ఆడ శిశువులే వాళ్ల టార్గెట్‌!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • అపహరించి విక్రయాలు.. తండాలు, శివార్లే లక్ష్యం.. 
  • 8 మంది అరెస్టు

అల్వాల్‌/హైదదరాబాద్‌: అప్పుడే పుట్టిన ఆడ శిశువు మొదలు.. రోజుల వయసున్న పసికందు దాకా.. చిన్నారులే ఆ ముఠా టార్గెట్‌. తండాలు, హైదరాబాద్‌ శివారు ప్రాంతాలే లక్ష్యం. ఆడపిల్లల్ని భారంగా భావించే తల్లిదండ్రులకు ఈ ముఠా సభ్యులు ఎరవేస్తారు. సంతానం లేని తల్లిదండ్రులకు అమ్మేస్తారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అల్వాల్‌ పోలీసుల చాకచక్యం, ఎస్వోటీ పోలీసుల ఆపరేషన్‌తో ఈ ముఠాకు చెక్‌ పడింది. గురువారం అల్వాల్‌ ఠాణాలో విలేకరుల సమావేశంలో బాలానగర్‌ జోన్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. నగర శివార్లలోని దమ్మాయిగూడ బ్యాంకుకాలనీకి చెందిన వేము ల బాబురెడ్డి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం ప్రాంతానికి చెందిన గంగాధర్‌రెడ్డి వేర్వేరుగా రమా ఫెర్టిలిటీ సెంటర్‌, పద్మజా ఫెర్టిలిటీ సెంటర్‌, కామినేని సంతాన సాఫల్య కేంద్రం, నోవా, రెయిన్‌బో తదితర ఆస్పత్రులకు దళారులుగా పనిచేస్తున్నారు. వీరు అండాల దాతలను (ఎగ్‌ డోనర్స్‌), అద్దె గర్భాల తల్లులను (సరోగసీ మదర్స్‌) ఈ ఆస్పత్రులకు సరఫరా చేస్తుంటారు. వీరిద్దరూ కలిసి.. రమేశ్‌, రాజునాయక్‌, సీతారాం, మారుతి శమంతకమణి, కాంతి రేణుక, జాలిగం సునీత, వనమాల లక్ష్మితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశారు. ఈ ముఠా శివారు ప్రాంతాలు, తండాల్లో తిరుగుతూ.. ఆడశిశువులు ఉన్న ఇళ్లను గుర్తిస్తుంది. తండాల్లో ఆడపిల్ల బరువు అనుకునేవారిని సంప్రదించి.. రూ. 20వేలు – రూ. 30 వేలు ఇచ్చి, శిశువులను కొనుగోలు చేస్తుంది. పిల్లలు లేనివారికి ఆ శిశువులను రూ. 4 లక్షల నుంచి రూ. 7లక్షలకు విక్రయిస్తుంటారు. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే.. శిశువులను అపహరించి తీసుకొస్తారు. గత నెల 27న శమంతకమణి, రేణుక కలిసి అల్వాల్‌ ప్రాంతంలో ఓ ఆడ శిశువును విక్రయిస్తుండగా.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ముఠా గుట్టు రట్టయింది. దీంతో.. ఉన్నతాధికారులు ముఠా సభ్యులను అరెస్టు చేసేందుకు అల్వాల్‌ ఇన్‌స్పెక్టర్‌ పులి యాదగిరి, ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ ముఠా సభ్యులు దమ్మాయిగూడలో ఓ ఆడశిశువును విక్రయుస్తున్నట్లు గుర్తించి, వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడు సీతారాం మినహా.. మిగతా అందరూ అరెస్టయ్యారని డీసీపీ వెల్లడించారు. ఈ ముఠా బారినుంచి ఇద్దరు శిశువులను కాపాడి, సఖీ కేంద్రానికి అప్పగించామన్నారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates