వృద్ధి రేటుకు కోత

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ
– వచ్చే ఏడాది 3.5 శాతమే : ఎస్‌అండ్‌పీ

న్యూఢిల్లీ : మాంద్యం దెబ్బకు ఇప్పటికే విలవిలమం టున్న భారత ఆర్థిక వ్యవస్థకు కరోనా తోడవడంతో మరింత క్షీణించనుందనే రిపోర్టులు పెరుగుతున్నాయి. భారత జీడీపీ అంచనాలకు ఇటీవలే మూడీస్‌ భారీగా కోత పెట్టగా… తాజాగా ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌, ఇండియా రేటింగ్స్‌, నోమురా లాంటి తదితర ఏజెన్సీలు కూడా అదే తరహాలో విశ్లేషణ చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ వృద్ధి రేటు 3.5 శాతానికే పరిమితం కావచ్చొని ఎస్‌అండ్‌పీ సోమవారం ఓ రిపోర్టులో అంచనా వేసింది. ఇంతక్రితం 5.2 శాతంగా అంచనా వేసింది. ఆసియా ఫసిపిక్‌ రీజియన్‌లో నెలకొన్న బలహీన రుణ పరిస్థితులకు తోడు, కరోనా వల్ల అనేక దేశాల్లో మొండి బాకీలు పెరగడంతో పాటు డిమాండ్‌ కూడా పడిపోనుందని విశ్లేషించింది. వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రభుత్వాల ఉద్దీపనలు కొంత ఉపశమనం కల్పించవచ్చని ఈ రిపోర్టు పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు ముఖ్యంగా కార్పొరేట్ల రుణాల నాణ్యతను దెబ్బతినడం ద్వారా డిఫాల్ట్స్‌ పెరగొచ్చని, డిమాండ్‌ కూడా పడిపోవచ్చని విశ్లేషించింది. 2021-22లో భారత వృద్ధి రేటు 7.3 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. కాగా చైనాలో పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుందని ఈ ఏజెన్సీ పేర్కొంది. 2020లో ఆసియా, ఫసిపిక్‌ దేశాల వృద్ధి రేటు 2.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనాలు 2.7 శాతంగా ఉన్నాయి.

ఇండియా రేటింగ్స్‌ సమీక్ష..
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత వృద్ధి రేటు 3.6 శాతానికి తగ్గొచ్చని మరో రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌్‌ సోమవారం విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనా 5.5 శాతంగా ఉంది. కరోనా వైరస్‌ వల్ల దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ విధించడంతో వల్ల వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడనుందని పేర్కొంది. 2019-20లోనూ భారత వృద్ధి రేటు 4.7 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది.

6.1 శాతానికి పతనం : నోమురా
ప్రస్తుత ఏడాది మార్చితో ముగియనున్న త్రైమాసికంలో భారత జీడీపీ 3.1 శాతానికి పడిపోనుందని మరో ఏజెన్సీ నోమురా అంచనా వేసింది. 2019 డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 4.7 శాతం పెరిగింది. కాగా వచ్చే జూన్‌తో ముగిసే త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా మైనస్‌ 6.1 శాతానికి దిగజారొచ్చని విశ్లేషించింది. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు లాక్‌డౌన్‌తో 75 శాతం భారత ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడంతో వచ్చే కొన్ని నెలలు చాలా కఠినంగా ఉండనున్నాయని విశ్లేషించింది. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ చాలా బలహీనంగా ఉందని పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో ఆర్ధిక వ్యవస్థ కొంత పుంజుకోవచ్చని తెలిపింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates