 1/3వ వంతు కార్మికులు ఏం పని చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. షుమారు 16శాతం మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లి, కొంత కాలం తరువాత తిరిగి రావాలనీ, 13శాతం మంది తమ స్వంత గ్రామాల్లో పనిని వెతుక్కుంటామని అంటున్నారు. ఒక 5శాతం మంది కొంత సంపాదించుకొని తిరిగి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు.

అవమాన భారంతో కలత చెందిన వలస కార్మికులు, ముఖ్యంగా ముంబై నగరంలో పని చేస్తున్న జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడు తీవ్రమైన మానసిక వ్యధకు గురై ”మేము మోడీ కండ్లకు ఈగలు ,దోమల్లా కనిపిస్తున్నాం. కాబట్టి మేము వాటి లాగే చనిపోవాల్సి ఉంటుంది” అని అన్నాడు.

ప్రశాంత్‌ భూషణ్‌, చెరిల్‌ డి’సౌజా అను న్యాయవాదులు, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వలస కార్మికులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం గౌరవంగా జీవించే హక్కుకు మద్దతు కోరుతూ ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషన్‌ దారులు నేను, అంజలీ భరద్వాజ్‌.

లాక్‌డౌన్‌ కారణంగా సష్టించబడిన తీవ్రమైన మానవత్వ సంక్షోభాన్ని పిటిషన్‌ ఎత్తి చూపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ”ఉమ్మడిగా, వేర్వేరుగా” ఈ పూర్తి లాక్‌డౌన్‌ కాలానికి వారం రోజుల్లో వలస కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తామన్న హామీ ఇవ్వాలన్నది పిటిషన్‌ ప్రధాన డిమాండ్‌. అదే విధంగా, ప్రభుత్వం వద్ద వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమగ్రమైన రికార్డు లేమీ లేవు కాబట్టి, కార్మికుల స్వీయ ధవీకరణ, స్వీయ గుర్తింపు పత్రాల ఆధారంగానే వేతనాల చెల్లింపులు జరగాలని పిటీషన్‌ డిమాండ్‌ చేసింది.

అరకొర ప్రతిస్పందన
కేంద్ర ప్రభుత్వ లోపాలను, అరకొర ప్రతిస్పందనలను పిటీషన్‌ వివరించింది. ఆర్థిక ప్యాకేజీ నిమిత్తం 1.70 లక్షల కోట్లు ప్రకటించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ ప్యాకేజీ జీడీపీలో కేవలం ఒకశాతం కన్నా కొంచెం ఎక్కువ అనీ, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు అది ఏ మాత్రం సరిపోదని పిటిషనర్లు సమాధానం ఇచ్చారు.

ఈ ప్యాకేజీలోని అనేక అంశాలు ఇప్పటికే ఉన్న పథకాలలో అమలౌతున్నవే. అవి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెరిగిన రోజు వారీ వేతనం, ‘బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ సెస్‌’ నిధులను అత్యవసర పరిస్థితిలో ఉపయోగించడం లాంటివి. ప్రజాపంపిణీ వ్యవస్థ శాశ్వత చిరునామా ఆధారంగా అమలు అవుతున్న కారణంగా, 5కిలోల ఆహార ధాన్యాలు, ఒక కిలో పప్పు దినుసులు పెద్ద సంఖ్యలో ఉన్న వలస కార్మికులకు అందుబాటులో ఉండవు.

20.4 కోట్ల జన్‌ధన్‌ మహిళా ఖాతాదారులకు బదిలీ చేసే ఐదు వందల రూపాయలు ఏ మాత్రం సరిపోవు. జనసాహస్‌ ఆధ్వర్యంలో ఉత్తర, మధ్య భారతదేశంలో 3,196మంది వలస నిర్మాణ కార్మికుల పై చేసిన ర్యాపిడ్‌ సర్వేలో 94శాతం భవన నిర్మాణ కార్మికులకు కార్డులు లేవని తేలింది.
రోజు వారీ అవసరాలు తీరుతున్నాయట.

తాము ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వలస కార్మికులు, వారి కుటుంబాలతో పాటు ప్రతి పేదవాడి రోజువారీ అవసరాలు తీర్చుతుందని, వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్ళవలసిన ఆవశ్యకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వారు ఎక్కడ పనిచేసినా వారి అవసరాలను, గ్రామాల్లో వారి కుటుంబ అవసరాలను తీరుస్తున్నామని చెబుతుంది. తమ స్వస్థలాలకు వచ్చిన సందర్భంలో క్వారంటైన్‌లలో వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయం, మందులు సమకూర్చాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

వలస కార్మికులకు సమకూర్చిన సహాయక శిబిరాలు, ఆశ్రయాల సంఖ్య వలస కార్మికులకు అధికారికంగా చేయాల్సిన ఏర్పాట్ల కన్నా తక్కువగా ఉన్నాయి. మొత్తం 26,476 సహాయక శిబిరాలు, ఆశ్రయాల్లో 10,37,027 మంది ఉన్నట్టు ప్రభుత్వం సుప్రీంకోర్టు కు తెలిపింది. కేరళ ఒక్క రాష్ట్రంలోనే 59శాతం సహాయక శిబిరాలు, ఆశ్రయాలున్నాయి. హర్యానా, ఢిల్లీలు 51శాతం సహాయక శిబిరాల్లో 15లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్టు నివేదికలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం మార్చి 29న విడుదల చేసిన ఆర్డర్‌కు సంబంధించిన సమస్యల్ని కూడా పిటిషన్‌ లేవనెత్తింది. విపత్తుల నిర్వహణ చట్టం, 2005 అన్ని ప్రభుత్వ, ప్రయివేటు రంగానికి చెందిన యాజమాన్యాలు లాక్‌డౌన్‌ కాలానికి వారి కార్మికులకు వేతనాల చెల్లింపులు కొనసాగించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. అదే కాలంలో కార్మికుల ఇంటి యజమానులెవ్వరూ అద్దె చెల్లింపులను కోరరాదని ఆజ్ఞలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌ కాలంలో మార్చి 29 ఆర్డర్‌ ప్రకారం వలస కార్మికుల కోసం రెండు ప్రధానమైన రక్షణ చర్యలు తీసుకున్నారు. దాని ప్రకారం వారి ఆదాయాల రక్షణ భారం, వారిని ఇండ్లు ఖాళీ చేయకుండా ఉంచే భారాన్ని వారి యజమానులు, ఇంటి యజమానుల భుజాలపై వేశారు. కానీ ఆ ఆర్డర్‌ అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు, అతిక్రమిస్తే పరిహారం చెల్లించే ఏర్పాటు చేయలేదు.

ఆ ఆర్డర్‌ అధికసంఖ్యలో ఉన్న స్వయం ఉపాధి కార్మికులకు ఆర్థిక భద్రతా ఏర్పాట్లు చేయలేదు కాబట్టి, వీధి అమ్మకందారులకు, రిక్షాకార్మికులకు, రజక వృత్తి దారులకు, చిన్న చిన్న పనులు చేసేవారికి, చిత్తుకాగితాలు ఏరుకునే వారికి, సెక్స్‌ వర్కర్‌లకు ఏ విధమైన వేతనాలు చెల్లించలేదు. అదే విధంగా కార్మికవర్గంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న తాత్కాలిక రోజువారీ వేతన కార్మికులను అది(ఆర్డర్‌) పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసింది

గౌరవం నిరాకరణ
ఏప్రిల్‌ 7వ తేదీన వాదనలు జరిగే క్రమంలో, కార్మికులకు ఆహారం సమకూర్చబడుతుంది కదా! మరి వారికి డబ్బు అవసరం ఏమిటని చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించాడు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదని బెంచ్‌ పేర్కొంది. ప్రభుత్వం ప్రారంభించిన ఆహార సరఫరా కేంద్రాల్లో ఆహారం అందని విషయం, కిక్కిరిసిన ఆశ్రయ కేంద్రాల్లో తినేట్లు వీలులేని ఆహారం గురించి న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ, ఆ ప్రాంతంలో ఫిర్యాదుల కోసం ఒక హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని పేర్కొన్నారు. చివరి వాదనలలో, కొత్తగా నియమించబడిన బెంచ్‌ కేసును క్లుప్తంగా విన్నది. ఈ వాదనల్లో పిటిషన్‌ దారులు సుప్రీంకోర్టు లో అదనంగా ‘స్వాన్‌’ అధ్యయనాలను సమర్పించారు. కానీ భయంకరమైన నిరాశ నిస్పహలు, పేదరికం, ఆకలి సమస్యలు కోర్టు ను నమ్మించ లేక పోయాయి. ప్రభుత్వం భిన్నమైన వివరణలను ఇస్తున్నప్పుడు ప్రయివేట్‌ సంస్థలు నిర్వహించిన సర్వేల పైన కోర్టు ఆధారపడదని బెంచ్‌ పేర్కొంది. దీనితో వలస కార్మికులకు ఏ విధమైన ఉపశమనం కలిగించకుండానే కేసును మూసివేశారు. ”పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆదేశిస్తున్నాము” అని ఆర్డర్‌ జారీ చేశారు.

లాక్‌డౌన్‌ కాలంలో పని, ఆహారం లేక పట్టణాలలో అర్ధాంతరంగా వదిలివేయబడిన మిలియన్ల సంఖ్యలో ఉన్న వలస కార్మికులు, యోగ్యత లేని ఆశ్రయ కేంద్రాల్లో తిండి కోసం బారులు తీరి నిల్చొని, వారి కుటుంబాలతో వందల మైళ్ళు నడుచుకుంటూ, వారి తల్లిదండ్రులకు, పిల్లలకు ఆహారం, మందులు ఏ విధంగా సమకూర్చాలో తెలియని స్థితిలో గౌరవప్రదమైన జీవనానికి దూరమవుతున్నారు.

(Scroll.in సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates