నిరసన గొంతుకను ఆపలేని లాక్డౌన్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మోడీ ప్రభుత్వ తీరుపై సోషల్‌ మీడియాలో ఆగ్రహజ్వాలలు
– సీఏఏ, ఇతర ఉద్యమకారుల అరెస్టులకు ఖండన

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా కేంద్రంలోని మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తోపాటు పలు అంశాలకు సంబంధించి అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిఎఎ వ్యతిరేక ఆందోళనలు కొంత నెమ్మదించినా గొంతుక మూగబోలేదు. పలువురు విద్యార్థులు, సామాజిక ఉద్యమకారులు మోడీ సర్కార్‌ తీరు పట్ల సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా గళం విప్పుతూనే ఉన్నారు. పలు అంశాలకు సంబంధించి దేశంలో జరుగుతున్న అరెస్టులు, ప్రధానంగా సిఎఎ వ్యతిరేక ఆందోళనకారుల అరెస్టులను నిరసిస్తూ శనివారం పలువురు సోషల్‌ మీడియాలో ప్లకార్డులతో కూడిన ఫొటోలు, ఇతర పోస్టులను పెట్టారు. ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) అధ్యక్షుడు ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు.

‘కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత పరిరక్షణ పరికరాల (పీపీఇ) కొరతతో ఇబ్బందులు పడుతున్నారు, వలస కార్మికులు ఆహారం, ఆశ్రయం లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేందుకు ప్రాధాన్యత ఇస్తూ యుఎపిఎ కింద విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు బనాయిస్తోంది. దీన్ని కచ్చితంగా ఆపాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. మీరన్‌ హైదర్‌, సఫూరా జార్గర్‌, ఉమర్‌ ఖలీద్‌లపై యుఎపిఎ కేసులు నమోదు చేయించిందని, ప్రధానంగా ముస్లిం మతానికి చెందిన ఉద్యమకారులు, విద్యార్థులపై వేధింపులను ఆపి, కరోనాను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిడితో హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను వాణిజ్యపరంగా ఎగుమతి చేసేందుకు ఒప్పుకున్న మోడీ ప్రభుత్వమే దేశ ప్రజలకు వ్యతిరేకమని, కానీ ఉద్యమకారులను అరెస్టు చేయిస్తూ వారిపై దేశవ్యతిరేకుల ముద్ర వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా టెస్టులను పెంచాలి తప్ప, మత విధ్వేషాలను కాదని హితవు పలికారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనం గుమిగూడడంపై నిషేధం విధించడంతో ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు హైదర్‌, జార్గార్‌ల అరెస్టులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరిగాయి. ఫిబ్రవరిలో సిఎఎ వ్యతిరేక ఆందోళలను అడ్డుగా పెట్టుకొని నగరంలో అల్లర్లను రేకెత్తించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులపై ఆర్‌జెడి ఎంపీ మనోజ్‌ఝా స్పందిస్తూ.. ‘సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలతో వీరి అరెస్టులు జరిగాయి. వారు చేసిన ప్రసంగాలు, శాంతియుత నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌లలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. హింస ప్రేరేపితం నుంచి హత్యాయత్నాలు, హత్య, చివరకు దేశద్రోహంతోపాటు యుఎపిఎ చట్టం కింద కేసు నమోదు వరకూ తీసుకెళ్లారు’ అని విమర్శించారు. సిఎఎ వ్యతిరేక ఆందోళనల కారణంగా అరెస్టై జైళ్లలో ఉంటున్న ఉద్యమకారులకు మద్దతుగా పలువురు గొంతెత్తారు. గతేడాది డిసెంబర్‌ నుంచి జైల్లో ఉంటున్న అసోం రైతు నాయకుడు అఖిల్‌ గొగోరు అరెస్టును యోగేంద్ర యాదవ్‌తో పాటు పలువురు ఖండించారు. రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామిక ఆందోళనలను నేరపూరితంగా చూపిం చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

డాక్టర్‌ ఆనంద్‌ తెల్తుంబేను జైలుకు పంపించడాన్ని తమిళ రచయిత మీనా కందస్వామి ఖండిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. మనువాద మోడీ-షా ద్వయం డిఎన్‌ఎలోనే దళిత వ్యతిరేకత ఉందని విమర్శించారు. ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన తెల్తుంబేతోపాటు ఇతర 10 మంది ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ట్విట్టర్‌లో పలువురు విద్యార్థులు, ఉద్యమకారులు పోస్టులు చేశారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates