మాకు ఇక్కడ చావాలని లేదు గుజరాత్లో

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కాశ్మీర్‌ విద్యార్థుల ఆందోళన
– స్వరాష్ట్రానికి పంపించాలని విన్నపం
– పట్టించుకోని ఇరు రాష్ట్రాల అధికారులు

గాంధీనగర్‌ : ‘మా క్యాంపస్‌ను ఆనుకుని ఉన్న వీధిలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మాకు తినడానికి తిండి లేదు. నిత్యావసరాలు కొనడానికీ అవకాశం లేదు. మాకు ఇక్కడ చావాలని లేదు. మా రాష్ట్రానికి పంపించండి’ అంటూ గుజరాత్‌లో చిక్కుకుపోయిన కాశ్మీరీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గాంధీనగర్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ గుజరాత్‌ (సీయూజీ)లో పీహెచ్‌డీ చదువుతున్న 22 మంది కాశ్మీరీ విద్యార్థులు.. హాస్టల్‌ క్యాంపస్‌లలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు విద్యార్థినులూ ఉన్నారు. తమను స్వరాష్ట్రానికి పంపాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించుకున్నా.. ఎవరూ స్పందించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

దేశంలో మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రం గుజరాత్‌. ఇప్పటివరకూ అక్కడ 7 వేలకు పైగా ఈ మహమ్మారి బారీన పడ్డారు. వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ ఎక్కువవుతున్న వేళ.. సీయూజీకి కిలోమీటరు పరిధిలోనూ నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆ ఏరియాను కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. క్యాంపస్‌ గేటు దాటి బయటకు అడుగు పెట్టడం లేదు. హాస్టల్‌లో మెస్‌ మూసేయడంతో బయటనుంచి తీసుకొచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్నారు.

కాగా, దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో తమను ఇక్కడి నుంచి తరలించాలని వాళ్లు గుజరాత్‌, జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాలకు విన్నవించారు. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్లలో తమ వివరాలు నమోదుచేసుకున్నారు. డయల్‌ 100కు రోజూ వందల సార్లు ఫోన్లు చేస్తున్నా.. ఎటువంటి స్పందనా రావడం లేదని విద్యార్థులు తెలిపారు. పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానాలలో ఉన్న కాశ్మీర్‌ విద్యార్థులను తరలించిన రాష్ట్ర ప్రభుత్వం.. తమనూ తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌కు దరఖాస్తు పెట్టి 15 రోజులు కావస్తున్నా ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేరని పీహెచ్‌డీ చేస్తున్న ఇశ్వాక్‌ మజిద్‌ తెలిపాడు. పంజాబ్‌, హర్యానాలతో పోలిస్తే గుజరాత్‌లో కేసులు నానాటికీ రెట్టింపు అవుతున్నాయనీ, వైరస్‌ తమకు కూడా సోకుతుందేమోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని అతడు చెప్పాడు.

రంజాన్‌ నెల కావడంతో ఉపవాసాలు ఉండటం, అందుకు తగిన విధంగా ఆహారం తీసుకోవడం సాధ్యం కావడం లేదని మరో విద్యార్థిని నహీదా అన్నారు. ‘మా పరిస్థితిని చూస్తూ ఇంట్లోవాళ్లు ఆందోళన చెందుతున్నారు. మేం వెళ్తామని అధికారులను వేడుకుంటున్నా.. వాళ్లు మమ్మల్ని వెళ్లడానికి అనుమతించడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమను స్వరాష్ట్రానికి పంపించాలని విద్యార్థులు ఇరు రాష్ట్రాల అధికారులను కోరుతున్నారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates