తెలంగాణ సర్కారు… ఇదేం తీరు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-కార్పొరేట్‌లో ప్రజాప్రతినిధులు… సర్కారు దవాఖానాలో పేదలు
-అందరికీ ఒకే వైద్యమన్న సీఎం..
– గాంధీలో అన్ని సౌకర్యాలున్నాయంటూనే ఈ తేడాలెందుకు: కరోనా పేషెంట్లు

సర్కారు చెబుతున్న మాటలను ఎవరు నమ్ముతున్నారో తెలియదు గానీ…ప్రజాప్రతినిధులకు మాత్రం నమ్మకం కనిపిస్తున్నట్టు లేదు. ఆ ప్రజాప్రతినిధులకు మాత్రం… ప్రజలకు తాము చెప్పే మాటలపై తమకే విశ్వాసమున్నట్టు లేదు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రయివేటులో పరీక్షల గురించిన ప్రస్తావన వచ్చిన సమయంలో సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ అందరికి ఒకే రకమైన వైద్యం అందిస్తామనీ, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గాంధీలో కరోనా చికిత్సకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతూనే ఉన్నారు. కానీ కరోనా సోకిన ప్రజాప్రతినిధులు కార్పొరేట్‌ దారిలోనే వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా అనుమానిత, నిర్ధారిత నాయకుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఫలానా వారికి సోకిందని చెప్పకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే వారు ఒకేసారి కనిపించకుండా పోవడం, వారంతా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం సర్కారీ వైద్యంలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నది.

ఎంత పెద్ద కోటీశ్వరులైనా సరే గాంధీ ఆస్పత్రిలో ఉండాల్సిందే. మన పర్యవేక్షణ ఉంటే వేరు. ప్రయివేటులో యాడ్నో పెట్టి వాడిష్టమొచ్చినట్టు ఇంకోదిక్కుపోయి ఇంకో నలుగురికి అంటిస్తాంటే కష్టమైతది కదా. ప్రయివేటు హాస్పిటళ్లో మంచిగా చూసుకోడనుకో. ఎటో పోతడు. ఎవరు బాధ్యులు. ఎవరు కావలి కాయాలా?. అదే గాంధీ హాస్పిటలైతే 1500 బెడ్ల వరకుంది అవకాశం. గాంధీ ఆస్పత్రిలో 8 గేట్లున్నాయి. టోటల్‌ బంద్‌ చేసి మూడే పెట్టినం. కంప్లీట్‌గా పోలీస్‌ కు హ్యాండోవర్‌ చేసినం.
– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా వైద్యం తీరు మారుతున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి దౌడు తీస్తున్నారు. మరోవైపు పేదలు మాత్రం సర్కారు దవాఖానాను ఆశ్రయిస్తున్నారు. నేతలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అయితే పేదల వద్ద అంత డబ్బులు చెల్లించుకోలేక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లక తప్పడంలేదు. గతంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అపొలో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డికి పాజిటివ్‌ రాగా నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఒకవైపు కరోనా కట్టడికి, చికిత్సకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌, రాష్ట్రానికి అవసరమైన పూర్తి సహకారం ఇస్తున్నామని కేంద్రంలోని మోడీ సర్కార్‌ విస్తృత ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 300 వరకు వెంటిలేటర్లుండగా, ఒక దాత ఇచ్చిన 100 వెంటిలేటర్లతో 400 వరకు చేరాయి. అయితే భవిష్యత్‌ అవసరాల కోసం వెయ్యి వెంటిలేటర్లు కావాలని రాష్ట్రం కోరినా కేంద్రం స్పందించలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతున్నది. వాస్తవ పరిస్థితులు తెలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులే కాకుండా ఒక మోస్తరు నాయకులు ఎవరూ గాంధీ వైపు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏ మాత్రం అనుమానం కలిగినా కార్పొరేటు లేదా ప్రయివేటు ఆస్పత్రులకే పరుగులు పెడుతున్నారు.

గాంధీ ఆస్పత్రిలో అందుతున్న సేవలు సరిగా లేవని తరచూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక యువ జర్నలిస్టు మరణించడం, ఆ మరణానికి ముందు ఆయన చేసిన వాట్సాప్‌ చాటింగ్‌ కూడా ఆస్పత్రిలోని దారుణ పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని బట్టబయలు చేసింది. అంతకు ముందు పలువురు రోగులు ఆడియో, వీడియోల రూపాల్లో సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టింగ్‌లు, కొంత మంది సీఎంఓ, కేటీఆర్‌కు చేసిన ట్వీట్‌లు, మృతదేహాల తారుమారు, మరో శవం మాయం, జూనియర్‌ డాక్టర్లపై దాడులు ఇలా ఒక దాని తర్వాత ఒకటన్నట్టుగా ఆమ్మో గాంధీ ఆస్పత్రినా అనే భయానక పరిస్థితి కలిగించాయి. ఈ నేపథ్యంలో తమపై దాడిని నిరసనగా మూడు రోజుల పాటు జూనియర్‌ డాక్టర్ల విధుల బహిష్కరణతో తమను పట్టించుకునే వారే లేరని కరోనా రోగులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

గాంధీకి రాకుంటే… జనం నమ్మేదెలా?
ప్రజాప్రతినిధులకు మెరుగైన వైద్యమంటే కార్పొరేట్‌ వైద్యమని నమ్ముతూ ప్రజలను మాత్రం ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం ఇస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు. గతంలో మాజీ గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అదే తీరుగా సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు కరోనా చికిత్స అందరికి ఒకేలా అందేలా ప్రజా ప్రతినిధులకు కూడా గాంధీలో చేరేలా చట్టం చేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు సూచిస్తున్నారు.

నేను బాగానే ఉన్నా: ముత్తిరెడ్డి
తాను బాగానే ఉన్నాననీ, కరోనా పాజిటివ్‌ కారణంగా కొంచెం నలతగా ఉందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దనీ, చికిత్స తీసుకొని త్వరలో కోలుకుంటునన్నారు. శనివారం మాట్లాడిన ఆయన భగవంతుని ఆశీస్సులు, నియోజకవర్గ ప్రజల దీవెనలతో త్వరగా కోలుకుని జనగామ వస్తాననీ, పార్టీ శ్రేణులు ధైర్యం ఉండాలని కోరారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates