పొక్కిలిబారిన వాకిళ్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • నిలిచిపోయిన పనులు
  • అవస్థల్లో 21 లక్షల చేతి వృత్తుల కుటుంబాలు
  • కరోనాతో ఉక్కిరిబిక్కిరి

కరోనా ప్రభావంతో చేతి వృత్తులు విలవిల్లాడుతున్నాయి. రాష్ట్రంలో కుండలు, వెదురు బుట్టల తయారీ తదితర వృత్తులపై జీవించే కుటుంబాలు అధికారిక గణాంకాల మేరకు 21 లక్షల వరకు ఉండగా రవాణా నిలిచిపోవడం, చేసిన వస్తువులను తీసుకువెళ్లే వారు లేక వృత్తిదారులు కష్టాలు పడుతున్నారు. జన సంచారం లేకపోవడంతో బంగారు ఆభరణాల తయారీ, విక్రయాలు కూడా లేవు. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే ఏ కుటుంబాన్ని కదిపినా వారి కళ్లల్లో కన్నీరు సుడులు తిరుగుతూ కనిపిస్తోంది.

‘‘కుండలు విక్రయించగా వచ్చే ఆదాయమే మాకు ఆధారం. ప్రతి వేసవిలో ఇలా వచ్చిన ఆదాయంతోనే ఏడాది పొడవునా కుటుంబం గట్టెక్కుతుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న కూతురుకు ఫీజులు, కుటుంబ ఖర్చులకు ఇదే ఆధారం. ఈ ఏడాది రూ.లక్ష అప్పు చేసి వరంగల్‌ నుంచి కుండలను కొని తెచ్చాం. ఇప్పుడు కరోనాతో విక్రయాలు లేవు. దీంతో ఇంటిలోనే కుండలను ఏడాదిపాటు పదిలపర్చుకోవాల్సి రావడం మరింత కష్టం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్‌ నగరంలోని గురుద్వార్‌ ప్రాంతానికి చెందిన లలిత. చేతివృత్తిదారుల తాజా దుస్థితికి ఇదో దృష్టాంతం. రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాలు కుండల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నారాయణపేట తదితర జిల్లాల్లో తయారయ్యే రంజన్‌, జామియా వంటి రకరకాల కుండలు పొరుగు రాష్ట్రాలకు భారీగా ఎగుమతి అవుతుంటాయి.

రాష్ట్రంలోనూ వేసవిలోనే లక్షల సంఖ్యలో కుండల విక్రయాలు ఉంటాయి. ఈ ఏడాది గిరాకీకి అనుగుణంగా పెద్ద ఎత్తున మట్టిపాత్రలను సిద్ధం చేసుకోగా కరోనా ప్రభావాలతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఎగుమతులు నిలిచి సరకంతా ఇళ్లలోనే ఉండిపోయింది. ఇదే తీరులో చేటలు, బుట్టలు అల్లేవారు చితికిపోతున్నారు. హైదరాబాద్‌ నగరంలో రంగుల బుట్టలకు ఎక్కువ గిరాకీ ఉండగా ఈ ఏడాది విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తయారు చేసిన వస్తువులు నిల్వగా ఉంటున్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే రెండు లక్షల కుటుంబాలు పనులు కోల్పోయాయని విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాల్‌కోట వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

వృత్తి కార్మికులకు కష్టకాలం
-కృష్ణ, కుండల తయారీదారు, గురుద్వార్‌
మా వృత్తి తగ్గిపోతోంది. మేం కష్టపడి ఉత్పత్తులు సిద్ధం చేసుకున్నాం. ఇంతలో కరోనా ప్రభావంతో జనజీవనం స్తంభించింది. వృత్తికార్మికులకు ఇది కష్టకాలం.

మా వెన్ను విరిగినట్లు అయింది
అచ్చమ్మ, చాదర్‌ఘాట్‌
వేసవిలోనే ఎక్కువగా బుట్టలు అల్లుతాం. మామిడి, ఇతర పండ్లు తరలించేందుకు అవసరమయ్యే బుట్టలు సిద్ధం చేస్తాం. ఒక్కో రోజు రూ.వేయి వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు.

రూ.లక్షన్నరతో మట్టి కొనుగోలు
సుశీల, తయారీ-విక్రయదారు, గురుద్వార్‌, అమీర్‌పేట
కుండలు తయారు చేయడానికి లారీ మట్టి కొనుగోలుకు రూ.లక్షన్నర ఖర్చు అవుతోంది. వేసవిలోనే మట్టి లభిస్తుంది. ఎంతో శ్రమించి ఈ ఏడాది మట్టిపాత్రలు చేస్తే లాక్‌డౌన్‌ వచ్చింది. నాకు ఇద్దరు ఉన్నత విద్యనభ్యసించే పిల్లలు ఉన్నారు. ఏడాదిపాటు కుటుంబ ఖర్చులకు వృత్తే ఆధారం. విక్రయాలు లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates