వలస కార్మికుల వేదన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సొంత ఊర్లో పని లేక వృద్ధులను, పిల్లలను ఇళ్ళ దగ్గర వదిలేసి లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు బతుకుదెరువు కోసం వలస పోతుంటారు. మార్చి నెలాఖరుకే వలస వచ్చిన పేదలకు పనులు తగ్గిపోయాయి. తిరిగి సొంత ఊర్లకు చేరకునే సమయంలో పిడుగు పాటుగా కరోనా లాక్‌డౌన్‌ విధించడం వల్ల లక్షలాది మంది వలస కార్మికుల స్థితి నడి సముద్రంలో చిక్కిన నావలాగ అయిపోయింది. వెళదామంటే పోలీసుల బాధ, ఉన్నచోట పని లేదు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. ఆకలి బాధలు వెంటాడుతున్నాయి. ఇంటి దగ్గర వదిలి వచ్చిన వృద్ధులు, పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. వారి కోసం ఉంచిన రేషన్‌ అయి పోయింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. అర చేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సొంత ఊర్లకు వెళ్ళిపోదామంటే అవకాశమే లేదు. వలస వచ్చిన చోట కనీసం వారికి సరైన వసతి లేదు, వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్‌ గుడారాలే వీరి భవనాలు. ఫ్యాన్ల కిందే ఉండలేని ఈ వేసవిలో…42 డిగ్రీల ఎండలో ప్లాస్టిక్‌ కవర్ల కింద వారు జీవనం కొనసాగిస్తున్నారు. వయసు మళ్ళిన వారు, గర్భవతులు, చంటి పిల్లల పరిస్థితి వర్ణించడానికి మాటలు లేవు.

కొంత మంది ప్రాణాలకు తెగించి సొంత గ్రామాలు చేరుకోవడానికి వందల మైళ్ళు కాలి నడకన బయలు దేరారు. దారిలో వారు అనుభవిస్తున్న బాధలు అనంతం. దీనికంతటికి మూలం ఏమిటి? ఇది అకస్మాత్తుగా వచ్చి పడిన విపత్తా? లేక పాలక వర్గాలు చేసిన తప్పిదమా? రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం కోటి మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారు మరో 50 లక్షల మంది పైగా ఉన్నారు. గతంలో వీరికి ఏడాదికి 150 నుండి 200 రోజులు వ్యవసాయ రంగంలో పని దొరికేది. నేడు 30 నుంది 50 రోజులకు మించి పని దొరకడం లేదు. ఉపాధి హామీ పనులూ లేవు. ప్రభుత్వాలు ఉన్న ఊర్లో పని కల్పించి, కనీస వేతనాలు అమలు చేసినట్లయితే ఇన్ని లక్షల మంది వలసలు పొయ్యేవారు కాదు. ఇంత విపత్తులో చిక్కుకునే వారు కాదు. కాబట్టి దీనికి కారణం ముమ్మాటికి ప్రభుత్వాలే. ఈ లాక్‌డౌన్‌ వల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయింది వలస కార్మికులే. ఎందుకంటే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు చిత్తశుద్ధితో పేదల పక్షపాతిగా ఆలోచించినట్లయితే ఇంత నష్టం జరిగేది కాదు. కనీసం 3,4 రోజులు సమయం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి, అదనపు రైళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బస్సులు, లారీలు, ఇతర వాహనాల సౌకర్యం కల్పించి ఉంటే సింహ భాగం పేదలు సొంత గూడికి చేరుకొని కనీసం కల్లో, గంజో తాగి కుటుంబ సభ్యులతో గడిపేవారు. కానీ ప్రభుత్వం వీరి గురించి కనీసం ఆలోచించలేదు సరికదా వీరిని మనుషులుగా కూడా చూడలేదు.

గతంలో పెద్ద నోట్లు రద్దు చేసిన్పుడు కేంద్ర ప్రభుత్వం పేదలను ఎలా బలి తీసుకుందో నేడు అదే విధంగా వ్యవహరించింది. ఈ దారుణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇంతటి విపత్తులో కూడా కూలీలను కడుపులో పెట్టుకొని ఆదుకొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం వలస కూలీలకు నివాసంతో పాటు, అత్యవసర సౌకర్యాలను ఏర్పరిచి వారిని ఆదుకుంది. ఇటువంటి సహాయక చర్యలను అన్ని రాష్ట్రాలలో చేపట్టి ఉంటే వలస కార్మికుల పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండేది కాదు. వందల కిలో మీటర్లు ఎర్రటెండలో ఆకలితో వేలాది మంది కాలి బాట పట్టేవారు కాదు. పేదల ప్రాణాలు పోయేవి కావు. ఒక పక్క ఈ విపత్తు వల్ల పేదలంతా ఆకలితో అలమటిస్తుంటే గోదాముల్లో కోట్ల టన్నుల ధాన్యం ముక్కిపోతున్నాయి. పందికొక్కుల పాలౌతున్నా సరే…వాటిని పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాలేదు. రూ.లక్షల కోట్లు బడాబాబులు ప్రభుత్వ బ్యాంకులకు ఎగనామం పెడుతున్నా పర్వాలేదుగాని, ఈ కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి మనస్కరించడం లేదు. గంట కొట్టమని, దీపాలు వెలిగించమని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప కేంద్రం చేసింది శూన్యం.

ఈ కరోనా మహమ్మారి వల్ల ఏమో కాని తదనంతరం పేదల ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందని అనేక మంది మేధావులు ఇప్పటికే చెబుతున్నారు. కాబట్టి తక్షణమే వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వలస కూలీలను గుర్తించి వారి కుటుంబాలకు కనీసం 6 నెలల పాటు నెలకు రూ. 7,500 నగదు, 50 కేజీల బియ్యం ఇవ్వాలి. ఈ నెల 20 తర్వాత వలస కార్మికులను ప్రభుత్వమే ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు పంపాలి. వీటన్నింటిని చక్కదిద్దడానికి, వలస కూలీల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. అప్పుడే వలస కార్మికుల ఆకలి చావులను అరికట్టవచ్చు. ఇది జరగక, ఆకలిగొన్న పేదలు ఆందోళనలకు దిగితే భౌతిక దూరానికి భంగం వాటిల్లి మరింత ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది.

వి. వెంకటేశ్వర్లు
వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates