వర్గపోరాటాలతోనే దోపిడీలేని సమాజం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – కార్మికుల ఐక్యత వల్లే పెట్టుబడిదారీ విధానానికి చెక్‌
– నిత్య చైతన్య దీపిక ‘కమ్యూనిస్టు ప్రణాళిక’
– ప్రపంచానికే మార్గం చూపిన శాస్త్రీయ గ్రంథం:పుస్తకావిష్కరణలో వక్తలు
– నా జీవితాన్ని మార్చింది ఈ పుస్తకమే : శివారెడ్డి
– సొంత ఆస్తిరద్దుతో పెట్టుబడిదారీ విధానం పతనం : తమ్మినేని
– వామపక్ష, లౌకిక, ప్రజాతంత్రశక్తులు ఐక్యంకావాలి : సురవరం

కమ్యూనిజం అజేయమనీ, పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం కమ్యూనిజమేననీ పలువురు వక్తలు ఉద్ఘాటించారు. కమ్యూనిస్టుల పని అయిపోయింది, కమ్యూనిజానికి కాలం చెల్లింది అన్న వారికి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ 172 ఏండ్లయినా నిత్య చైతన్య దీపికగా ప్రజల్లో స్ఫూర్తిని నింపడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. వర్గపోరాటాలతోనే దోపిడీలేని సమసమాజం ఏర్పడుతుందని చెప్పారు. కార్మికుల నిత్యం సంఘర్షణకు గురవుతారనీ, దానిలోనుంచే ఐక్యత వస్తుందని, అది పోరాటాలకు దారితీస్తుందని వివరించారు. కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే పెట్టుబడిదారీ విధానం నాశనమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచానికే మార్గం చూపిన శాస్త్రీయ గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక అని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ గ్రంథాన్ని ప్రముఖ కవి కె శివారెడ్డి ఆవిష్కరించారు. లక్ష కాపీలు అమ్మడమే లక్ష్యంగా నవతెలంగాణ, నవచేతన, ప్రజాశక్తి బుకహేౌజ్‌, విశాలాంధ్ర, పీకాక్‌ క్లాసిక్స్‌ ప్రచురణ సంస్థలు కమ్యూనిస్టు ప్రణాళికను ముద్రించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకట్రామయ్య (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), గాదగోని రవి (ఎంసీపీఐయూ), గోరటి వెంకన్న (ప్రజావాగ్గేయకారులు), విమలక్క (తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌), తెలకపల్లి రవి (రాజకీయ విశ్లేషకులు), జశ్వంత్‌ (జనశక్తి సంపాదకులు), కె చంద్రమోహన్‌ (నవతెలంగాణ ప్రచురణాలయం), మధుకర్‌ (నవచేతన ప్రచురణాలయం) తదితరులు పాల్గొన్నారు.

అద్భుత గ్రంథం : శివారెడ్డి
మార్క్స్‌-ఏంగెల్స్‌ రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ అద్భుతమైన గ్రంథమని ప్రముఖ కవి కె శివారెడ్డి అన్నారు. తన జీవితాన్ని సమూలంగా మార్చింది ఈ గ్రంథమేనని వివరించారు. తాను గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ప్రేరణ నిచ్చిందన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, లెనిన్‌ కావ్యం చదివి తాను స్ఫూర్తిపొందానని చెప్పారు. అన్ని కాలాలకూ, అన్ని దేశాలకూ మార్క్సిజం అన్వయించుకోవచ్చని సూచించారు. విస్తరించేందుకు గొప్ప సామాజిక శాస్త్రం అని అన్నారు. సమాజస్వరూపం అర్థం కాకపోతే ఏదీ అర్థం కాదని చెప్పారు. అభిప్రాయభేదాలు పక్కనపెట్టి కమ్యూనిస్టులు కలిసి ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థుల్లోకి ఈ పుస్తకాన్ని తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.

కమ్యూనిస్టు ప్రణాళిక సైద్ధాంతిక ఆయుధం : చాడ
కమ్యూనిస్టు ప్రణాళిక సైద్ధాంతిక ఆయుధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ ప్రణాళిక పట్ల కమ్యూనిస్టు పార్టీల్లో అభిప్రాయభేదాల్లేవని వివరించారు. మానవాళి ఉన్నంతకాలం ఈ గ్రంథానికి తిరుగులేదన్నారు. సహజ వనరులు, సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతమవుతున్నదని చెప్పారు. కమ్యూనిస్టుల చీలిక నష్టం కలిగిందనీ, ఒకే వేదిక మీదకు రావాలనీ చెప్పారు. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టులకు ప్రామాణిక సైద్ధాంతిక గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక అని అన్నారు. కమ్యూనిస్టులు విశాల దృక్ఫథంతో కలిసి పనిచేయాలని సూచించారు. సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నారు. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని చెప్పారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇది చారిత్రక గ్రంథమనీ, అప్పుడు, ఇప్పుడు సజీవమైందని వివరించారు. ఆచరణ ద్వారానే కమ్యూనిస్టుల ఐక్యత సాధ్యమని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలనీ, ప్రత్యామ్నాయం చూపాలనీ ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గాదగోని రవి సూచించారు.

ప్రజావాగ్గేయకారులు గోరటి వెంకన్న మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఐక్యం అవుతారన్న ఆశ ఉన్నదన్నారు. భిన్న ఘర్షణల నుంచే సత్యం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. నిజం నిజం కమ్యూనిజం పాట పాడి ఉత్తేజం నింపారు. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ నేత విమలక్క మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టులు ఏకం కావాలని ఆకాంక్షించారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న వాస్తవాన్ని గ్రహించాలని చెప్పారు. రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ సమాజ గమనాన్ని ఎంతో దార్శనికతతో గమనించి మార్క్స్‌-ఏంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళిక రచించారని గుర్తు చేశారు. ఈ గ్రంథం చదివితే పునరుత్తేజం వస్తుందని చెప్పారు. మితవాదాన్ని ఎదుర్కొనేది వామపక్షవాదమేనని ఉద్ఘాటించారు. మరో ప్రపంచాన్ని సాధించే శక్తి కార్మికులు, శ్రామికులకే ఉందన్నారు. జనశక్తి సంపాదకులు జశ్వంత్‌ మాట్లాడుతూ సైద్ధాంతిక అంశాలపై క్షేత్రస్థాయి నుంచి చర్చ జరగాలని సూచించారు. నవతెలంగాణ ప్రచురణాలయం జనరల్‌ మేనేజర్‌ కె చంద్రమోహన్‌ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంథాన్ని లక్ష కాపీలు వేసి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ లక్ష చొప్పున ఈ పుస్తకాలు ముద్రించి ప్రజలకు అందిస్తామని చెప్పారు. నవచేతన ప్రచురణాలయం జనరల్‌ మేనేజర్‌ మధుకర్‌ వందన సమర్పణ చేశారు.

సంక్షోభంలో పెట్టుబడిదారీ విధానం : సురవరం
పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో ఉన్న దని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఇతర దేశాలపై ఎదురుదాడి చేస్తున్నదన్నారు. పెట్టుబడిదారీ దేశాల మధ్య ఘర్షణకు దారితీస్తుందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని పేద దేశాలపై నెట్టేందుకు ప్రయత్నిస్తాయని అన్నారు. సంఘర్షణ, ప్రతిఘటన లేకుండా విజయం లేదన్నారు. దేశంలో మైనార్టీలు, దళితులు, కమ్యూనిస్టులు, హేతువాదులపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, సంఫ్‌ుపరివార్‌ శక్తులు దాడి చేస్తున్నాయని విమర్శించారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణ జరగాలని ఆకాంక్షించారు.

నాకు స్ఫూర్తినిచ్చిన పుస్తకం ఇది : తమ్మినేని
తనకు స్ఫూర్తినిచ్చిన పుస్తకం కమ్యూనిస్టు ప్రణాళిక అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలోని నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా, విప్లవ సాధనకు, ప్రపంచ మార్పు కోసం రూపొందించేదే కార్యక్రమం అని చెప్పారు. గతితార్కిక సూత్రాల పునాదిపై ప్రపంచం నిరంతరం మారుతుందన్నారు. అంతర్గత ఘర్షణల వల్లే మారుతుందని చెప్పారు. ఫ్యూడలిజం బద్ధలై ఉత్పత్తిలోని వైరుధ్యంలోనుంచి పెట్టుబడిదారీ విధానం వచ్చిందని వివరించారు. సొంత ఆస్తి రద్దు చేయడం వల్ల పెట్టుబడిదారీ విధానం పతనమవుతుందని వివరించారు. సమాజం ముందుకెళ్లడానికి ఓ సమయంలో సొంత ఆస్తి ఆటంకమవుతుందని అన్నారు. పర్యావరణం, గాలి కలుషితమవుతాయని చెప్పారు. పెట్టుబడిదారీ విధానంలో కుటుంబ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారతాయని 172 ఏండ్ల కింద మార్క్స్‌ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిదీ సరుకుగా మారిందన్నారు. వృత్తులన్నీ అదృశ్యమయ్యాయనీ, ఆ పనులు చేసేవారు కూలీలుగా మారిపోతారనీ చెప్పారు. కార్మికులు, పెట్టుబడిదారులే మిగిలిపోతారని అన్నారు. నిజమైన ప్రజాసంస్కృతిని నిర్మించేదే కమ్యూనిస్టులని చెప్పారు. స్త్రీని ఉత్పత్తి సాధనంగా పెట్టుబడిదారులు చూస్తారని వివరించారు. కానీ స్త్రీని మనిషిని చేసేది కమ్యూనిస్టులని అన్నారు. సకల సమస్యలకు పరిష్కారం శాస్త్రీయ గ్రంథం కమ్యూనిస్టు ప్రణాళిక అని చెప్పారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates