భాష ఏదైనా నో ప్రాబ్లం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఐఐఐటీ హైదరాబాద్‌ వినూత్న ఆవిష్కరణ.. ‘లిప్‌గాన్‌ మాడ్యూల్‌’
వీడియో క్లిప్స్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి అనువదించే టూల్‌
యానిమేషన్, డబ్బింగ్, మీడియా, ట్రాన్స్‌లేషన్‌ రంగాలకు ఉపయుక్తం 

సిటీబ్యూరో: మీరు ఆంగ్లభాషలోని ఓ వీడియో క్లిప్పింగ్‌ వీక్షిస్తున్నారనుకోండి. ఆ క్లిప్‌లో మాట్లాడుతున్న వ్యక్తి భాష, లిప్‌మూమెంట్‌ అర్థంకాక తల పట్టుకుంటున్నారా?.. ఇకపై ఆ అవస్థలు తీరనున్నాయి. భాష ఏదైనా, ఆ మాట్లాడే వ్యక్తి భావాన్ని యథాతథంగా తెలుగు ఆడియో క్లిప్‌ ద్వారా మీకందించే సరికొత్త టూల్‌ను ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ– హైదరాబాద్‌ (ఐఐఐటీ–హెచ్‌) రూపొందించింది. మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలో ఇదో సరికొత్త ఆవిష్కరణ అని ఐఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. వీడియో క్లిప్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి తేలికగా అనువదించేందుకు ఈ టూల్‌ అద్భుతంగా పనిచేస్తుందని ఐఐఐటీ–హెచ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం డీన్‌ సీవీ జవహర్‌ తెలిపారు.

లిప్‌గాన్‌ మాడ్యూల్‌ 
డీన్‌ జవహర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంగ్లిష్‌ భాష నుంచి పలు భారతీయ భాషల్లోకి వివిధ రకాలైన వీడియో క్లిప్‌లను ఈ టూల్‌ ద్వారా తర్జుమా చేసుకోవచ్చు. డబ్బింగ్‌ సినిమాలు, యానిమేషన్, మీడియా రంగాలకు ఈ టూల్‌ ఉపయుక్తంగా ఉంటుంది. పెదాల కదలికల ఆధారంగా జరిగే సంభాషణ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, లిప్‌ సింక్రనైజేషన్‌ మిస్‌ కాకుండా తర్జుమా చేసుకోవచ్చు. టెక్నాలజీ పరిభాషలో ఈ ఆవిష్కరణను ‘లిప్‌గాన్‌ మాడ్యూల్‌’అంటారు. తర్జుమా అయ్యే భాషకనుగుణంగా ఈ మాడ్యూల్‌ వీడియో క్లిప్‌లోని వ్యక్తి లిప్‌ మూమెంట్‌ను సరిచేస్తుంది.

కొన్నిసార్లు డబ్బింగ్‌ సినిమాల్లో లిప్‌ మూమెంట్‌ సరిగ్గా లేక వీడియో క్లిప్‌ నాణ్యత అంతగా ఉండదు. లిప్‌గాన్‌ మాడ్యూల్‌తో అటువంటి అవస్థలుండవు. దీని ద్వారా గంటల నిడివి ఉన్న వీడియోలను సైతం సులభంగా భారతీయ భాషల్లోకి తర్జుమా చేసుకోవచ్చు. ఈ మెషీన్‌ టూల్‌పై ‘టువార్డ్స్‌ ఆటోమేటిక్‌ ఫేస్‌ టు ఫేస్‌ ట్రాన్స్‌లేషన్‌’పేరుతో పరిశోధన పత్రాన్ని సిద్ధం చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ మల్టీమీడియా సదస్సులోనూ దీన్ని సమర్పించారు. మరిన్ని పరిశోధనలు, ప్రయోగ పరీక్షల అనంతరం ఈ మిషన్‌ లెర్నింగ్‌ సాంకేతికతను ఆయా రంగాలు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతారు.

Courtesy Sakshi

RELATED ARTICLES

Latest Updates