కాళేశ్వరం నిర్వాసితుల ఆందోళన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సిరిసిల్ల, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట ధర్నా 
– ఎమ్మెల్యే సుంకె రవి అడ్డగింత 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, డ్యాముల్లో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులు సోమవారం ఆందోళనబాట పట్టారు. ముంపు గ్రామాలుగా గుర్తించాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్‌ గ్రామస్తులు కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అడ్డుకుని పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద బైటాయించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూర్‌ గ్రామాన్ని శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్‌ మానేరు)లో ముంపు గ్రామంగా ప్రకటించి నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని గ్రామస్తులు పాదయాత్రగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతేడాది మిడ్‌మానేరులో ఐదు టీఎంసీల నీటిని నింపడంతో తమ గ్రామ ఇండ్లు ముంపునకు గురయ్యాయని చెప్పారు. ముంపు గ్రామంగా ప్రక టించాలని పలుమార్లు మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను కోరినా పట్టిం చుకోలేదన్నారు. ఇప్పుడు మిడ్‌మానేరులోకి నీటిని విడుదల చేయడంతో ఇండ్ల లోకి నీటి ఊట వచ్చి గోడలు పగుళ్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2016న గండిపడి గ్రామంలోకి వరద రావడంతో మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కందికట్కూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట.. 
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడారం 6వ ప్యాకేజీ నందిపంపుల నుంచి వస్తున్న నీటితో నందిమేడారం రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నిండిందని చెప్పారు. దాంతో చామనపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుందని తెలిపారు. ఇండ్లలో సెప్టిక్‌ ట్యాంక్‌లు నిండి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. ఇండ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. అధికారులు గ్రామాన్ని సందర్శించి ముంపు గ్రామంగా ప్రకటించి తగిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందించారు.

ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగింత 
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కాన్వాయ్ ను శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు) నిర్వాసితులు అడ్డుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో జలాశయం కట్ట కింద మొక్కలు నాటేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను కొదురుపాక, నీలోజిపల్లి నిర్వాసితులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు రూ.5లక్షల 4వేలు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే స్పందించి కాన్వారు దిగి నిర్వాసితులతోపాటు రోడ్డుపై కూర్చొని మాట్లాడారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మిగతా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయారు.

 

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates