షా అబద్ధాల కోరు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • ఎన్పీఆర్‌, ఎన్‌ఆర్సీ… రెండూ ఒకటే!
  • ఎన్‌ఆర్సీకి తొలి అడుగు ఎన్పీఆరే
  • రాష్ట్రంలో ఎన్పీఆర్‌ను నిలిపేయాలి
  • సీఎం కేసీఆర్‌కు అసదుద్దీన్‌ విజ్ఞప్తి
  • ప్రగతిభవన్‌లో ముస్లిం నేతల భేటీ
  • 27న నిజామాబాద్‌లో భారీ సభ

హైదరాబాద్‌ : జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌరుల పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు మధ్య తేడా లేదని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. రెండింటికీ మధ్య సంబంధం లేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పచ్చి అబద్ధాలు చెబుతూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌ తొలి అడుగని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికలోనే స్పష్టంగా ఉందన్నారు. బుధవారం అఖిల భారత ముస్లిం కార్యాచరణ సమితి ప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఒవైసీ కలిశారు. మూడున్నర గంటలకు పైగా మాట్లాడుకున్నారు. అనంతరం ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ.. కేరళ తరహాలో తెలంగాణలోనూ ఎన్‌పీఆర్‌ పనులను నిలిపివేయాలని సీఎంను కోరామన్నారు. ఆర్టికల్‌ 131 ఆధారంగా కేంద్రం నిర్ణయాలను రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చని చెప్పారు. అఖిల భారత ముస్లిం కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని కేసీఆర్‌ సూచించారని, రాష్ట్ర మంత్రులను కూడా పంపిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. సభకు హాజరవ్వాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని తమ ముందే సీఎం కోరారని తెలిపారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతోపాటు పలు పార్టీలను సభకు ఆహ్వానిస్తామని ప్రకటించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని తానే స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానన్నారు.

29 శాతం మందికే బర్త్‌ సర్టిఫికెట్లు
తెలంగాణలో కేవలం 29 శాతం మందికే పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ఉన్నాయని ఒవైసీ అన్నారు. అక్బర్‌ చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చిందన్నారు. ఎన్‌పీఆర్‌లో పుట్టిన తేదీ ధ్రువపత్రం అడుగుతారని, మిగతా వాళ్లంతా ఆ సర్టిఫికెట్లు ఎక్కడ తెచ్చుకుంటారని ప్రశ్నించారు. ‘‘ఎవరి పౌరసత్వంపైనైనా ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చు. దానికి ప్రమాణాలేంటి? నేను పౌరుడినని నిర్ణయించేదెవరు?’’ అని నిలదీశారు. పౌరుల తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారని, ఆధార్‌ వివరాలను అడుగుతున్నారని తెలిపారు. ఎన్పీఆర్‌ నిర్వహిస్తే ఎన్‌ఆర్‌సీ కూడా జరుగుతుందని, వంద కోట్ల మంది ప్రజలు క్యూలో నిలుచోవాల్సి వస్తుందని అన్నారు. జనగణన చట్టం-1948 ప్రకారమే జనాభా లెక్కలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
సభలోనే ప్రకటించారు..
ఎన్‌ఆర్‌సీకి ఎన్‌పీఆర్‌ తొలి అడుగు అని కేంద్ర హోంశాఖ సమర్పించిన 2018-19 వార్షిక నివేదికలోనే పేర్కొందని అసద్‌ పునరుద్ఘాటించారు. నివేదికలోని చాప్టర్‌ 15లోని నాలుగో సెక్షన్‌లో ఈ విషయం ఉందన్నారు. ఇదే విషయాన్ని 2014 నవంబరు 26న అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) కూడా పత్రికా ప్రకటనలో స్పష్టంగా తెలియజేసిందంటూ పత్రాలను విలేకరులకు చూపించారు. జన గణనకు 1947 చట్టం సరిపోతుందని, పౌరసత్వ చట్టంతో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో ఎన్పీఆర్‌ వచ్చినా.. జనగణనను పౌరసత్వంతో ముడిపెట్టలేదన్నారు.
రెండు రోజుల్లో కేసీఆర్‌ నిర్ణయం ప్రకటన!
ఎన్పీఆర్‌, ఎన్‌ఆర్‌ఐసీకి మధ్య తేడా లేదని నిరూపించే పత్రాలను సీఎం కేసీఆర్‌కు అందించామని అసద్‌ తెలిపారు. నిర్ణయాన్ని వెల్లడించడానికి రెండు రోజుల సమయాన్ని కేసీఆర్‌ కోరారని చెప్పారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో చర్చిస్తామని కేసీఆర్‌ అన్నారని, అవసరమైతే అందర్నీ ఆహ్వానించి, బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెప్పారని వెల్లడించారు. ‘ఇది కేవలం ముస్లింల సమస్య కాదు. యావత్‌ దేశానిది. రాజ్యాంగానికి సంబంధించిన సమస్య. దేశాన్ని ఏ మార్గంలో తీసుకెళ్తున్నారు’ అని తమతో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పదే పదే అన్నారని అసద్‌ చెప్పారు. మతాల పేరుతో ఓ చట్టం(సీఏఏ) రావడం దేశంలో ఇదే తొలిసారని, బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటు వేశారని సీఎం గుర్తు చేశారన్నారు. పీఏసీ చైర్మన్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ తదితరులు కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates