లాక్డౌన్ సడలింపుల్లేవ్..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సామూహిక మత ప్రార్థనలకు అనుమతుల్లేవ్‌
– ఇంకా పకడ్బందీగా అమలు చేస్తాం
– తెలంగాణకు ఎవ్వరూ రావొద్దు
– స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీలపై నిషేధం
– మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఇంటి అద్దెలు తీసుకోవద్దు
– స్కూళ్లల్లో ట్యూషన్‌ ఫీజు మినహా ఇతరత్రా వసూలు చేయొద్దు
– డ్వాక్రా రుణాలు కట్టాల్సిందే..
– ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి
– 858 పాజిటివ్‌ కేసులు… ఆదివారం 18 కేసులు : సీఎం కేసీఆర్‌

తెలంగాణలో మే ఏడో తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కేంద్రం 20వ తేదీ నుంచి ఇచ్చిన సడలింపులు రాష్ట్రంలో వర్తించబోవని స్పష్టం చేశారు. సామూహిక మత ప్రార్థనలకు అనుమతుల్లేవని స్పష్టం చేశారు. సింగపూర్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసి కేసులు పెరగటంతో మళ్లీ పెట్టారని ప్రస్తావించారు. 42 దేశాల్లో లాక్‌డౌన్‌ ఉందన్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయబోతున్నామని చెప్పారు.

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.
కేసులు పెరుగుతున్నారు..

రాష్ట్రంలో ఆదివారం 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయనీ, మొత్తంగా తెలంగాణలో 858 కేసులు వచ్చాయనీ, 21 మంది చనిపోయారని చెప్పారు. 651 మంది చికిత్స పొందుతున్నారనీ, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వివరించారు. వరంగల్‌ రూరల్‌, సిద్దిపేట, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. దేశంలో 8 రోజులకోసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నదనీ, మన రాష్ట్రంలో పది రోజులకు రోగుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. మరణాల రేటు దేశంలో 3.22 శాతం ఉంటే రాష్ట్రంలో 2.44 శాతంగా ఉందన్నారు. దేశంలో 10 లక్షల మందిలో 284 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తే, మన రాష్ట్రంలో 375మందికి పరీక్షలు చేస్తున్నామన్నారు. వైద్య పరికరాలు మొదట్లో తక్కువగా ఉన్న మాట వాస్తవేగానీ ఆతర్వాత పూర్తిస్థాయిలో సమ కూర్చుకున్నామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నా యన్నారు. ప్రసవాలకు సిద్ధంగా ఉన్న మహిళలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించి ఇంటికి చేర్చేలా అమ్మఒడి ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. తలసేమియా, క్యాన్సర్‌, కిడ్నీ, తదితర వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందుబాటులో ఉంచామన్నారు.

సడలింపుల్లేవు : లాక్‌డౌన్‌లో ఈనెల20 నుంచి కొన్ని మినహాయింపులు ఇస్తు న్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనీ, కానీ రాష్ట్రంలో వైరస్‌ తీరుతెన్నులు, విస్తరణ దృష్ట్యా మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కఠినంగానే కొనసాగిస్తామన్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కిరాణాషాపులు అందుబాటులో ఉంటాయ న్నారు. నూనె మిల్లులు, రైస్‌మిల్లులు, ఫార్మా కంపెనీలు నడుస్తాయన్నారు. మే 5వ తేదీ అప్పటి పరిస్థితులపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించి, తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. విదేశీ ప్రయాణికులు, క్వారంటైన్‌లో ఉన్న 26వేల మంది కోలుకున్నారన్నారు. నిజాముద్దీన్‌ ఘటన వల్లే కరోనా విస్తరిస్తోందన్నారు. దీనికి బ్రేక్‌ లభిస్తేనే ఉపశమనం దక్కుతుందన్నారు.

సర్వే చేస్తే : ప్రభుత్వ సర్వే, మీడియా వాళ్లు చేయించిన సర్వేల్లో 95-92 శాతం మంది ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా కఠినంగానే ఉండాలనీ, లాక్‌డౌన్‌ పొడిగించాలని అభిప్రాయాలు వ్యక్తంచేశారని తెలిపారు. వ్యాధి నియంత్రణలోకి వచ్చిందా అని ప్రజలే తనను ప్రశ్నించారని చెప్పారు. వారి అభిప్రాయం మేరకు మే ఏడో తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నామన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందనీ, ఇక నుంచి చాలా కఠినంగా వ్యవహరిస్తామని నొక్కి చెప్పారు.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌పై నిషేధం : స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ను నిషేధిస్తున్నట్టు సీఎం చెప్పారు. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బారు వల్ల ్ల 69 మందికి కరోనా సోకిందనీ, ఆ పరిస్థితులు మన రాష్ట్రంలో రావడానికి వీల్లేదన్నారు. ప్రజలెవ్వరూ బయటినుంచి తినుబండారాలు తెప్పించుకోవద్దన్నారు.
ఇండ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు : రంజాన్‌ సహా అన్ని పండుగలను ఇండ్లల్లోనే చేసుకోవాలని చెప్పారు. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు. కరోనా కట్టడిలో స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు బాగుందన్నారు. దాతృత్వం ప్రదర్శిస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపారు.

పోలీసులకు సీఎం గిఫ్ట్‌ : ఏప్రిల్‌ నెలలో కూడా అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు మినహా మిగతావారందరికీ జీతాల్లో యధావిధిగా కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలీసులకు ఈ నెల వేతనంతో పాటు అదనంగా పది శాతాన్ని ముఖ్యమంత్రి బహుమతిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. విద్యుత్‌ సంస్థల్లోని ఓ అండ్‌ ఎమ్‌ సిబ్బంది, ఆర్టిజన్స్‌ కలిపి 34,512 మందికి వంద శాతం సాలరీ ఇస్తామన్నారు. 2019-20కు సంబంధించి ఇంటి పన్నులు అపరాధ రుసుం లేకుండా మే 31వ తేదీ వరకు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

ఫీజులు పెంచితే : 2020-21 విద్యా సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజు కూడా పెంచొద్దని పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశారు. నెలవారీగా ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలనీ, వేరే పేర్లతో ఫీజులు వసూలు చేయొద్దని సూచించారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయొద్దనీ, అలా చేస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

మేలోనూ అదే రేషన్‌ : తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి మే మాసానికి ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ఉచితంగా 12 కేజీల బియ్యం ఇస్తామన్నారు. మే మొదటి వారంలోనే రూ.1500 అందజేస్తామన్నారు. ఆసరా పింఛన్లను పూర్తిస్థాయిలో ఇస్తామని చెప్పారు. వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, రూ.500 ఇస్తామన్నారు.

పరిశ్రమలకు : విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీల్లో పరిశ్రమలకు మినహాయింపు ఇస్తున్నా మన్నారు. వాటిని వారు తర్వాత వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందనీ, ఎలాంటి అపరాధ రుసుములు వసూలు చేయబోమని చెప్పారు. ఫార్మా, రైస్‌ మిల్లుల్లో సకాలంలో విద్యుత్‌ చార్జీలు చెల్లించిన వారికి ఒక్క శాతం రాయితీ ఇస్తామన్నారు.

గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి : గచ్చిబౌలి స్టేడియంలోని 9.16గుంటల భూమిని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ బదిలీ చేశారు. కోవిడ్‌ స్పెషల్‌ ఆస్పత్రి కోసం 10,15 ఎకరాల భూమి జోడించి ఇస్తున్నామన్నారు. తూర్పుదిశలో ఎయిమ్స్‌, పశ్చిమ దిశలో తెలం గాణ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (టిమ్స్‌) ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 1,500 పడకలతో ఉండే ఈ ఆస్పత్రిలో 750 జనరల్‌ పడకలు, 750 పడకలతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు.

క్రీడా గ్రామాలు : హకీంపేట, శామీర్‌పేటలోని క్రీడా మైదానాలు, ఇతర స్థలాల్లో స్పోర్ట్‌ సిటీస్‌ ఏర్పాటు చేయడానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో క్యాబినెట్‌ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ సీజన్‌లో అవసరమైన 21.5 లక్షల టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పెంచాలనీ, వడ్డీల చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వాలని కోరారు. జొన్న, మొక్కజొన్న, తదితర పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.

డ్వాక్రా రుణాలు చెల్లించాల్సిందే : డ్వాక్రా పొదుపు సంఘాలు తమ రుణాలను బ్యాంకర్లకు చెల్లించాల్సిందేనని సీఎం కేసీఆర్‌ విలేకరుల అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానంగా చెప్పారు. ఐకేపీల ద్వారా డ్వాక్రా సంఘాలు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నాయనీ, వాటిద్వారా వారికి ఆర్థిక లబ్ది చేకూరుతున్నదనీ తెలిపారు.

అద్దెలు వసూలు చేస్తే…
ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం మార్చి, ఏప్రిల్‌, మే నెలల ఇంటి అద్దెలను ఎవ్వరూ వసూలు చేయొద్దని యజమానులకు ఆదేశాలకు జారీ చేశారు. ఎవరైనా వసూలు చేసినా..వాటిపై తర్వాత వడ్డీ చెల్లించాలని ఒత్తిడి తెచ్చినా 100కి డయల్‌ చేస్తే ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జీతాల్లో కోతే…
అత్యవసర విధులు నిర్వహిస్తున్న వారికి మినహా మిగతా ఉద్యోగుల వేతనాల్లో గతంలో చెప్పినట్టుగానే కోతలు ఉంటాయన్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎమ్‌), అర్టిజన్స్‌ ఉద్యోగుల వేతనాల్లో మాత్రం కోత ఉండబోదని చెప్పారు. ఫ్యామిలీ పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు 75 శాతం చెల్లిస్తామన్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates