అరణ్య రోదన..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 గొత్తి కోయలను తరలించే యోచన
ఛత్తీస్‌గఢ్‌ సీఎం లేఖతో కదలిక
అటవీ గ్రామాల వివరాలు కోరిన కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ
తాజాగా సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం
కొండూరి రమేష్‌బాబు

చత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చి రాష్ట్రంలోని అడవుల్లో జీవనం సాగిస్తున్న గొత్తి కోయలకు మరో గండం పొంచి ఉన్నది. వారిని తమ స్వరాష్ట్రానికి తరలించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న యుద్ధంలో సమిధలుగా మారిన కొన్ని గ్రామాల వారు అక్కడ బతక లేక తెలంగాణ, ఏపీ అడవుల్లోకి వలస వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద సంఖ్యలో వారు వచ్చి అడవుల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వలస వెళ్లిన ఆదివాసీలను తిరిగి తమ రాష్ట్రానికి పంపాలని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటీవల లేఖ రాశారు. తాను తలుచుకున్నది కూడా అదే కావటంతో తెలంగాణ సీఎం కూడా గొత్తికోయలను వెనక్కి పంపటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నివసిస్తున్న గొత్తికోయల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనితో వలస ఆదివాసీల వివరాలను సేకరించటానికి ప్రత్యేక సర్వే చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓలకు ఇటీవల లేఖ రాశారు. తెలంగాణలో అడవుల్లోని 120 ఆవాసాల్లో దాదాపు 30 వేల మంది గొత్తికోయలు ఉన్నట్టు గిరిజన సంక్షేమ శాఖకు సమాచారం అందింది. పాత లెక్కల ప్రకారం 16 వేల మందే ఉన్నారని కొందరు అధికారులంటున్నారు. అందుకే లెక్క తేల్చటానికి సర్వే చేయించాలని నిర్ణయించారు.

క్యాంపులు ఏర్పాటు చేసే యోచన…
వలస వచ్చిన గొత్తికోయలను తిరిగి వారి గ్రామాలకు పంపకుండా బీజాపూర్‌, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక క్యాంపులకు పంపాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి తీరంలోని అటవీ ప్రాంతంలో ఉంటున్న గొత్తి కోయలు మాత్రం అందుకు సంసిద్ధత వ్యక్తం చేయటం లేదు. తాము చత్తీస్‌గఢ్‌కు వెళ్లేది లేదని వారు తేల్చి చెప్పారు. గతంలో అటవీ అధికారులు ఇండ్లను తగులబెట్టి జైలు పాలు చేసిన ఆవాసాల వారు కూడా మళ్లీ అదే ప్రదేశంలో ఇండ్లు నిర్మించుకోవటం విశేషం.

సీఎం ప్రకటన తర్వాత….
గొత్తి కోయలు అడవుల్లో ఉండనీయమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత అటవీ అధికారుల దాడులు పెరిగిపోయాయి. అడవిలో జీవిస్తున్న వారిని పోడు వ్యవసాయం చేయనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అటవీ హక్కుల చట్టం పరిధిలోకి వచ్చే గ్రామాల ఆదివాసీల క్లైయిమ్‌లను కూడా తీసుకోవటం లేదు. మరోవైపు హరితహారం పేరుతో మొక్కలు నాటాలని ప్రయత్నిస్తున్నారు.

హద్దులు తెలియని అడవి….
సంచార జీవితం, సామూహిక వేటతో పాటు ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలతో జీవించే ఆదివాసీలకు ఏ ప్రాంత అడవి అయినే ఒక్కటే. వలసలు వచ్చే గొత్తి కోయలు కూడా రాష్ట్రాల సరిహద్దుల పరిధితో సంబంధం లేకుండా దండకారణ్యమంతా తమదే అనుకుంటారు. వీరికి అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం రక్షణ కల్పిస్తున్నది. ఈ చట్టాల ప్రకారం వారి ఆవాసాలను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు అమలు చేసే చిత్తశుద్ధి లేదు.

ముస్లంపెంట తిరుగుబాట..
అది ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ముస్లంపెంట. ఆదివాసీ జాతర జరిగే మేడారం గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో అదివాసీలు ఏర్పాటు చేసుకున్న ఆవాసం. 16 ఏండ్ల క్రితం చత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన 26 గొత్తికోయల కుటుంబాలకు చెందిన 170 మంది అక్కడ ఇండ్లు కట్టుకుని జీవిస్తున్నారు. చిన్న పొదలు కొట్టుకుని పోడు వ్యవసాయం చేసుకునే వారు. అటవీ శాఖ అధికారులు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామ ఆదివాసీల గుండెల్లో ఏదో చెప్పలేని గుబులు. ఏ అధికారి వచ్చి ఏమంటాడోననే భయం. ఇటీవల ‘నవతెలంగాణ’ ప్రతినిధులుó అక్కడికి వెళ్లినప్పుడు ఇదే పరిస్థితి కనిపించింది. తాము అధికారులం కాదని చెప్పిన తర్వాత అడమయ్య అనే ఆదివాసీ తమ గ్రామ పెద్ద మడకం మాసయ్య వద్దకు తీసుకువెళ్లాడు. పూజారి తెల్లం గంగరాజు కూడా వచ్చాడు. పోడు కొట్టనీయక పోవటంతో గ్రామంలోని ఆదివాసీలు కూలి పనులకు వెళ్తున్నారు. గ్రామంలో 16 మంది పిల్లలను సమీపంలోని బయ్యక్కపేట ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, కొందరికి ఓటర్‌ కార్డులు ఇచ్చారు. వారు ఉండే ప్రదేశం వన్యప్రాణుల అభయారణ్యం కావటంతో అక్కడ ఉండనిచ్చేది లేదని అటవీ అధికారులు ఇతర శాఖలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తమను వెళ్లమంటే ఎక్కడికి వెళాల్లని వారు ప్రశ్నిస్తున్నారు.

ఉరితాళ్లు బిగించినా వెళ్లం…
”మా మెడకు ఉరితాళ్లు బిగించినా అడవి నుంచి వెళ్లేది లేదు. అటవీ అధికారులు మమ్మల్ని పోడు వ్యవసాయం చేసుకోని వ్వటం లేదు. హరిత హారం పేరుతో మొక్కలను పెట్టారు. అవి మేము పీకివేశాం. జంతువులను వేటాడతామని మా వద్ద ఉన్న బాణాలను వారు బలవంతంగా తీసుకు వెళ్లారు. మాకు రక్షణ కల్పించేది బాణాలే. అవి లేక పోతే మేము బతకలేం. . గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం పెడతామన్నారు. పాక వేయించాం. ఎవరూ రావటం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని పామేడ్‌ ప్రాంతం నుంచి మేము వచ్చాము. మళ్లీ అక్కడికి వెళ్లమన్నా వెళ్లలేము. చావయినా బతుకయినా ఇక్కడే…”
మడకం మాసయ్య, ముస్లంపెంట గ్రామ పెద్ద

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates