ముగ్గురు సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తాం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ప్రభుత్వ అభిప్రాయం తీసుకుని చెప్పండి
  • అడ్వొకేట్‌ జనరల్‌కు సూచించిన హైకోర్టు ధర్మాసనం
  • కమిటీ సూచనలకైనా 0.001% స్పందన వస్తుందేమో
  • చర్చల ప్రక్రియ మొదలవుతుందేమో
  • ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కారు
  • చట్ట ప్రకారం ఆర్టీసీతోనే చర్చలు జరపాలి
  • మా అధికార పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేం: ధర్మాసనం
  • విచారణ నేటికి వాయిదా.. 2 గంటలపాటు సీఎం సమీక్ష

ఈ ధర్మాసనం అనేక విధాలుగా చెప్పింది. ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి చర్చలు జరపాలని సూచించాం. ఎవరూ తగ్గలేదు. కనీసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర కమిటీ చెబితే వింటారేమో! దాని సూచనలపైనైనా 0.001 శాతం సానుకూల స్పందన వచ్చి.. చర్చల ప్రక్రియ మొదలవుతుందేమో

హైకోర్టు….ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమ్మెపై ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మిక సంఘాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చివరి ప్రయత్నంగా ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని అడ్వొకేట్‌ జనరల్‌కు స్పష్టం చేసింది. ‘‘ఈ ధర్మాసనం అనేక విధాలుగా చెప్పింది. ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి చర్చలు జరపాలని సూచించాం. ఎవరూ తగ్గలేదు. కనీసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర కమిటీ చెబితే వింటారేమో! దాని సూచనలపైనైనా 0.001 శాతం సానుకూల స్పందన వచ్చి.. చర్చల ప్రక్రియ మొదలవుతుందేమో’’ అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. అటువంటి స్వతంత్ర కమిటీ వేస్తే.. సమ్మె విరమించే అంశాన్ని పునరాలోచన చేయాలని కార్మిక సంఘాలకు సలహా ఇస్తానని కార్మిక సంఘాల తరఫు సీనియర్‌ న్యాయవాది తెలిపారు. దీనిని తాము రికార్డు చేస్తామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమా? కాదా? అని చెప్పే అధికారం ఈ కోర్టుకు ఉందో లేదో చెప్పాలని కోర్టు సహాయకుని (అమికస్‌ క్యూరీ)గా నియమించిన సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ను కోరింది. కోర్టుకు అధికారాలు ఉంటాయని ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉటంకించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. హైకోర్టుకు అలాంటి అధికారాలు ఉన్నట్లు లేదని, పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్‌కే ఉంటాయని స్పష్టం చేసింది. అయితే, ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని, ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తెస్తూ 1998లో, 2015లో ప్రభుత్వం జీవో తెచ్చిందని తెలిపారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. 1998లో ఇచ్చిన జీవో ఏపీఎ్‌సఆర్టీసీకి మాత్రమే వర్తిస్తుందని, టీఎస్‌ ఆర్టీసీకి వర్తించదని స్పష్టం చేసింది.

కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్‌ ఆర్టీసీకి ఏపీ జీవోను వర్తింప చేయలేమని, ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి రాదని మరోసారి తేల్చి చెప్పింది. 2015లోప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించిన ధర్మాసనం.. ఇది ఆరు నెలలపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ ఇచ్చిందని గుర్తు చేసింది. దాంతో, చర్చలు విఫలమైనట్లు కన్సీలియేషన్‌ అధికారి అక్టోబరు 5న నివేదిక ఇచ్చారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. తిరిగి కల్పించుకున్న ధర్మాసనం.. ఆ నివేదికను పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 12 కింద ట్రైబ్యునల్‌కు పంపాలా? వద్దా? అని ప్రభుత్వం నిర్ణయించుకోవడానికి ఇది చాలని వ్యాఖ్యానించింది. కాగా, ఆర్టీసీ బస్సులో కనీస చార్జి రూ.5 ఉండేదని, ఇప్పుడు రూ.20-25 వరకు వసూలు చేస్తున్నారని, టికెట్లు కూడా ఇవ్వడం లేదని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రూ.10 వేలలోపు నెల జీతం సంపాదించే చిరుద్యోగులు, సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

సమ్మె మొదలై 40 రోజులు కావస్తున్నా.. ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, ఇంకెంత కాలం సమ్మె చేస్తారని ప్రశ్నించారు. ఇటువంటి వాదనలపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వజాలదు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఇవ్వకుండా అధిక ధరలు వసూలు చేస్తే.. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు’’ అని సూచించింది. కార్మిక సంఘాలు, ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సంయుక్తంగా చర్చలు జరపాలని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది అనగా.. అలా చేయాలని చట్టంలో ఎక్కడ ఉందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం.. ఆర్టీసీతోనే చర్చలు జరపాల్సి ఉంటుంది. మా అధికార పరిధి దాటి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు భావిస్తున్నట్లుంది. అటువంటి ఆదేశాలు ఇవ్వలేం. ఈ న్యాయస్థానం చట్ట పరిధిలోనే ఆదేశాలు ఇస్తుంది అని తెలిపింది. మరోవైపు, 40 రోజులుగా బస్సులు తిరగడం లేదని, పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ తెలిపారు.

దాంతో.. ఎవరూ చట్టాల గురించి చెప్పడం లేదు. మా పరిధిలో లేనిది కావాలని కోరుతున్నారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేం అని స్పష్టం చేసింది. ఈ దశలో ఏజీ కల్పించుకుని.. చర్చల్లో పాల్గొనకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని, సమ్మె వివాదం పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వెళ్లిందని కోర్టుకు ఏజీ తెలిపారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో స్వతంత్ర కమిటీని వేస్తామని, ఇందుకు ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన వ్యాజ్యంపై బుధవారం విచారణ చేపడతామని, అంతవరకు స్టే ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

చర్చల్లేవ్‌.. హైకోర్టు సూచనపై సీఎం సమీక్ష….ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సీఎం కేసీఆర్‌ మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి? అంగీకరించకపోతే.. కోర్టు ఎలా ముందుకు వెళ్లనుందన్న వివరాలను సీఎం ఆరా తీశారు. మంత్రి అజయ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ ఇందులో పాల్గొన్నారు. సమ్మె విషయంలో ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జిలతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు ధర్మాసనం ప్రకటించిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి వచ్చి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు ఇది జరిగింది.

కోర్టు వ్యాఖ్యలను బీఎస్‌ ప్రసాద్‌ సీఎంకు వివరించారు. ఇంతదాకా వచ్చిన తర్వాత మళ్లీ చర్చలకు వెళ్లడం అవసరం లేదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఎస్‌ జోషి తెలిపారు. కార్మిక శాఖతో జరిగిన రాజీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కార్మిక నేతలు బయటకు వచ్చేశారని, అలాంటప్పుడు మళ్లీ వాళ్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. మరోవైపు, జేఏసీ మాత్రం చర్చలకు ఇప్పటికైనా సిద్ధమేనని ప్రకటించింది.

Courtesy Andhrajyothi..

RELATED ARTICLES

Latest Updates