ఈ వీరుడికేది న్యాయం?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కార్గిల్‌ యుద్ధంలో లాన్స్‌నాయక్‌ రాంచందర్‌ వీరమరణం
కుటుంబానికి దక్కని ఇంటి స్థలం, ఉద్యోగం
సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి.. 2017లో ప్రభుత్వ ప్రకటన
మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల నుంచి కొంత ఇవ్వాలని నిర్ణయం
ప్రజల్లో భావోద్వేగాలను బట్టి పరిహారంపై ప్రభుత్వాల స్పందనలు
స్పష్టమైన విధానం ఉండాలని కోరుతున్న అమరుల కుటుంబాలు

హైదరాబాద్‌: ఈయన పేరు.. లాన్స్‌నాయక్‌ రాంచందర్‌. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో శత్రువుల ఫిరంగిదాడుల్లో అమరుడయ్యారు. కేంద్రం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డు వద్ద ఆయన కుటుంబానికి 300 గజాల స్థలం ఇస్తామని కూడా అప్పటి సర్కారు ప్రకటించింది. 20 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ కుటుంబానికి ఆ స్థలం అందలేదు. లాన్స్‌ నాయక్‌ రాంచందర్‌ భార్య దివ్య.. తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయానికి చెప్పులరిగేలా తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగమూ రాలేదు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. 2000లో ఇంటి స్థలం ఇస్తామంటూ కలెక్టర్‌ కార్యాలయానికి పిలిపించి ఉత్త కాగితాలను ఇచ్చి పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం అధికారుల చుట్టూ ఎన్నో సార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు, ఉద్యోగం, ఇంటిస్థలం మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే.. తనకు కూడా ప్రభుత్వం ఇంటి స్థలం, ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకిలా జరుగుతోంది? కొందరు చనిపోయినప్పుడు ప్రభుత్వం వెంటనే సహాయం అందజేస్తుంటే.. మరికొందరికి హామీ ఇచ్చిన సహాయం కూడా అందట్లేదు. ఎందుకీ పరిస్థితి ఎదురవుతోంది? ప్రభుత్వం వద్ద దీనిపై సరైన విధానం ఉందా? దాన్ని అమలు చేస్తోందా? నిజానికి.. సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

2017 జనవరిలో..
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సైనికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యల్ని తీసుకోవాలని కేసీఆర్‌ సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగా.. నగదు బహుమతుల కింద చెల్లించే డబ్బును పెంచడంతో పాటు, సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు 2017 జనవరి 17న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం, సైనికుల ప్రత్యేక నిధికి.. ముఖ్యమంత్రి, మంత్రులు ఏడాదికి రూ. 25 వేల చొప్పున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రూ.10 వేలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులను ఉపయోగించి సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం తగు చర్యల్ని తీసుకోవాలని నిర్ణయించారు.

అయితే ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక నిధి ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. సీఎం ప్రకటన చేసి మూడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల నుంచి ఎలాంటి సొమ్మునూ ప్రత్యేక నిధికి మళ్లించలేదు. అయితే.. సైనికులకు చెల్లించే నగదు బహుమతి పెంపునకుసంబంధించిన ఉత్తర్వులను మాత్రం జారీ చేశారు. అసెంబ్లీల్లో సీఎం చేసిన ప్రకటనకు అనుగుణంగా 2018 జూన్‌ 18న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. సైనికుడికి ఉన్న బిరుదు ఆధారంగా ఈ నగదు చెల్లింపులను చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెద్ద బిరుదు ఉంటే.. ఎక్కువ మొత్తం వస్తుంది. బిరుదు హోదా తగ్గే కొద్దీ నగదు బహుమతి కూడా తగ్గుతూ ఉంటుంది.

అయితే.. ఒక సారి ఇలా నగదు బహుమతి పొందిన వారు భూ కేటాయింపు, ఇతర జీవన భృతిని పొందడానికి అర్హులు కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనలోని ప్రత్యేక నిధి ఏర్పాటు అంశాన్ని ఈ ఉత్తర్వుల్లో అస్సలు ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే.. ఇటీవల చైనా దాడిలో చనిపోయిన సంతో్‌షబాబు కుటుంబానికి న్యాయం చేసిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున సెల్యూట్‌ చేస్తున్నానని.. 1999, 1971, 1965 యుద్ధాల్లో వీరమరణం పొందిన కుటుంబాలను సైతం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగయ్యగౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

అయితే.. ప్రభుత్వాలు ఏకరీతి విధానంలో వ్యవహరించట్లేదని.. ప్రజల్లో ఆయా సంఘటనలు కలిగించే భావోద్వేగాల ఆధారంగా అధికారపార్టీలు, ప్రభుత్వాలు స్పందిస్తున్నాయనే విమర్శలు కొందరు మాజీ సైనికాధికారుల నుంచి వినిపిస్తున్నాయి. సైనికుల విషయంలోనే కాక ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇలాగే జరుగుతోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఉదాహరణకు.. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలాగే పరిహారం ప్రకటించడాన్ని కొందరు విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో కూడా రకరకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబానికి న్యాయం చేయాలి: ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన లాన్స్‌నాయక్‌ ఫిరోజ్‌ ఖాన్‌ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అమరుడైన సైనికుడి కుటుంబం గ్యాలంటరీఅవార్డు నగదు కోసం ఏడాదిగా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వీరులకు ఇది తీవ్ర అవమానమన్నారు. ఫిరోజ్‌ ఖాన్‌ కుటుంబానికి సాయం అందని వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘మేమేం పాపం చేశాం.. మాకు పైసలు ఇవ్వరా’ అనే కథనాన్ని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

సైనిక కుటుంబాలను ఆదుకోవడంలో వివక్ష తగదు
సైనికులకు లేని కుల, మత, ప్రాంత వివక్ష పాలకులు మాత్రమే ఎందుకు పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. అమర జవాన్‌ కల్నల్‌ సంతో్‌షబాబు ఇంటికి సీఎం కేసీఆర్‌ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి సాయం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఏడేళ్ల క్రితం అమరుడైన లాన్స్‌ నాయక్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో.. వారి కుటుంబాన్ని ఎందుకు ఆదుకోలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం లాన్స్‌ నాయక్‌ ఫిరోజ్‌ఖాన్‌కు గ్యాలంటరీఅవార్డు ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 93 ప్రకారం ముఫ్పై లక్షలు మంజూరు చేసి కూడా సమయం దాటిపోయిందనే అర్థం, పర్థం లేని కారణాన్ని సాకుగా చూపెట్టి ఆ కుటుంబానికి అన్యాయం చేసింది. సంతో్‌షబాబు కుటుంబాన్ని ఆదుకున్నట్లే.. లాన్స్‌ నాయక్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబానికి 5కోట్ల నగదు, బంజారాహిల్స్‌లో 700 చదరపు గజాల స్థలం, ఫిరోజ్‌ఖాన్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
– మందకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాక అధ్యక్షుడు

ఎవరికి ఎంతంటే..
తెలంగాణ ప్రభుత్వం 2018లో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సైనికులకు చెల్లించే నగదు అవార్డు వివరాలు…

సైనికుడి బిరుదు నగదు బహుమతి
పరమ వీర చక్ర రూ. 2.25 కోట్లు
అశోక చ క్ర రూ. 2.25 కోట్లు
మహ వీర్‌ చక్ర రూ. 1.25 కోట్లు
కీర్తి చక్ర రూ. 1.25 కోట్లు
వీర్‌ చక్ర రూ. 75 లక్షలు
శౌర్య చక్ర రూ. 75 లక్షలు
సేనా, వాయు మెడల్స్‌ రూ. 30 లక్షలు
పరాక్రమ్‌ మెడల్స్‌ రూ. 25 లక్షలు
సర్వోత్తం యుధ్‌ సేవా రూ. 25 లక్షలు
ఉత్తం యుధ్‌ సేవా రూ. 20 లక్షలు
యుధ్‌ సేవా రూ. 5 లక్షలు

Courtesy Andhrajyothy

RELATED ARTICLES

Latest Updates