భోక్తలకు భుక్తి కరువు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

హైదరాబాద్‌: ‘దైవం మంత్రాధీనం.. ఆ మంత్రం బ్రాహ్మణాధీనం’. ఈ ఒక్కమాట చాలు.. సమాజంలో బ్రాహ్మణులకున్న ప్రాధాన్యం తెలియడానికి. హిందూ ధర్మం ప్రకారం.. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి క్రతువులోనూ పురోహితుడు తప్పనిసరి. సమాజంలో తమకున్న గౌరవాన్నే భుక్తిగా మలచుకుని జీవిస్తున్న బ్రాహ్మణులకు ఇప్పుడదే వారిపాలిట శాపమైంది. వాళ్లు బ్రాహ్మణులు.. వాళ్లకేంటి! అనుకుంటూ ఎవరూ వీళ్ల ఆకలిని గుర్తించడం లేదు. లాక్‌డౌన్‌ వేళ వీరి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఆశీర్వదించే చేతులతో అర్థిచడం చేతకాక.. అర్ధాకలితో బతుకెళ్లదీస్తున్నారు. వేద బ్రాహ్మణుల్లో ముఖ్యంగా 3 వర్గాల వారున్నారు. శుభకార్యాలు నిర్వహించేది పురోహితులైతే.. ఆలయాల్లో పూజాదిక్రతువులు నిర్వహించే వారు పూజారులు. ఇక మరో వర్గం.. అశుభకార్యాల్లో దానాలు స్వీకరించి బతుకెళ్లదీసే వాళ్లు. వీళ్లను భోక్తలు అంటారు.

దయనీయం.. భోక్తల స్థితి
లాక్‌డౌన్‌తో ఈ భోక్తల పరిస్థితి దయనీయంగా మారింది. సంభావనతోనే బతికే వీళ్లు.. నేడు సంపాదనా మార్గంలేక పస్తులుంటున్నారు. హైదరాబాద్‌లో వివిధ క్రతువులు నిర్వహించే బ్రాహ్మణులు సుమారు లక్ష మంది ఉంటారని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ చెబుతోంది. అందులో 60ు మంది భోక్తలే. వీరు దశదిన కర్మ, మాసికం, ఆబ్దికం తదితర క్రతువులు నిర్వహించి దానాలు స్వీకరిస్తుంటారు. కొందరు.. సనాతన కుటుంబాలకు చెందిన వారి శవాలు మోసేందుకు కూడా వెళుతుంటారు. వీటి ద్వారా వచ్చిన సొమ్ముతోనే వారికి పూట గడుస్తుంటుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రతువుల నిర్వహణ నిషిద్ధం కావడంతో వీరి అరకొర ఆదాయానికి కూడా గండిపడింది. చాలామందికి రేషన్‌కార్డు కూడా లేకపోవడంతో.. ప్రభుత్వ సాయం అందడం లేదు. నోరు తెరిచి అడగలేక.. పస్తులుంటున్నారు.

పూజారులకూ తప్పని వెతలు..
పూజారులకూ లాక్‌డౌన్‌ కష్టాలు తప్పడంలేదు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లోని పూజారుల పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. వారి శాతం చాలా తక్కువ. అధికారిక లెక్కల ప్రకారం.. తెలంగాణలో 12 వేల దేవాలయాలున్నాయి. వీటిలో 600 మా త్రమే ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. ప్రైవే టు నిర్వహణలోని పూజారులకు నెలకు రూ. 5 వేలు మాత్రమే వేతనం ఇస్తారు. లాక్‌డౌన్‌తో నేడు ఆ వేతనంపై కూడా కోత పడిం ది. పోనీ.. ప్రసాదంతో పొట్ట నింపుకొందామన్నా.. ఆ దేవుడికే నైవేద్యం కరువైన స్థితి.

సంపన్నులూ.. సాయం చేయండి..
డాక్టర్‌ కేవీ రమణాచారి, చైర్మన్‌, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌

లాక్‌డౌన్‌తో నిరుపేద బ్రాహ్మణులు కష్టాల్లో పడ్డారు. లేనివారిపట్ల సంపన్నులు.. కాస్తంత కనికరం చూపించాల్సిన సమయమిదే. నేను, రాజ్యసభ సభ్యుడు వి. లక్ష్మీకాంతరావు కలిసి ‘తిరుమల ఫౌండేషన్‌’ తరఫున రేషనుకార్డు లేని 600 నిరుపేద కుటుంబాలకు రూ. 1,000 చొప్పున అందజేశాం. మరికొందరికి నిత్యావసరాల కిట్లను పంపిణీచేశాం. ఆర్థిక స్థోమత కలిగినవారంతా సాయం చేయాలని అర్థిస్తున్నాను.

పిల్లల్ని పస్తులుంచడం కష్టంగా ఉంది.. రామశర్మ, భోక్త
మాది మహబూబ్‌నగర్‌ జిల్లా. పదేళ్లుగా హైదరాబాద్‌లో భోక్తగా జీవితం గడుపుతున్నా. అద్దె కట్టలేక నగర శివారులో ఉంటున్నాను. సాధారణరోజుల్లో నెలకు పది, పదిహేను వేల దాకా సంపాదించేవాడిని. ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితయ్యాను. కొన్ని ప్రాంతాలలో పేద బ్రాహ్మణులకు ఉచితంగా నిత్యావసరాలు పంచుతున్నారని తెలిసినా వెళ్లలేకున్నాం. నాకు రేషన్‌కార్డు కూడా లేదు. మా కుటుంబ పరిస్థితి అంత బాగాలేదు. మేం తినకున్నా ఉండగలంగానీ.. మా పిల్లలు పస్తులుండడం చూడలేకున్నాం. మా భోక్తలందరిదీ ఇదే పరిస్థితి.

పురోహితులకు పూట గడవడమే కష్టమాయే..
చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం.. ఈ మూడు మాసాల్లో తెలుగు లోగిళ్లు శుభకార్యాలతో కళకళలాడుతుంటాయి. పురోహితులు రెండు చేతులా సంపాదించే సమయమిది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, వ్రతాలు, యజ్ఞాలతో ఈ 3 మాసాల్లోనే సంవత్సరానికి సరిపడా సంపాదించుకుంటారు. ఇదే సమయంలో వచ్చిన కరోనా వీరి కడుపుపై కొట్టింది. మే దాటితే ఆషాఢం వస్తుంది. ముహూర్తాలు ఉండవు. మరో 2 నెలల పాటు కుంటుబాన్ని నెట్టుకొచ్చేదెలా అని పూజారులు మదనపడుతున్నారు.

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates