కనుమరుగవుతున్న నా కలల దేశం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆగస్టు 5, 2020 తీవ్రమైన విచారాన్ని, నష్టాన్ని కలిగించిన రోజు. ఎగుడుదిగుడుగా ఉన్నా, అందమైన, మానవత్వంతో కూడిన, విస్తృత ప్రజా బాహుళ్యానికి సమాన పౌరసత్వం ఉండాలన్న భావనలతో, ఆశాజనకంగా కొనసాగుతున్న భారతదేశ ప్రయాణాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిలిపివేసిన రోజుగా చరిత్ర గుర్తుంచు కుంటుంది. అది అసమానమైన అహంభావంతో, హిందూత్వ ఆధిపత్య భావజాలమే పునాదిగా, భారత రాజ్యాంగంలో దేశ ప్రజలు చేసిన ప్రతిజ్ఞను పూర్తిగా తారుమారు చేస్తున్న ప్రభుత్వం.

ఈ విషాదాన్ని ముందే చెప్పారా? 1948, జనవరి నెల చలికాలపు రోజు మధ్యాహ్న సమయాన సర్వమత ప్రార్థనలలో ఉన్న మహాత్మాగాంధీ బలహీనమైన శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయిన నాటి నుంచి, హంతకుని భావజాలం చివరికి విజయం పొందేందుకే కట్టుబడి ఉందా? ఏదో ఒక రోజు ఈ దేశం అన్ని విధాలుగా సమానంగా ప్రతీ విశ్వాసం, ప్రతీ కులం, ప్రతీ వర్గం, ప్రతీ స్త్రీ, పురుషునికి, సమాన సంస్కతి, ఆచార వ్యవహారాలు ఉన్న ప్రతీ జాతికి, ప్రతీ వర్ణానికి, సామర్థ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ చెందుతుందని కన్న రంగుల కలలన్నీ కల్లలవడం అనివార్యమైందా? ఇదే కల భవిష్యత్‌ తరాలకు నిజం కాకుండా నాశనమైనట్లేనా?

అదుపులేని సమూహాల హింసాత్మక చర్యలతో కూల్చి వేయబడిన మధ్య యుగాల కాలం నాటి ఒక మసీదు స్థానంలో నిర్మించనున్న హిందూ దేవాలయ నిర్మాణం కోసం జరిగే ఒక ప్రయివేటు కార్యక్రమానికి, రాజ్యాంగ నియమ నిబంధనలను అన్నింటినీ ఉల్లంఘించి అధ్యక్షత వహించడానికి తీసుకున్న మన ప్రధానమంత్రి నిర్ణయం హిందూమత తీవ్రమైన పురుష ఆధిపత్య విజయాన్ని సూచిస్తున్నది. భారతదేశ కొత్త రిపబ్లిక్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొనే భయంకరమైన ప్రాంతాల్లో అది ఒకటి అని, భారతదేశంలోని మైనారిటీ మతస్థులకు స్పష్టంగా అర్థమయ్యేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

అనైతిక, క్రూర రాజకీయాలు
నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇంత గొప్ప కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చు. వారి భావజాలంపై విశ్వాసంలేని ఒక వైరస్‌ కారణంగా అతని రాక విచిత్రంగా ఆగిపోయింది. కానీ నేడు నరేంద్రమోడీ చారిత్రాత్మకమైన రోజున అయోధ్యకు చేరడంలో, 2002 నుంచి నేటి వరకు అనైతిక, క్రూరమైన రాజకీయాల్లో అతని సన్నిహితుని పాత్రను చరిత్ర కచ్చితంగా గుర్తించాలి. కాషాయ దుస్తుల్లో ఉండి చేసిన తప్పుడు పనులకు క్షమాపణలు కూడా చెప్పని అలవాటుతో ద్వేష రాజకీయాలు ఆచరించే మరొక మోడీ సహాయకుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏ వివరమూ ఇవ్వలేదు.

బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్యమ నిర్మాతలైన అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకుండా మరుగున పరిచారు. 1989లో అద్వానీ రథయాత్రకు ఉపయోగించిన టొయోటా రథం ప్రతీ చోటా రక్తపు మరకలను వదిలి వెళ్తూ, భయాందోళనలకు గురిచేసింది. ఆ రథం ఫొటోలే నరేంద్రమోడీ ఉద్యమానికి జూనియర్‌ వాలంటీర్‌ అనే విషయాన్ని తెలియజేశాయి. మోడీ అయోధ్యలో అడుగు పెట్టిన సమయం, తన భావజాల మార్గదర్శిని అయిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఊహలో మెజారిటీ మతంగా ఉన్న హిందూ మత రాజ్యంగా మన గణతంత్ర రాజ్యం యొక్క రూపాన్ని మార్చే ప్రయత్నాన్ని సూచించింది. ఈ సమయంలో మోడీ చరిత్రలో ముఖ్యమైన తన కీర్తి, వైభవాల గురించి ఎవ్వరితోనూ పంచుకునేందుకు ఇష్టపడడం లేదు.

కానీ మోడీ-అమిత్‌ షా-ఆదిత్యనాథ్‌ త్రయం మాత్రమే ఒక పురాతన కాలపు యుద్ధాన్ని ఒక నిర్ణయాత్మకమైన, నాటకీయ ఉచ్ఛస్థితికి తీసుకొని వచ్చారు. ఒక శతాబ్దానికి పైగా కాలం నుంచి హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు మద్దతుదారులు ముస్లింలను, క్రైస్తవులను రెండవ తరగతి పౌరులుగా నివసించడానికి అనుమతించే హిందూ రాజ్య స్థాపన కోసం నిర్విరామంగా పోరాడుతున్నారు.
బాబ్రీ మసీదు స్థలంలో రామాలయాన్ని నిర్మించేందుకు చేస్తున్న ఉద్యమం విభజన తర్వాత జరిగే మత హింసకు, హత్యలకు గొప్ప ప్రేరణ. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేసేది స్పష్టమైనప్పటికే, భగల్‌ పూర్‌ నుంచి బొంబాయి, భోపాల్‌, గుజరాత్‌, ఉత్తర భారతదేశంలోని హిందీ ప్రాంతాల్లోని అసంఖ్యాకమైన నగరాలు, పట్టణాల వరకు రక్తపాతంతో కూడిన రామ మందిర శంకుస్థాపనలు జరిగాయి. ఈ క్రమంలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులే నేరం చేసిన వారిని శిక్షించకుండా చట్టాన్ని, రాజ్యాంగాన్ని అలక్ష్యం చేశారు.

కానీ విధ్వంసకారుల సమూహం కూల్చివేసిన మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయడం ఒక తప్పిదం (లేదా గౌరవం, మీరు చూసే దాన్ని బట్టి). ఈ తప్పిదానికి కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు, బీజేపీల కలయిక, వారి మద్దతుదారులది మాత్రమే బాధ్యత కాదు. రాజకీయ ప్రతిపక్షం, ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాట వారసత్వాన్ని కాపాడి ఉండి ఉంటే, భారత గణతంత్ర రాజ్యం ఈ స్థితికి చేరుకొని ఉండెడిది కాదు. అందుకు బదులుగా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అసలు వాస్తవాలను మాట్లాడకుండా, చిత్తశుద్ధిలేని తనంతో, ద్వంద స్వభావంతో, చాలా ప్రమాదకరంగా గణతంత్ర రాజ్య వ్యవస్థ పునాదులు లేకుండా చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ రాజకీయ చర్యలకు, ప్రభుత్వ నిర్ణయాలకు బహిరంగ మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక ప్రధానమంత్రి బాబ్రీ మసీదు తాళాలు తీశాడు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇంకొక వ్యక్తి ప్రధానిగా ఉన్న సమయంలోనే మసీదును కూల్చి వేశారు. అనేక మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల పదవీకాలంలోనే పెద్ద ఎత్తున మతపరమైన చిచ్చులు రగిలాయి.

కాంగ్రెస్‌ ద్వంద వైఖరి
నేడు కూడా రామ మందిరానికి పునాది రాయి వేస్తున్నప్పుడు అనేక మంది రాజకీయ ప్రతిపక్ష నాయకులు, రాత్రి పూట పెద్ద దీపాల వెలుగు (హెడ్‌ లైట్స్‌)లో చిక్కుకుపోయిన లేడిపిల్లలా, దుర్బలమై, విచారంతో, చలనం లేకుండా, కలవర పడుతూ ఎటువైపు పరుగెత్తాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు.”విచార కరమైన విషయం ఏమిటంటే, మంచి లేక చెడు చేయడానికి మానసిక సంసిద్ధతలేని వారే ఎక్కువ చెడు చేస్తారని” ఈ సందర్భంగా హన్నా ఆర్డెంట్‌ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో కొన్ని వర్గాల వారు దేవాలయ నిర్మాణానికి బహిరంగంగా స్పష్టమైన మద్దతు ఇస్తున్నారు. కొందరు వేరుపడిపోయిన హిందూ ఓటరుకు చికాకు కలిగించకుండా ఉండేందుకు మౌనంగా ఉండమని సలహా ఇస్తున్నారు.

”సీతమ్మ తల్లి, రామయ్యల సందేశం, దయాదాక్షిణ్యాలతో రామలల్లా మందిర నిర్మాణానికి వేస్తున్న పునాది రాయి జాతి ఐక్యతకు, సౌభ్రాతత్వానికి, సాంస్కతిక ఏకీకరణకు ఒక మంచి సందర్భం” అని కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులలో ఒకరైన ప్రియాంకా గాంధీ వాద్రా ట్వీట్‌ చేశారు.
కేవలం హిందువులకు మాత్రమే కాక భారతీయులందరికీ ప్రధాన మంత్రి అయిన వ్యక్తి, కోర్టు ఆదేశాలను, చట్టాలను అతిక్రమించి, విధ్వంసకర సమూహాలు ఒక పెద్ద మసీదును కూల్చివేసిన స్థలంలో ఒక హిందూ దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి ప్రతీక (సింబాలిజమ్‌) ఐక్యతకు, సౌభ్రాతత్వానికి ఏ విధంగానూ ఒక మంచి సందర్భం కాలేదని చెప్పేందుకు వామపక్షాలు తప్ప ఎవరూ సిద్ధంగా లేరు.

అధిక సంఖ్యాకుల హింసాయుత అణచివేత, బ్రాహ్మణ భావజాల, హిందూత్వ తీవ్రవాదంలోకి వైవిధ్యమైన ఆరాధన, సాంస్కతిక వ్యక్తీకరణల బలవంతపు విలీనీకరణల ప్రతివాదానికి ఇది ప్రతీక. మొత్తం రాజకీయ చట్రంలో ఏ ఒక్కరూ, భారత దేశంలోని ముస్లింలకు, ఇతర మైనారిటీ మతస్థులకు, వారి యొక్క సంస్కృతి, హక్కులు అధిక సంఖ్యాకుల స్వాధీనతకు అంగీకరించమని భరోసా ఇచ్చేందుకు సిద్ధంగా లేరు.

ఇది ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడి, రెండవ దఫా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, కాబట్టి తమ పార్టీ భావజాలానికి, దార్శనికతకు అనుగుణంగా భారతదేశాన్ని రూపుదిద్దేందుకు ప్రజలు ఆదేశించారని ప్రస్తుత ప్రభుత్వ మద్దతుదారులు వాదించవచ్చు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు లభించాయి, ఎవరు ఆ ఓట్లు వేశారు అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, మొత్తం ఓట్లలో బీజేపీకి 37.6శాతం ఓట్లు లభించాయి.
2014లో మోడీ ఉద్యోగాలు కల్పించి, దేశాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసినట్టు కాకుండా, 2019లో హిందూ జాతీయతా వాదమనే స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి భారతదేశంలోని మెజారిటీ హిందూ ఓటర్లు హిందూ జాతి చట్టాన్ని, దాని అమలును ముందుకు తీసుకొని వెళ్ళేందుకు తనను ఆదేశించారని విశ్వసించడాన్ని మోడీ సమర్థించుకున్నాడు. మెజారిటీ ఆధిపత్య మత వర్గాల, జాతుల మద్దతుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మానవత్వపు విలువలు గల ప్రజాస్వామ్యానికి ఏమి చేయగలదో 1930లో నాజీ జర్మనీ అనుభవమే ఒక భయంకరమైన ఉదాహరణ. బలమైన హింసాత్మక అసంఖ్యాక ఆధిపత్య మతస్థుల నుంచి మైనారిటీ మతస్థులను కాపాడలేని ప్రజాస్వామ్యానికి అర్థం లేదు.

పెరుగుతున్న అసహన ప్రజాస్వామ్యం
ఏదో ఒక రోజు ద్వేషం, ముందో వెనకో ప్రేమ పైన విజయం సాధిస్తుందని ముందే చెప్పబడుతుందా? అనే ప్రశ్నను ఈ వ్యాసం ప్రారంభంలోనే నేను అడిగాను. అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వేసిన పునాది రాయి, భారతదేశాన్ని సాంప్రదాయాల ప్రకారం అభిషేకించి నట్టు, లేక రాజకీయ శాస్త్రవేత్త అయిన అశుతోష్‌ వర్షిణి వివరించిన విధంగా భారతదేశాన్ని ఒక అసహన ప్రజాస్వామ్య దేశంగా నిర్ణయించినట్టు సూచిస్తున్నది. 500 సంవత్సరాలకు పైగా ఒక చోట ఉన్న ఒక మసీదు స్థానంలో ఒక వైభవోపేతమైన దేవాలయాన్ని నిర్మిస్తారు. పొడవైన ఈ దేవాలయం నీడలో నేను పెరిగిన నా దేశం హెచ్చు స్థాయిలో మరుగున పడి, శాశ్వతంగా లేకుండా పోతుంది.
అయినప్పటికీ, ఈ దేశం తనను అదుపు చేసే హీన బుద్ధిగల మత మౌఢ్యుల కన్నా గొప్పదని నేను నమ్ముతాను. సమాన పౌరసత్వ భావన ఉన్న ఒక మానవతా విలువలు గల దేశానికి పెద్ద దెబ్బ అని నేను అంగీకరిస్తాను. కానీ అది ఇంకా చల్లారలేదని కూడా నేను నమ్ముతాను.

”స్క్రాల్‌.ఇన్‌” సౌజన్యంతో

అనువాదం:బోడపట్ల రవీందర్‌, సెల్‌:9848412451
హర్ష మందిర్‌

RELATED ARTICLES

Latest Updates