అవ్వ… కూలి రూ.50లోపేనంట

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఉపాధి కూలీల శ్రమకు దక్కని ఫలితం
– సర్కారోళ్లు చెప్పిన రూ.237 కూలి పడ్తే ఒట్టు
– ఫీల్డు అసిస్టెంట్ల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న వైనం
– అన్ని జిల్లాల్లోనూ సగటు వేతనం 162 రూపాయలే
– కనిపించని మాస్కులు, శానిటైజర్లు…భౌతికదూరం
– అమలు కాని భౌతికదూరం

‘ఉపాధి కూలీలకు రోజువారీ కనీస వేతనం రూ.237 ఇస్తున్నాం’ ఇదీ కేంద్రం మాట. సర్కారోళ్లు చెప్పిన రూ.237 ఏమోగానీ కనీసం రూ.100 కూలి పడ్తే ఒట్టు. ఇంకాస్త లోతుకెళ్తే కొన్నిచోట్ల కూలీలకు దక్కుతున్నది 50 రూపాయలేనంట. అదీ పేస్లిప్పులు ఇస్తలేరంట. ‘కరోనా నేపథ్యంలో ఉపాధి కూలీలకు మాస్కులు ఇస్తున్నాం. శానిటైజర్లను సమకూరుస్తున్నాం. భౌతిక దూరం పాటిస్తూ పనులు జరిగేలా చూస్తున్నాం’ ఇవీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి మాటలు.
క్షేత్రస్థాయిలో ఉపాధి పని ప్రదేశాల్లో ‘మాస్కులు కనిపించడంలేదు. శానిటైజింగ్‌ అసలే లేదు. ఒక్కో గ్రూపులో 50 మందికిపైగా ఉండటంతో భౌతిక దూరం నిబంధన అటకెక్కింది. సర్కారు చెబుతున్న కూలి…క్షేత్రస్థాయిలో దక్కుతున్న కూలిని, కరోనా జాగ్రత్తలు…కిందిస్థాయిలో అమలు, ఇలా అన్నింటిని పోలికబెట్టి చూస్తే ఎవ్వరైనా హవ్వ గింత తప్పుడు మాటలా?

చెప్పుడొకటి? చేసుడొకటా? గిదేం న్యాయం అనక తప్పని పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఉపాధికూలీల శ్రమకు దక్కని వేతనంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీకి సంబంధించి 25.84 లక్షల జాబుకార్డులున్నాయి. ప్రస్తుతం 40.15 లక్షలకుపైగా కూలీలు పనిచేస్తున్నారు. గతంలో 14 ఏండ్లకుపైగా ఫీల్డు అసిస్టెంట్లు గ్రామాల్లో ఉండేవారు. ఏ కాలంలో ఏ నేలలో పనిచేస్తే కూలీలకు గిట్టుబాటు అవుతుంది?
మంచి వేతనం దక్కుతుంది? అని ఆలోచించి పనులు గుర్తించేవారు. కానీ, సర్కారు తన మంకుపట్టుతో..సమస్యలు పరిష్కరించాలని అడిగిన ఫీల్డు అసిస్టెంట్లను నిర్ధాక్షిణ్యంగా తీసిపారేసింది. పనుల గుర్తింపు, కొలతలు వేయడం వంటి పనులను గ్రామ కార్యదర్శులకు అప్పగించింది.

ఇప్పటికే తలకుమించిన పనులతో సతమతమవుతున్న గ్రామకార్యదర్శులపై ఇది గుదిబండలాంటిదే. కార్యదర్శులు ఏదో మొక్కుబడిగా పనులు చూపెట్టి, తమ వీలును బట్టి సరైన అంచనా లేమితనంతో కొలతలేయడంతో కూలీలకు తీరని నష్టం జరుగుతున్నది. ఆ కొలతలూ నాలుగైదు రోజులకోసారి వేస్తున్న పరిస్థితి. దీంతో లెక్కల్లో తేడాలు వచ్చి కూలీలకు అన్యాయం జరుగుతున్నది.

వేసవిలో చెరువుల్లో, ఇతర ప్రాంతాల్లో పొద్దంత కష్టపడ్డా గట్టి నేల కావడంతో జానెడు లోతు మట్టిపొర కూడా తెగడం లేదు. దీంతో కూలీలకు సరైన కూలి పడట్లేదు. వేసవి,కరోనా నేపథ్యంలో కనీస వేతనం రూ.237 రూపాయలైనా పడితే కాస్త ఉపశమనం దక్కుతుందని కూలీల ఆశ నిరాశగానే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం సగటు వేతనం రూ.162 పడుతుందని చెబుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో వందలోపే కార్మికులకు దక్కుతున్నది.

కొన్ని గ్రామాల్లోనైతే కనీసం 50 రూపాయల కూలి కూడా కూలీలకు దక్కట్లేదు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం రుద్రారం, లక్ష్మీపురం, గూడూరు గ్రామాల్లో పనిప్రదేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నేతలు క్షేత్రస్థాయి పర్యటన చేయగా రూ.50 నుంచి రూ.60 లోపే కూలి పడుతున్నది. బోజ్యానాయక్‌ తండాలో వారమంతా పనిచేస్తే ఓ గ్రూపునకు రూ.372 మాత్రమే పడింది. అంటే రోజుకు రూ.53 కూడా రాలేదు.

వాస్తవానికి గవర్నమెంట్‌ లెక్కల ప్రకారం వేసవి, ఇతర అలవెన్స్‌ల కిందనే రూ.50 వరకు ఇవ్వాలి. రూ.53 వేతనాన్ని బట్టి చూస్తే సర్కారు అలవెన్స్‌లు కూడా ఇవ్వట్లేదని స్పష్టం అవుతున్నది. ఒకవేళ ఇచ్చిందనుకుంటే కూలి రూ.3 మాత్రమే. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారంలో రూ.45-50 మాత్రమే పడ్డ పరిస్థితి.

వేలేరు మండలంలో ఓకూలికి రూ.35 పడింది. ఐనవోలు మండలంలో రూ.45 దక్కింది. నిజామా బాద్‌ జిల్లా మోస్రా మండలం తిమ్మాపూర్‌లో రూ.35 కూలి పడ్డ ఉదహరణ కూడా ఉంది. పనిప్రదేశాల్లో మట్టి తవ్వడం, ఎత్తిపోవడం వంటి పనుల వల్ల భౌతిక దూరం అనేది సాధ్యం కావడంలేదు.

రంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాల్లో ఒక్కో గ్రూపులో 40 నుంచి 50 మంది కూలీలు ఉండటంతో భౌతికదూరం అనేది సాధ్యపడట్లేదు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ శానిటైజర్లు, మాస్కులు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కానరావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్నే మరిచింది. కొన్నిచోట్ల కూలీలు తువ్వాలలు మూతికి కట్టుకుని పనిచేస్తున్నారు. చాలా చోట్ల పనిప్రదేశాల్లో అదీ చేయట్లేదు. శానిటైజింగ్‌ ప్రక్రియ అసలే లేదు. కనీసం నీళ్లతో కడుక్కుందామన్నా వారు మోసుకెళ్లే రెండు లీటర్ల డబ్బా నీళ్లు తాగడానికే సరిపోవట్లేదు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates