ఎలా.. ఎత్తేయాలి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • లాక్‌డౌన్‌పై నిపుణుల మల్లగుల్లాలు
  • ఎత్తేస్తే కరోనా విస్తరించే ప్రమాదం
  • ఎత్తేయకపోతే ఆర్థిక వ్యవస్థ పతనం
  • కరువు కాటకాలూ సంభవించే ముప్పు
  • 23 శాతానికి నిరుద్యోగం: సీఎంఐఈ
  • పట్టణ ప్రాంతాల్లో 9 శాతానికి!
  • క్లస్టర్‌ కంటెయిన్‌మెంట్‌ వ్యూహాన్ని
  • పాటించాలని నిపుణుల సూచన
  • వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉన్న చోట్ల
  • కఠినంగా లాక్‌డౌన్‌ ఆంక్షల అమలు
  • లేని చోట్ల.. కొన్ని షరతులతో ఎత్తివేత
  • రెడ్‌జోన్ల గుర్తింపు అందులో భాగమే

మనకు తెలిసిన 50 శాతం సమాచారంతో 100 శాతం నిర్ణయాలు తీసుకుని, పర్యవసానాలను భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిన సంక్షోభమిది.
-మార్క్‌ రుట్‌, నెదర్లాండ్స్‌ ప్రధాని (లాక్‌డౌన్‌ ఎత్తివేతపై)

లాక్‌డౌన్‌ ఎత్తేస్తే ఆర్థిక వ్యవస్థకు మేలు. కానీ ఆరోగ్య వ్యవస్థ సంక్షోభంలో పడొచ్చు. ఎత్తేయకపోతే కరోనా ఉధృతి తగ్గొచ్చు గానీ.. ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే ముప్పుంది. ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అనే సామెత చందంగా ఉంది ప్రభుత్వం పరిస్థితి. టు బి.. ఆర్‌.. నాట్‌ టు బి..! లాక్‌డౌన్‌ ఎత్తేయాలా? వద్దా? ఎత్తేస్తే.. ఎలా ముందుకు వెళ్లాలి? కోట్లాది మంది భారతీయుల ఉపాధికి సంబంధించిన సమస్య ఇది. ఆరోగ్యానికి సంబంధించిన సంక్షోభమిది. రెండింటినీ సమతుల్యం చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది!

మూడువారాల లాక్‌డౌన్‌ మరో మూడు రోజుల్లో ముగియబోతోంది! ఆ తర్వాత? ఏం చేయాలి? పద్మవ్యూహంలోకి ప్రవేశించినట్టు ఉంది సర్కారు పరిస్థితి. లాక్‌డౌన్‌ అనే పద్మవ్యూహంలోకి దాదాపు మూడువారాల క్రితం ప్రవేశం జరిగిపోయింది. అప్పటికి అదే కరెక్టు. ఆ విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ, దాన్ని పొడిగించాలా వద్దా అనే అంశంపై మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాలయితే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం కూడా తీసేసుకున్నాయి. ప్రజల్లో సైతం అత్యధికులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే భావిస్తున్నారు. కానీ, ఇలా ఎంతకాలం? ఇప్పటికే దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వాన్ని మరింత భయపెడుతోంది. అంతేకాదు.. పంట ఉత్పత్తుల సప్లై చైన్‌ తెగిపోతే, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కరువు కూడా కమ్ముకొచ్చే ముప్పు ఉంది.

ఎక్కువ రోజులపాటు ఉద్యోగులు అందుబాటులో లేకుండాపోతే యజమానులు ఆటోమేషన్‌ వైపు దృష్టి సారించే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్‌ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగుల కొరతకు అంత ఎక్కువగా సాంకేతిక పరిష్కారాల గురించి ఆలోచిస్తారు. ఇది భవిష్యత్తులో మరింత నిరుద్యోగితకు కారణమవుతుంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చిన ప్రతిసారీ రుజువైన నిజమిది. ఇది పరిశ్రమల స్థాయిలో జరిగేది. పనిమనుషులు రాకపోవడంతో డిష్‌వాషర్లు, ఇల్లు శుభ్రపరిచే రోబోల వంటివాటి కొనుగోళ్లు పెరిగి పనిమనుషులకు ఉపాధి కరువవుతుంది. ఆర్థిక మాంద్యం కారణంగా సొంతం గా కార్లు డ్రైవ్‌ చేసుకోవడం మొదలుపెడితే డ్రైవర్లకు ఉపాధి పోతుంది. ఇలా ఎన్నో కష్టాలు. అందుకే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ ‘దశలవారీ ఎత్తివేత’ గురించి ప్రస్తావించారు. కానీ, మర్కజ్‌ కేసుల సంఖ్య తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగింపు అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

కొనసాగించాలంటున్నవారి మాట..
విస్తృతంగా వ్యాపించే కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసి.. ఆ సమయంలో ఆరోగ్య వ్యవస్థలను సన్నద్ధం చేసుకోవడం కోసమే ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అయినప్పటికీ మనదేశంలో కేసుల సంఖ్య (నెమ్మదిగా అయినా సరే) పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఉన్నా కూడా కొంత మంది ప్రజలు భయంలేకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్నారు. అలాంటిది లాక్‌డౌన్‌ ఎత్తేస్తే.. చాలా మంది రోడ్ల మీదకు వచ్చేస్తారని, మన దగ్గర కూడా అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లాంటి పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి పరిస్థితే వస్తే వారందరికీ వైద్యం చేసే పరిస్థితులు లేక ఆరోగ్యవ్యవస్థలు సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. కాబ ట్టి లాక్‌డౌన్‌ కొనసాగించాలన్నది కొందరు నిపుణుల వాదన.

ఎత్తేయాలంటున్నవారి వాదన..
కరోనా రాకముందు కూడా మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు.  లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింత దిగజారింది. ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తోంది. విమానయానం, పర్యాటకం, ఉత్పత్తి, రిటైల్‌, ఆటోమొబైల్‌ రంగాలు దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల దేశంలో నిరుద్యోగం సంఖ్య 23 శాతానికి.. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 31 శాతానికి పెరిగిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ఇటీవలే ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశంలో అలాంటి పరిశ్రమలు 6.3 కోట్ల దాకా ఉన్నాయి. మన అవసరాలకు కావాల్సిన వస్తువుల ఉత్పత్తిలో దాదాపు సగాన్ని అవే తీరుస్తున్నాయి.

10 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 10 కోట్ల మంది అంటే.. దేశ కార్మిక శక్తిలో దాదాపు 40% మంది!! లాక్‌డౌన్‌ ఎత్తేస్తే తప్ప ఆ పరిశ్రమలు ఈ సంక్షోభం నుంచి తప్పించుకోలేవు. అంతేకాదు.. లాక్‌డౌన్‌ కొనసాగించడం వల్ల ప్రజలు కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చుగానీ, లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే ఆకలితో చనిపోతారని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి లాక్‌డౌన్‌ ఎత్తేసినా కూడా ఇప్పటికిప్పుడు ప్రజల కొనుగోలు శక్తి భారీగా పెరగదని.. కానీ, నిరుద్యోగం కొంత వరకూ తగ్గుతుందని వారు విశ్లేషిస్తున్నారు.  గ్రామీణ భారతం కూడా లాక్‌డౌన్‌తో కుదేలవుతోంది. పంట చేతికొచ్చే సమయంలో తగినంత మంది కూలీలు దొరక్క.. కూలీలు దొరికినా సరుకు రవాణా వాహనాలు దొరక్క రైతన్నలు సతమతమవుతున్నారు. పంట ఉత్పత్తులు తగ్గితే మున్ముందు సరుకుల ధరలు భారీగా పెరిగి ఆ భారం ప్రజలపైనే పడే ప్రమాదం ఉంది.

మరి ఏం చేయొచ్చు?
ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థల్లో ఏదీ దెబ్బ తినకుండా.. ప్రభుత్వం క్లస్టర్‌ కంటెయిన్‌మెంట్‌ వ్యూహాన్ని అమలు చేయొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. క్లస్టర్‌ కంటెయిన్‌మెంట్‌ వ్యూహం అంటే.. మానవాళికి విపత్తుగా పరిణమించిన సూక్ష్మజీవుల వ్యాప్తిని అడ్డుకునే వ్యూహం. వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. ముప్పు పూర్తిగా తగ్గేదాకా ఆ ప్రాంతాలను దిగ్బంధించి ఉంచడం. రాజస్థాన్‌లోని భిల్వారాలో దీన్ని విజయవంతంగా అమలు చేశారు. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్ల గుర్తింపు అందులో భాగమే. ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు విధించి.. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉపసంహరించవచ్చని నిపుణుల విశ్లేషణ. అయితే, లాక్‌డౌన్‌ ఉపసంహరించిన చోట కూడా కొన్నాళ్లపాటు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అప్పుడు కూడా ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ వ్యూహంలో కూడా కొన్ని లోపాలున్నాయని.. మనదేశంలో తగినన్ని కరోనా పరీక్షలు జరగట్లేదు కాబట్టి హాట్‌స్పాట్ల గుర్తింపు అంత కచ్చితంగా ఉండకపోవచ్చని కొందరు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేతకు సంబంధించి మరో వ్యూహాన్ని కూడా ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ నిపుణు లు ప్రతిపాదిస్తున్నారు. అది ‘సప్రెస్‌ అండ్‌ లిఫ్ట్‌’ విధానం. అంటే.. కరోనా కేసుల సంఖ్య పెరిగే దాకా లాక్‌డౌన్‌ను ఎత్తేయడం (సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించే నిబంధనపై), ఒకసారి ఆ పరిస్థితి వచ్చాక లాక్‌డౌన్‌ను విధించాలి. మళ్లీ కేసుల సంఖ్య తగ్గగానే లాక్‌డౌన్‌ను ఎత్తేయడం. ఇలా ఏడాది వ్యవధిలో పలుమార్లు చేయడం ద్వారా అటు ఆరోగ, ఇటు ఆర్థిక వ్యవస్థలను సంక్షోభం నుంచి రక్షించుకోవచ్చన్నది వారి సిద్ధాంతం. కానీ, ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌ను ఎత్తివేతపై నిపుణులు సూచిస్తున్న మరికొన్ని మార్గాలేంటంటే..

రాష్ట్రాల పరిస్థితిని బట్టి లాక్‌డౌన్‌ సడలింపుపై ఆయా రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాంటి రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను కొనసాగిస్తూ.. తీవ్రత తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కొన్ని సడలింపులు చేయాలి.

రాష్ట్రాల మధ్య ప్రయాణాలను ఇప్పుడే అనుమతించకూడదు. స్థానికంగా మాత్రం ఎయిర్‌ కండిషన్‌ లేని బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థలను.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించడం, 10 నుంచి 60 ఏళ్లలోపు వారినే అనుమతించడం వంటి కొన్ని షరతులతో పనిచేయనివ్వాలి.

ఒకరినొకరు తాకే అవకాశం ఉన్న, ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకే అవకాశం ఉన్న క్షవరశాలలు, బ్యూటీ సెలూన్లు, సినిమా హాళ్లు, మాల్స్‌, వస్త్ర దుకాణాల వంటివాటి మూసివేతను కొనసాగించాలి. ఒకరినొకరు తాకకుండానే పని పూర్తిచేసుకోగల అవకాశం ఉన్న వ్యాపారాలను కొన్ని జాగ్రత్తలతో అనుమతించాలి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates