చర్చి కూల్చివేత పై కలెక్టరేట్‌ ముట్టడి.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* ఎమ్మెల్సీ ఐవి, సిపిఎం, ప్రజా సంఘాల మద్దతు
 కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సిబిసిఎన్‌సికి చెందిన స్థలంలోని చర్చిని, సిలువను, ప్రేయర్‌ టవర్‌ను ధ్వంసం చేసి, నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రైస్తవులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని క్రైస్తవులు భారీగా సోమవారం ఉదయాన్నే కాకినాడ చేరుకున్నారు. మెక్లారిన్‌ స్కూల్‌ నుంచి పూలే సెంటర్‌, జిజిహెచ్‌ మీదుగా జిల్లా పరిషత్‌ వరకూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇంద్రపాలెం లాకుల వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవులు మానవహారం చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన ధర్నాకు సివైఎఫ్‌ జాతీయ అధ్యక్షులు సిహెచ్‌.మూర్తిరాజు అధ్యక్షత వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయండా గంటలతరబడి ఆందోళన కొనసాగించారు.
ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ క్రిస్టియన్‌ మైనారిటీ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కాకినాడలో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. వైసిపి అధికారంలోకి రావడంలో క్రైస్తవులు ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. అలాంటి క్రైస్తవ మిషనరీల ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే స్థానిక ఎంఎల్‌ఎ, ఎంపీలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఎంఎల్‌సి ఐవి, సిపిఎం నగర కార్యదర్శి అజరు కుమార్‌, సిఐటియు కార్యదర్శి రామకృష్ణ, క్రైస్తవ సంఘాల ఫెలోషిప్‌ నాయకులు, దళిత సంఘాల నాయకులు సబ్‌ కలెక్టర్‌ను కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం సిబిసిఎన్‌సి గేటు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేసి వారిని బయటకు పంపాలని, లేకపోతే తాము కూడా లోపలికి వెళ్తామని ఆందోళన చేయడంతో పోలీసులు లోపల ఉన్న వారిని కూడా బయటకు పంపడంతో ఆందోళన శాంతియుతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రక్షణ టివి సిఎండి జె.బెన్‌హర్‌, జాన్‌ బెంజ్‌ లింగం, దళిత క్రిస్టియన్‌ రైట్స్‌ జాతీయ నాయకులు పెరిగే వరప్రసాద్‌, ఆంధ్ర మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతాల కొండబాబు, మహాసేన జాతీయ అధ్యక్షులు సరిపల్లి రాజేష్‌, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య పాల్గొన్నారు.

Courtesy Prajashakti..

RELATED ARTICLES

Latest Updates