పారిశ్రామిక ప్రమాదాలు-ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విశాఖపట్టణంలో 2020 మే 7వ తేదీ ఉదయం 3 గంటలకు ఎన్‌జి పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌ అయ్యింది. ఇప్పటికి 13మంది మరణించారు. ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రమౌళి కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. ఇంకా కొందరు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. 1000 మంది దవాఖానా పాలయ్యారు. ప్రమాద ఘటన జరగగానే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడంలోని పాలకవర్గ నీతిని గుర్తించాలి. గ్యాస్‌ లీకైన రెండు రోజులకు కూడా అక్కడ 120 డిగ్రీల వేడి ఉంది. 10వేల మంది కుటుంబాలు వదిలి ప్రభుత్వ, ప్రయివేటు శిబిరాలలో తలదాచుకుంటున్నారు. 5 కి.మీ.ల రేడియస్‌లో గ్యాసు వ్యాపించింది. ప్రాజెక్టున్న ఆర్‌ఆర్‌ వెంకటాపురంతోపాటు బాపూజీనగర్‌, మేగాద్రిపేట, కంపనపాలెంతో పాటు మరికొన్ని గ్రామాలకు లీకైన విషవాయువు గ్యాసు విస్తరిస్తున్నది.

213ఎకరాలలో 1997లో ఈ ప్లాంటును నిర్మిచారు. రోజుకు 417టన్నుల పాలిస్టిరిన్‌ ఉత్పత్తి చేస్తుంది. ఫ్యాక్టరీ గైడ్‌లైన్స్‌ పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్‌ లీక్‌తో చెట్లు, పక్షులు, పశువులు కూడా మరణించాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరణించినవారికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. కానీ ఇంకా ప్రమాదం బారిన పడుతున్నవారు, గాయాలపాలై ఆస్పత్రులపాలైనవారు, ఫ్యాక్టరీ చుట్టుపక్కల నుంచి ఇండ్లు ఖాళీ చేసి బయటికి వెళుతున్న వేలాది మందికి ఎవరు పరిహారం ఇవ్వాలి? ఎంత పరిహారం ఇస్తే వారి సమస్య పరిష్కారం అవుతుంది? ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలను జనవాసా లకు 60-70కి.మీల దూరంగా నిర్మాణం చేయాలి. పర్యావరణ శాఖ ఎలా అనుమతులిచ్చింది. 2014-16 మధ్య ప్రమాదాలలో మరణించినవారి పరిస్థితి ఈ విధంగా ఉంది. కొన్ని మరణాలను గుర్తించారు. మరికొన్ని మరణాలకు ఈ ప్రమాదాలు కారణం కాదని పరిహారం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

ఇవి పారిశ్రామికంగా కీలక రాష్ట్రాలు మాత్రమే. దేశవ్యాపితంగా ప్రమాదాలు మరిన్ని జరిగాయి. అవిగాక 2016-17 నుంచి 2019 కాలంలో ఇదే మోతాదులో ప్రమాదాలు సంభవించాయని గుర్తించాలి. ఓఎన్‌జీసీ గ్యాస్‌ను మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌వారు సరఫరా చేస్తున్న సందర్భంగా గ్యాసులీకై నలుగురు మరణించారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని రారుగడ్‌జిల్లా శక్తిపేపర్‌మిల్లులో గ్యాస్‌ లీకై 7గురికి ప్రమాదం జరగగా ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. యాదాద్రి జిల్లా రాయగిరి రైల్వే స్టేషన్‌ వద్ద అత్యంత భరించలేని దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమ కొనసాగు తున్నది. ఈ ప్రమాదాల వలన బయట ప్రజలు కూడా మరణిస్తున్నారు. వీరికి పరిహరం లేదు.

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన
1984 డిసెంబర్‌2-3 తేదీలలో యూనియన్‌ కార్బైడ్‌ కార్పోరేషన్‌ గ్యాస్‌ లీకై(మిథైల్‌ ఐసో సైనేట్‌) అక్కడికక్కడ 2259 మంది మరణించగా మొత్తంగా 3787మంది చనిపోయారు. 5,7,4366మంది గాయాల పాలైనారు. 3900మందికి అంగవైకల్యం వచ్చింది. నేటికీ అక్కడ జన్మిస్తున్నవారు అంగ వైకల్యంతోటే పుడుతున్నారు. ఇంత ప్రమాదానికి కారణమైన కార్బైడ్‌ కార్పోరేషన్‌ ఎండీ వారెన్‌ అడర్సన్‌ను ప్రజలు పోలీసులకు పట్టిస్తే, నాటి ప్రభుత్వం రహస్యంగా ప్రత్యేక విమానంలో అమెరికాకు పంపించి కేసును బలహీనపర్చింది. 28ఏండ్ల తరువాత ఒక్కొక్కరికి 2000డాలర్లు పరిహారం ఇవ్వాలని అమెరికా కోర్టు తీర్పు చెప్పినా ఆ పరిహారం నేటికీ ఇవ్వలేదు.

ఈ ఫ్యాక్టరీ 1969లో నిర్మాణం జరిగింది. 1976లో రెండుసార్లు, 1982లో రెండుసార్లు గ్యాసు లీకైంది. మొత్తం 42మంది ప్రమాదానికి గురయ్యారు. ఎన్‌ఎస్‌ఎస్‌ రిపోర్టు ప్రకారం ఏటా వేల మంది పరిశ్రమల్లో జరుగు తున్న ప్రమాదాల వల్ల మరణిస్తున్నట్టు రిపోర్టులు చెప్తున్నాయి. పరిహారం కొరకు దశాబ్దాలు గడిచి నా లేబర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

హైదరాబాదు పట్టణంలోని పటాన్‌చెరువు వద్ద అరబిందో, రెడ్డి, ఎన్‌ఎస్‌ఎన్‌, చైతన్య క్లోరైడ్‌, న్యూలాండ్‌ హైదరాబాద్‌ కెమికల్‌, మైలాన్‌, కోవలంట్‌, హెట్రో లాంటి ఫార్మా, కెమికల్‌, రబ్బర్‌ కంపెనీలు కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదులుతున్నాయి. పటాన్‌చెరువు ఏరియాలోని జిన్నారం, గడ్డిపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, పాశమైలారం, సంగారెడ్డి, బోర్‌పట్ల, సదాశివ పేట, కొండాపూర్‌, దిగ్వాల్‌ ప్రాంతాల్లో ఈ కంపెనీలు విషాన్ని వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యం పటాన్‌ చెరువు మీదుగా నక్కవాగులోకి వచ్చి మంజీరా నదిలో కాలుష్య వ్యర్థాలు కలుస్తున్నాయి. మంజీరా నీరు సింగూరు జలాశయానికి చేరుతుంది. ఆ నీరు హైదరాబాద్‌ ప్రజలకు త్రాగునీటిగా వినియోగిస్తున్నారు. ఆశ్చర్యమేమంటే ఈ కంపెనీలు తాము విడుదల చేస్తున్న కాలుష్యాన్ని బోర్లు వేసి భూగర్భ జలాల్లో కలుపుతున్నారు. 27చెరువులు పూర్తిగా కాలుష్యమయమై చేపలేకాక ఏ జీవరాశీ బతకలేని స్థితికి చేరుకున్నాయి. ఈ కంపెనీలకు అతి దగ్గరలోనే కాలుష్య నియంత్రణ మండలి జోనల్‌ అధికార కార్యాలయం ఉంది. వాస్తవానికి ఈ ఫ్యాక్టరీలన్నీ హైదరాబాదు సిటీకి 100కి.మీల దూరంలో నిర్మించాలి. కానీ ఇప్పుడు మధ్య సిటీలో ఇవి కొనసాగుతున్నాయి.

ఈ కాలుష్యానికి తోడు మరింత కాలుష్యాన్ని జతకలపడానికి ప్రస్తుత ప్రభుత్వం ఫార్మా ఫ్యాక్టరీల ఏర్పాటుతో రాష్ట్రం అభివృద్ధిలోకి వెళుతుందని ప్రచారం చేస్తున్నది. ఇప్పటికే హైదరాబాదు పట్టణంలో 107పరిశ్రమలుండగా చుట్టుపక్కల మరో 70పరిశ్రమలున్నాయి. పోలెపల్లి సెజ్‌(జడ్చర్ల) ముచ్చర్ల ఫార్మా(19000 ఎకరాలు) సేకరించి ఫార్మా అభివృద్ధికి పథకాలు వేస్తున్నారు. వాస్తవానికి మనదేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఫార్మా ఉత్పత్తులు అమెరికా, రష్యా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. గత దశాబ్ద కాలంగా అమెరికా, జర్మనీ, జపాన్‌, ఇంగ్లాండ్‌, కెనడా, స్పెయిన్‌ లాంటి దేశాలు తమకు కావల్సిన ఫార్మా ఉత్పత్తులకు తమ పెట్టుబడిదారులను ప్రోత్సహించి బలహీనమైన, అభివృద్ధి చెందుతున్న మూడవ ప్రపంచదేశాలలో ఉత్పత్తి చేసి 100శాతం ఎగుమతులను తమ దేశానికి తెచ్చుకుంటున్నారు. కాలుష్యాన్ని మనకు అంట గట్టి ఉత్పత్తులను వారు తీసుకెళ్తున్నారు. ఈ మద్య అమెరికా అధ్యక్షుడు ట్రంపు బెదిరింపుతో భారతదేశం నుండి తమకు కావాల్సిన మందు లను దిగుమతి చేసుకున్నది మనం చూశాం.

ఏ అభివృద్ధి చెందుతున్న దేశం కూడా ఫార్మా ఉత్పత్తులపై దృష్టిపెట్టదు. ఆదిభట్ల, ఇబ్రహిం పట్నం ప్రాంతాలను కూడా కాలుష్యమయం చేయబోతున్నారు. ఉపాధి కల్పనకు ఎలక్ట్రికల్‌ గూడ్స్‌, నాన్‌ ఎలక్రికల్‌ గూడ్స్‌ ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం ఉండదు. ఈ సరుకులను ప్రస్తుతం మనం రూ.4లక్షల కోట్లు విలువగలవి దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులు తప్పించవచ్చు. టెక్స్‌టైల్‌ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి దేశంలో ముడిసరుకు(పత్తి) లభ్యత సరిపడినంత ఉన్నది. పై మూడు రకాల పరిశ్రమలకు ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ మానవ శ్రమ తప్పనిసరి. అందువల్ల ఉపాధి కల్పనకు అవసరమైన, ప్రమాదం లేని ఫ్యాక్టరీలను అనేకం నిర్మించుకునే అవకాశం ఉంది.

ఆరోగ్య వసతులు అంతగా అబివృద్ధి చెందని మన దేశంలోనూ ధనిక దేశాలు తమ కాలుష్యాన్ని మనకు అంటగట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను మన పాలకులు ఎందుకు ఎదిరించలేకపోతున్నారు. అంతర్జాతీయ ఒప్పందాల మూలంగా సరళీకరణ పేరుతో కోట్లాది మంది భారత ప్రజల భవితవ్యానికి ప్రమాదం కలిగించే ఈ పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకించాలి. నిబంధనలను అమలు జరపని పరిశ్రమలను మూసివేయించాలి. ప్రమాదకర పరిశ్రమలను పట్టణాలకు, గ్రామాలకు దూరంగా నిర్మించాలి. భూగర్భ జలాలు, జలకాలుష్యం, వాయు కాలుష్యం జరగకుండా చూడాలి. పారిశ్రామిక పెరుగుదలకు ఆటంకం లేకుండా అనువైన పరిశ్రమలను స్థాపించాలి. ప్రమాదాల వల్ల నష్టపోయిన కార్మికులకేగాక ప్రజలకు పూర్తి పరిహారం చెల్లించాలి.

సారంపల్లి మల్లారెడ్డి

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates