70 లక్షల ఉద్యోగాలకు ఎసరు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ : దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడిగింపు సాధారణ ప్రజానీకం మీదే గాక వ్యాపార రంగాలనూ కోలుకోలేని దెబ్బతీస్తున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు హౌటల్‌ ఇండిస్టీలోనూ భారీ ఎత్తున ఉద్యోగాల ఉద్వాసన ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా హౌటళ్లు మూసేయడంతో ఈ రంగంలో దాదాపు 70 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాతా ఇప్పటికిప్పుడు ఈ రంగం కోలుకునే అవకాశాలు కనిపించడం లేదనీ, దాదాపు ఐదారునెలల దాకా నష్టాలు తప్పవని యజమానులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతనెల 20 నుంచి హౌటళ్లన్నీ బంద్‌ పాటిస్తున్నాయి. వీటిలో పనిచేసే కార్మికులకు ఆ నెల జీతం ఇచ్చిన యజమానులు.. ఏప్రిల్‌ నెల జీతాన్ని ఇచ్చేది కష్టమే అని చెబుతున్నారు. 40 రోజుల మూసివేతతో ఈ రంగం చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తున్నదని యజమానులు అంటున్నారు.

లక్షలాది మంది ఉపాధికి గండి
మెట్రో నగరాలు, పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాల్లో సైతం నేడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. నగరాల్లో అయితే పర్యాటకరంగానికి హౌటల్‌ ఇండిస్టీ అనుబంధంగా వ్యవహరిస్తున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు హౌటల్స్‌లోనే ఉంటుండటంతో కొద్దికాలంగా ఈ పరిశ్రమ కూడా విస్తరిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. మెట్రో నగరాల్లో అయితే పలు హౌటళ్లు.. కార్పొరేట్‌ ఆఫీసులతోనూ అనుసంధానం అవుతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాలలో ఈ రంగం నిరుద్యోగులకు విస్తారంగా అవకాశాలు కల్పిస్తున్నది. దీంతోపాటు మధ్యతరహా, చిన్న హౌటళ్లూ భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, ఫైవ్‌స్టార్‌ హౌటల్స్‌ స్థాయిలో ఉండే మేనేజర్లు, చెఫ్‌లు, కెప్టెన్స్‌, హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది మొదలు.. సాధారణ హౌటళ్లలో ఉండే సర్వర్లు, క్లీనర్లు.. ఇలా లక్షలాది మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. కోవిడ్‌-19 విజృంభణ కారణంగా హౌటళ్లను మూసేయడంతో ప్రస్తుతం వీరంతా ఇంటికే పరిమితమయ్యారు. హౌటళ్లు తెరిచినా నష్టాల కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

వ్యవసాయరంగానికీ అనుబంధం
హౌటళ్లు వ్యవసాయరంగ ఉత్పత్తులను కొనడంలోనూ ముందున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే పాలలో 12శాతం పాలను ఈ రంగమే వినియోగిస్తు న్నదని నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు తెలిపింది. దేశంలో రైతులు పండించే పండ్లు, కూరగాయలలో ఒక్కశాతం ఉత్పత్తులను హౌటల్‌ ఇండిస్టీ కొను గోలు చేస్తున్నదని ఫిక్కీ చెబుతున్నది. మూసివేత కారణంగా కొనేవారు లేక పాల, కూరగాయల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.

ఆన్‌లైన్‌ డెలివరీలతో అంతంతే…
పలు హౌటళ్లు ఆన్‌లైన్‌ ద్వారా వినియోగ దారులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే ఇది 5 శాతం మాత్రమే. అది కూడా మెట్రో తరహా నగరాల్లో తప్పితే జిల్లా, మండల కేంద్రాల్లో ఆ అవకాశం కూడా లేదు. పోలీసులు, ఆయా ప్రభు త్వాలు కూడా అందుకు అనుమతినివ్వడం లేదు.

ప్రభుత్వం ఆదుకుంటేనే…
40 రోజుల మూసివేతతో హౌటల్‌ ఇండిస్టీ చాలా దెబ్బతిన్నదని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసి యేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) తెలిపింది. దీని నుంచి ఇప్పటికిప్పుడు గట్టెక్కలేమనీ, దాదాపు ఐదారునెల్ల దాకా ఇవే పరిస్థితులు కొనసాగే అవకా శం ఉన్నదని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు, డీగుస్తిబస్‌ హాస్పిటాలిటీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఎగ్గిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కట్రియార్‌ అన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ… ‘ఒక్క విషయం మాత్రం స్పష్టం. మేము కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడం అంత సులువుకాదు. గత కొన్నేళ్లుగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఈ రంగంలో ఇప్పుడు ఉద్యోగాల కోత తప్పకపోవచ్చు’ అని తెలిపారు. వీటన్నింటి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన కోరారు. హౌటల్స్‌ మీద 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారనీ.. ఆ స్లాబ్‌ను తగ్గిస్తూ, ప్రాపర్టీ ట్యాక్స్‌, ఇతర ట్యాక్స్‌ల్లోనూ మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవిం చారు. ప్రభుత్వం ఆదుకోకుంటే పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు, హౌటళ్లు మూసేయడం ఖాయమని అనురాగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న ఈ రంగాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

తెరిచినా కష్టమే : నికేశ్‌ లంబ, సొరుసొరు హౌటల్స్‌ అధినేత
ఇప్పటికే రెండునెలల ఆదాయం కోల్పోయాం. అది ఎలాగూ తిరిగిరాదు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత హౌటల్స్‌ తెరిచినా అవి గతంలో మాదిరి నడిచే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు నెలలుగా పనుల్లేక ప్రజల దగ్గర డబ్బుల్లేవ్‌. ఈ సమయంలో వారు హౌటళ్లకు వచ్చి ఖర్చు చేయడం ఆశించలేం. అంతేగాక ప్రజా సమూహాల్లో మరికొన్నాళ్లు సామాజిక దూరం పాటించే నిబంధన కూడా అమల్లో ఉండొచ్చు. దీని ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి హౌటల్స్‌లో ఖర్చు చేయడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates