హిందూత్వంపై ఓ హిందువు విమర్శ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for హిందువు విమర్శ"అవిజిత్‌ పాఠక్‌
(రచయిత జేఎన్‌యూలో సోషియాలజీ ప్రొఫెసర్‌)
అనువాదం : కొండూరి వీరయ్య

హిందూత్వ రాజకీయాల దూకుడు, దాని వెన్నంటే దేశంలోని అల్పసంఖ్యాక వర్గాల్లో పెరుగుతున్న భయాందోళనల నేపథ్యంలో నేను విశ్వసిస్తున్న మతం గురించి మరోసారి చదువుకునే అవకాశం నాకు దక్కుతుందా? వైవిధ్యం, బహుళత్వం పట్ల ప్రేమామృతాలతో నిండిన సమాజ నిర్మాణానికి ఉమ్మడిగా దోహదం చేసిన ధార్మికతను మళ్లీ అనుభవించగలనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది నైతికంగా నా ఉనికికి సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. సమకాలీన సామాజిక రాజకీయ ప్రశ్న కూడా. పౌరసత్వ సవరణ చట్టం ఆమోదంతో అల్పసంఖ్యాక వర్గాల ఉనికే ప్రశ్నార్ధకమవు తుందని భయపడుతున్న సమయంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మతోన్మాద కలహాల రూపం తీసుకునే ప్రమాదం పొంచి ఉంది. ఉమ్మడి పోరాటం దిశగా ప్రయత్నించే వారంతా తమ తమ రాజకీయాలు, సాంస్కృతిక నేపథ్యం, ధార్మికతల గురించి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయమిది.

అస్థిత్వాలు-వాటికున్న పరిమితులు
లౌకికతత్వం గురించి భిన్న దృక్పథాలు న్నాయి. ఒకటి వామపక్ష-అంబేద్కర్‌వాదుల దృక్పథం. అదృష్టవశాత్తూ అంతో ఇంతో విద్యావంతులై పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న మనలాంటి వాళ్లం మత చాంధసులు అందించిన అవగాహన నుంచి విముక్తి కాగలిగాం. అయినప్పటికీ జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశంలో మతం అన్నది ఇందుగలదందు లేదని సందేహం వలదన్నట్టు కనిపిస్తుంది. నమ్మకాలు, ఆచార సాంప్రదాయాలు, ఇతరుల పట్ల మనం పెంపొందించుకునే ప్రమాదకర భావనలు వంటి వాటన్నింటిలోనూ మతం ఛాయలు కనిపిస్తుం టాయి. అందువల్ల మతాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పినంత మాత్రాన సరిపోదు. రవీంద్రనాథ్‌ ఠాగుర్‌ చెప్పినట్టు మతాన్ని మనం దక్కించుకోవాలంటే మతాన్ని ఉన్మాదుల కబంధ హస్తాల నుంచి కాపాడాలి. ధార్మిక స్ఫూర్తిని పునఃప్రతిష్టించాలి. ఈ కోణంలోనే ఓ హిందూ కుటుంబంలో పుట్టిన వాడిగా నేను హిందూత్వ సిద్ధాంతాన్ని విమర్శిస్తున్నాను. హిందూత్వనే కాదు. ఏకశిలా సదృశ్యంగా మతాన్ని మార్చేసే ఏ ప్రయత్నాన్నైనా విమర్శిస్తాను. అంతమాత్రాన నా విమర్శ హృదయం లేని లౌకికత్వపు విమర్శ కాదు. నేను నాకున్న ధార్మికత రీత్యానే మతపరమైన అస్థిత్వానికి ఉన్న పరిమితులను స్పష్టం చేయదల్చుకున్నాను.

నేడు మనం చూస్తున్న హిందూత్వ సిద్ధాంతం నా మతం గురించి నేను నేర్చుకున్న అద్భుత సూత్రాలకు, విలువలకు వ్యతిరేకం. మూర్తీభవించిన పురుషాధిక్యత నిండిన జాతీయవాదంగా మారిన హిందూత్వ నిస్సందేహంగా కేంద్రీకృత స్వభావం కలిగినది. మతాన్ని ఏకశిలా సదృశంగా మార్చే ధోరణి. మానవ చైతన్యం నిరంతరం విస్తరిస్తుందన్నది నేను నేర్చుకున్న పాఠం. అలా విస్తరించిన చైతన్యం కారణంగానే రామకృష్ణ పరమహంస వంటి భిన్న విశ్వాసాలు కలిగిన వారినందరినీ నా మతం తనలో ఇముడ్చుకుంది. మిలిటెంట్‌ హిందూత్వ ముస్లింలను ఇతరులుగా చూపటంలో వెరపు లేకుండా పని చేస్తోంది. ఈ సమయంలో మహాత్మాగాంధీ చూపించిన సున్నితత్వం, ప్రేమ, వాత్సల్యంతో కూడిన హిందూమతం గురించి తెలుసుకున్న విషయాలు నా మనసులో సాక్షాత్కరిస్తున్నాయి. అదేవిధంగా హిందూత్వ దుందుడుకువాదానికి ప్రతీకైతే మీరాబాయి గీతాలు మతం, ప్రేమ వేర్వేరు కాదని గుర్తు చేస్తున్నాయి. ప్రశస్త నవల గోరాలో ఠాగూర్‌ సృష్టించిన పాత్ర ఆనందమయి మాతృత్వం గొప్పతనాన్ని సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే తత్వాన్నీ సాక్షాత్కరిస్తుంది. అందుకే శ్రీ అరబిందో ఆశించిన అలౌకిక చైతన్యం దిశగా ప్రయాణించనీయకుండా అడ్డుకునే మూక హత్యల్లో వ్యక్తమవయ్యే వదరుబోతు పురుషాధిక్యతలో ఉన్న డొల్లతనాన్ని చూస్తున్నాను.

బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్య్కుని తో వాదించిన మైత్రేయి ఆధ్యాత్మికత లోతులను తెలుసుకోవటానికి, శాశ్వతత్వం కోసం సాగించే ప్రయత్నానికి తెలుసుకోవటానికి చేయూతనిస్తే హిందూత్వ సిద్ధాంతం మతాన్ని కేవలం అస్థిత్వ రాజకీయాలకు కుదించేసిన వైనాన్ని చూస్తున్నాను. హిందూజాతి అహంకారాన్ని వ్యక్తం చేసే ఆయుధంగా మారటాన్ని గమనిస్తున్నాను. భగవద్గీత ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థమవ ుతుంది. 1946లో నవాఖలిలో మతోన్మాద మంటల్లో మసవుతున్న మానవత్వాన్ని కాపాడటానికి గాంధీ సాగించిన ఆధ్యాత్మిక రాజకీయ తీర్థయాత్రలో నిష్కామకర్మ చూశాను. అటువంటి నిష్కామకర్మ మాఖియావెల్లి తరహా కుతంత్రాలతో అయోధ్యలో బాబ్రీమసీదును కూల్చివేసిన చోటే మందిరం నిర్మించేందుకు సాగే ప్రయత్నాల్లో కనిపించటం లేదు. నిష్కామకర్మ అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే పని. విశాల హిందూమతంలో వాద ప్రతివాద సంస్కృతి ఎల్లెడలా వెల్లడవుతుంది. వేదాంత స్రవంతితో లోకాయత స్రవంతికి చెందిన తాత్వికులు సాగించిన తార్కిక ఘర్షణలో వెల్లడించిన విధంగా యముడితో నచికేతుడు చర్చకు దిగుతాడు. మరోరకంగా చెప్పాలంటే చైతన్యం, తర్కాన్ని అంగీకరిస్తూ కూడా హిందువుగా కొనసాగవచ్చు. అదేవిధంగా హిందువుగా ఉంటూ కూడా హిందూయేతరునిగా ఉండటం కూడా సాధ్యమే. అందుకే ప్రేమ, ఐక్యమత్యాలతో కూడిన సాధారణ ప్రజలు ఆచరించే హిందూమత మూలాలకు హిందూత్వ మూలాలు పూర్తి వ్యతిరేకమైనవి.

మనం కష్టకాలంలో ఉన్నాం. పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర జాబితాలు మైనారిటీ ప్రజలను మరింత కళంకితులుగా మార్చ నున్నాయి. రెండు మతాల మధ్య ఉద్రిక్తతలతో కూడిన సుదీర్ఘ చరిత్ర ఉన్న సమాజంలో ఆలోచనలు, పరిస్థితులను వెలివాడలుగా మార్చటం మానవాళి మధ్య అడ్డుగోడలు కట్టడమే అవుతుంది. అందువల్ల పౌరసత్వ చట్ట వ్యతిరేక ఉద్యమం మతోన్మాద రంగు పులుముకునే ప్రమాదం లేకపోలేదు. జాతీయోన్మాదంతో కళ్లు మూసుకు పోయిన మీడియా దేశభక్తులైన హిందువులు సమస్యాత్మకంగా పరిగణించ బడుతున్న ముస్లింల ఐక్య ప్రతిఘటనగా తాజా పరిణామా లను చూపటానికి సిద్ధపడవు. ఢిల్లీలోని సీలంపూర్‌ మొదలు ఉత్తరప్రదేశ్‌లోని ఆలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం వరకు ముస్లిం నివాస ప్రాంతాలు యుధ్ద క్షేతాలుగా చూపించబడు తున్నాయి. ఓ వైపు లొంగదీసుకుంటూనే మరో వైపు రెచ్చగొట్టుడు ధోరణుల నడుమ అల్ప సంఖ్యాకవర్గాలు అంతకంతకూ ఒంటరికానున్నాయి.

సమిష్టి సంస్కృతి
ఆధిపత్య హిందూత్వ సిద్ధాంతం కేవలం ముస్లింలను మాత్రమే తన లక్ష్యంగా ఎంచుకోవటం లేదు. భిన్నంగా ఆలోచించే భిన్నంగా జీవించే హిందువులు కూడా ఈ హిందూత్వకు లక్ష్యాలుగా మారనున్నారు. అటువంటి వారిలో కొందరికి వామపక్షవాదులని ముద్ర వేస్తే మరికొందరిని కుహనా లౌకికవాదులనీ, ఇంకొందరు అర్బన్‌ నక్సల్స్‌ అనీ, మిగిలినవారు మూర్ఖులైన గాంధేయవాదులనో లేదా దుర్బలులైన భావుకులనో ముద్ర వేస్తారు. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో రెండు మతాల మధ్య సమిష్టి సంస్కృతిని అభివృద్ధి చేయటానికి కృషి చేయటం ద్వారా రెండు మతాలకు చెందిన వాళ్లూ భవ్య భవిష్యత్తు కోసం పోరాటం అవసరం. అయితే మతోన్మాదం గురించిన చర్చ లేదా ప్రత్యేకంగా మతపరమైన అస్థిత్వం ఆధారంగా సాగే రాజీకీయాల గురించిన చర్చ మౌలికంగా సమిష్టితత్వానికి వ్యతిరేకమైనది. (ఆధిపత్య మతోన్మాదం విధ్వంసకారే అయినప్పటికీ అణగారిన ప్రజల మతోన్మాదం దీనికి సమాధానం కాదు.) అదేవిధంగా ధార్మికత, ఆధ్యాత్మికతలను పెంపొందించటంలో విఫలమవుతున్న హృదయం లేని లౌకికతత్వం కూడా నూతన నైతిక రాజకీయాల దిశగా ప్రజలను సమీకరించటంలో ముందడుగు వేయలేదు.
సమస్యాత్మకమైన, దిశానిర్దేశం దొరకని సమయంలో గాంధీ మార్గాన్ని అనుసరించటం రెండు మతాల మధ్య ఇటువంటి సమిష్టి సంస్కృతిని పెంపొందించటానికి దోహదం చేయవచ్చు. గాంధీ హిందువే. కానీ చర్చలను స్వాగతించేవాడు. ప్రయోగాలకు వెరవని వాడు. ఓపిక కలిగిన వాడు. నాధూరాం గాడ్సే వంటివారికి గాంధీ హిందువేతరునిగా కనిపించి ఉండవచ్చు. అదేవిధంగా నిజమైన మత విశ్వాసాలు కలిగిన ముస్లింలు కూడా తమ మతాన్ని మతోన్మాదుల పరం చేయటాన్ని నిరసిస్తూ ఉంటారు. ప్రతిఘటిస్తూ ఉంటారు. మతాన్ని మతోన్మాదుల చెర నుంచి విడిపించాలనుకునే వాళ్లెవరైనా మానవ చైతన్యాన్ని తాలిబాన్‌ చైతన్యంగా మార్చే ప్రయత్నాలను ప్రతిఘటించాలి. ఎందుకంటే నిజమైన మత విశ్వాసాలు కలిగిన వాళ్లు సగుణత్వాన్ని నిర్గుణత్వంగా మార్చుకోవటానికి కృషి చేస్తారు. కబీర్‌, రూమి, గాంధీ, మౌలానా అజాద్‌, ఠాగూర్‌, నిజాముద్దీన్‌ ఔలియాలు మనతో ఉంటే, మన మార్గదర్శకులు అయితే ప్రేమ, పరస్పరం అర్థం చేసుకోవటం వంటి లక్షణాల ద్వారా ప్రపంచంలోని రుగ్మతలను తొలగించటం ఎలాగో నేర్పి ఉండేవారు. నిరంతరం మారుతున్న ప్రపంచంలో ఇది అసాధ్యమనిపించినప్పటికీ ప్రయత్నం చేయాలి. ఇదే నిజమైన ప్రయత్నం. హిందూత్వ లేదా మరో మతోన్మాద చెరసాలను చేధించటానికి ప్రయత్నం చేసేవాడే నిజమైన హిందువుగా మిగులుతాడు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates