మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య.. కేసీఆరే కారణమంటూ నోట్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • పురుగుల మందు తాగి నరేశ్‌ బలి
  • తన చావుకు కేసీఆరే కారణమని నోట్‌
  • ముఖ్యమంత్రి సెల్ఫ్‌ డిస్మిస్ అనడంతో మనస్తాపం
  • దసరా, దీపావళి పండుగలకు పస్తులున్నం
  • కార్మికుల కోసమే చస్తున్నా
  • నా చావే చివరిది కావాలి
  • 6 పేజీల సూసైడ్‌ నోట్‌ లభ్యం
  • మహబూబాబాద్‌లో ఉద్రిక్తత
  • కేసీఆర్‌ వల్లే ఆత్మహత్యలు
  • సీఎంపై క్రిమినల్‌ కేసు పెట్టాలి
  • చర్చలకు పిలవాలి: అశ్వత్థామ
  • పెంబర్తి వద్ద అరెస్టు.. విడుదల

మరో ఆర్టీసీ కార్మికుడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఉన్నంతలో బతుకుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా వీధినపడింది. మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్టీసీ సమ్మెతో రెండు నెలలుగా జీతాలు రాకపోవడం.. కొలువు ఉంటుందో లేదోనన్న ఆందోళన.. భార్యాపిల్లలను ఎలా పోషించుకోవాలనే బెంగ పట్టిపీడించడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మహబూబాబాద్‌ డిపోలో పనిచేస్తున్న ఆవుల నరేశ్‌ (45)దీ విషాదాంతం! తన చావుకు సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌లో తన ఆవేదనను వ్యక్తంచేశాడు. ఆర్టీసీ కార్మికుల్లో తన ఆత్మబలిదానమే చివరిది కావాలని.. కార్మికుల బాగు కోసమే తాను చస్తున్నాని అందులో పేర్కొన్నాడు.

మృతుడికి భార్య పుల్లమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమ్మె మొదలైనప్పటి నుంచి మహబూబాబాద్‌ డిపోలో చేపట్టిన ఆందోళనల్లో నరేశ్‌ కీలకంగా వ్యవహరించాడు. ఉద్యోగం లేకపోతే బతికేదెట్లా? అంటూ కొన్నాళ్లుగా తోటి కార్మికులతో చెప్పుకొని బాదపడ్డాడు. ఈ క్రమంలో ముందుగానే కొని పెట్టుకున్న పురుగుల మందును ఇంట్లో దాచుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు లేచి.. పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటూనే.. మహబూబాబాద్‌ డిపో టీఎంయూ అధ్యక్షుడు చంద్యనాయక్‌తో పాటు సహచర కార్మిక నాయకులకు ఫోన్‌ చేసి తాను చనిపోతున్నానని చెప్పి కుప్పకూలాడు. నిద్రలేచిన కుటుంబసభ్యులు, చంద్యనాయక్‌ సాయంతో ఆయన్ను స్థానిక జిల్లా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరేశ్‌ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.

నరేశ్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లా గోరంట్ల. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో స్థిరపడ్డాడు. 2007లో ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాడు. నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌లో కీలక నాయకుడిగా ఎదిగారు. మూడుసార్లు మహబూబాబాద్‌ డిపో యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పిల్లల్ని చదివించడానికి బాగా అప్పులు చేశాడు. పెద్దకుమారుడు శ్రీకాంత్‌ బీటెక్‌ పూర్తి చేసి బ్యాంక్‌ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. రెండో కుమారుడు బీటెక్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. హృద్రోగ బాధితురాలైన భార్యకు నెలకు రూ.7వేల వరకు వైద్య ఖర్చులు భరిస్తూ వస్తున్నాడు. రూ.5 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం.కాగా బుఽధవారం సాయంత్రం స్వగ్రామం ఎల్లంపేటలో నరేశ్‌ అంత్యక్రియలు జరిగాయి. ఆర్టీసీ జేఎసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ బలరాం నాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంతకుముందు నరేశ్‌ మృతదేహంతో మహబూబాబాద్‌ డిపో ఎదుట అఖిలపఽక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. నరేశ్‌ ఆత్మహత్యతో బుధవారం తెల్లవారుజాము నుంచే మహబూబాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహం ఆస్పత్రి వద్దకు కార్మికులు, విపక్ష, ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన నిర్వహించారు. గురువారం మహబూబాబాద్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ మాటలు బాధించాయి…తన చావుకు కారణం సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలేనని మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో డ్రైవర్‌ ఆవుల నరేశ్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఆర్టీసీ సమ్మె మొదలైన అక్టోబరు 5న నుంచి ఈనెల 12వ తేదీ వరకు సమ్మె పరిస్థితులను లేఖలో పేర్కొన్నాడు. ఆయన మాటల్లోనే…

ప్రియతమ సీఎం గారికి, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విన్నపం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయండి సారూ. ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారనడం నన్ను బాధించింది. మాకు 01-04-2017లో చేయాల్సిన పేస్కేల్‌ను అమలు చేయాలి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. పండగ రోజున ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు వేతనం లేక పస్తులున్నాయి.దీపావళి రోజున కూడా సరిగా తినలే. ఆర్టీసీ కార్మికుల్లో నా బలిదానం చివరిది కావాలి. డ్రైవర్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆత్మహత్యకు సీఎం, రోడ్డు రవాణాశాఖ మంత్రే కారణం. వరుస కోర్టుల వాయిదాలతో తీర్పుకోసం ఎదురు చూశాను. అక్టోబరు 23న ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌కు ములాకత్‌ ఇవ్వడం జరిగింది. ఆశ్వత్థామరెడ్డి… కాంగ్రెస్‌, బీజేపీలకు అమ్ముడుపోయాడని ఎమ్మెల్యే అనడం బాఽధించింది. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల కోసం నేను ప్రాణత్యాగం చేస్తున్నాను

Courtesy Andhrajyothy

 

 

RELATED ARTICLES

Latest Updates