జైళ్లు సిద్ధంగా లేవు..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – ఖైదీలు అక్కడ నరకం అనుభవిస్తున్నారు
– కరోనా గురించి అవగాహనే లేదు
– బెయిల్‌పై విడుదలైన ఖైదీల ఆందోళన

ముంబయి : కరోనా మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా జైళ్లలో ఉండి విచారణ ఎదుర్కొంటున్న (అండర్‌ ట్రయల్‌) ఖైదీలను విడుదల చేయాలనీ, అక్కడే ఉండేవారికి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ జైళ్లు అందుకు సిద్ధంగా ఉన్నాయా..? అంటే లేదనే సమాధానం వినిపిస్తున్నది. గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో యూటీ, వికలాంగులైన ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టు ఇటీవలే ఆదేశించింది. అంతేగాక చెరసాలల్లో బంధీలుగా ఉంటూ జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఖైదీలను ప్రత్యేక గదుల్లో ఉంచాలనీ, వారికి చికిత్స చేయించాలని ఉత్తర్వులు జారీ చేసినా జైలు అధికారులు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారని పెరోల్‌పై విడుదలైన ఖైదీలు చెబుతున్నారు. జైళ్లో కనీస వసతులు అందుబాటులో లేవనీ, అసలు లోపల ఉన్నవారికి కరోనా గురించిన అవగాహాన కూడా లేదని అంటున్నారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మహారాష్ట్రలోని రారుగఢ్‌ జిల్లా తలోజా కేంద్ర కారాగారం నుంచి ఇటీవలే కొంతమంది యూటీ ఖైదీలను విడుదల చేశారు. జైళ్లో ఉన్న పరిస్థితులను వారిలా వివరిస్తున్నారు. ‘లోపల ఖైదీలు నరకం అనుభవి స్తున్నారు. కరోనా భయంతో వాళ్లు భయపడుతూ కాలం వెల్లదీస్తున్నారు. జైళ్లో ఎవరికీ మాస్క్‌లు, సానిటైజర్లు లేవు. ప్రభుత్వం చెబుతున్న సామాజిక దూరం ఎవరూ పాటించడం లేదు. అసలు చాలా మందికి కరోనా వైరస్‌, దాని వ్యాప్తి గురించిన విషయాలేమీ తెలియదు. ఖైదీలకే కాదు..! జైలు అధికారులకూ దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు, రాకుండా అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సరైన అవగాహన లేదు’ అంటూ రారుగఢ్‌కు చెందిన ఓ ఖైదీ(40) తెలిపాడు. దేశవ్యాప్త మూసి వేతతో ఎక్కడికక్కడ బంద్‌ ఉండటంతో పెరోల్‌పై విడుదలైన ఖైదీలు సొంత ఇండ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతు న్నారు. పూచీకత్తుతో వీరిని బెయిల్‌పై విడుదల చేస్తున్న అధికారులు సైతం.. ఖైదీలు సొంత ఊళ్లకు చేయడానికి ఏర్పాట్లుచేయడం మరిచారని వాపోతున్నారు. ఇదే విషయమై మరో ఖైదీ మాట్లాడుతూ.. ‘నేను రారుగఢ్‌కు సమీపంలో ఉంటాను. నా కుటుంబసభ్యులు ఎలాగోలా నన్ను ఇంటికి చేర్చారు. కానీ ఎక్కడెక్కడి నుంచో ఉన్న ఖైదీలకు రవాణా సౌకర్యాల్లేవు. వాళ్లు ఇంటికెళ్లడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు’ అని తెలిపాడు. జైలు అధికారులను దీని గురించి ప్రశ్నిస్తే.. తమ దగ్గర తగినంతగా సిబ్బంది లేరనీ, దీంతో తామే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మని చెబుతుండటం గమనార్హం.

మరోవైపు కరోనా కట్టడికి గానూ ఖైదీలు వారి బంధువులను కలుసుకోవడాన్ని, నిందితులను కోర్టుల ఎదుట హాజరుపర్చడాన్ని అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. వారిని కలవడానికి న్యాయవాదులను కూడా అనుమతించడం లేదు. దీంతో లోపల ఉన్న ఖైదీలు, బయట ఉన్న వారి బంధువులు తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నారు. తమవారిని ఒక్కసారైనా కలవడానికి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నా అధికారులు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. దీనిపై ఖైదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు బయటకు వచ్చినవారు చెబుతున్నారు. మార్చి మొదటివారం నుంచి సందర్శన ప్రక్రియను అధికారులు ఆపేశారు.

ఇదిలాఉంటే.. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలకు కోర్టు ఉత్తర్వులు వర్తించవు. పీఎంఎల్‌ఏ, ఉపా, ఎన్‌డీపీఎస్‌, బ్యాంకు, ఆర్థిక కుంభకోణాల్లో విచారణ ఎదుర్కొంటున్నవారికి ఈ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పలు కేసుల్లో అరెస్టైన పలువురు హక్కుల కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టైన వరవరరావు, షోమా సేన్‌, సాయిబాబ వంటి వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే వారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తుండగా.. తాజాగా కరోనా నేపథ్యంలో వారికేదైనా అయితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

జైళ్లలో జనసంఖ్యను తగ్గించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
సామాజిక దూరం పాటించే లక్ష్యంలో భాగంగా జైళ్లలో జనసంఖ్యను తగ్గించాలని ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లి.. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ఎమర్జెన్సీ పెరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించారు. విడుదలయ్యేవారికి కనీసం ఎనిమిది వారాల పాటు పూచీకత్తుతో కూడిన బెయిల్‌ ఇవ్వాలని తెలిపారు. అంతేగాక లోపల ఉండేవారి ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీలోని 16 జైళ్లలో 14,355 మంది అండర్‌ ట్రయల్‌ ఖైదీలున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates