అవే హామీలు.. అవే ప్రాజెక్టులు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • 2016 మేనిఫెస్టోలో నెరవేర్చని హామీలకు 
  • 2020 ఎన్నికల ప్రణాళికలోనూ మళ్లీ చోటు
  • ఎస్‌ఆర్‌డీపీ, రెండు పడకల ఇళ్ల వివరాలు యథాతథం
  • ఎంఎంటీఎస్‌, మెట్రోరైల్‌ కూడా.. వాటిలో జరిగినవి కొన్నే

హైదరాబాద్‌ సిటీ : ఎంఎంటీఎస్‌ రెండో ఫేజును యాదాద్రి, శంషాబాద్‌కు విస్తరించడం.. మెట్రోరైలు రెండో దశ విస్తరణ.. ఎస్‌ఆర్‌డీపీ కింద రోడ్ల అభివృద్ధి.. ఇవీ ఐదేళ్ల కిందట 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంలో టీఆర్‌ఎస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. వీటిల్లో పెద్దగా పురోగతి లేదు. దీంతో.. తాజా మేనిఫెస్టోలో మళ్లీ వీటిని గురించి కొత్తగా చెప్పారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఉపాధి కల్పన, ఈ-లైబ్రరీల ఏర్పాటు వంటిట మరికొన్ని పాత వాగ్దానాలను 2020-జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా పొందుపరిచారు.

ఇవి అప్పటివే?
ఎంఎంటీఎస్‌ రెండోదశను శంషాబాద్‌, యాదాద్రిలకు విస్తరిస్తామని వాగ్దానం చేశారు. యాదాద్రికి లైన్లు పూర్తవ్వగా.. రాష్ట్రం విడుదల చేయాల్సిన నిధుల విషయంలో జాప్యం నెలకొంది. అయితే.. ఇప్పుడు తాజా మేనిఫెస్టోలో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ విస్తరణతోపాటు.. శంషాబాద్‌కు మెట్రో రైలు ప్రతిపాదనలు చేశారు.

గత ఎన్నికల సమయంలో రెండో దశలో మెట్రో రైల్‌ పనులను 200 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఇంకా ఆ ప్రతిపాదన డీపీఆర్‌ దశను కూడా దాటలేదు. తాజాగా రాయదుర్గం-శంషాబాద్‌, బీహెచ్‌ఈఎల్‌-మెహిదీపట్నం మధ్య మెట్రోకారిడార్‌ను ప్రస్తావించారు.

రూ. 22వేల కోట్ల అంచనా వ్యయంతో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వంతెనలు, అండర్‌పా్‌సలు, గ్రేడ్‌ సెపరేటర్ల నిర్మాణానికి వాగ్దానం చేశారు. ఈ ఐదేళ్లలో తొలిదశ పనులే పూర్తయ్యాయి. తర్వాతి దశల పనులకు తాజా మేనిఫెస్టోలో చోటిచ్చారు.

సైక్లింగ్‌ స్టేషన్ల ఏర్పాటు హామీ అమలవ్వలేదు. ఈ సారి కూడా ఈ హామీని చేర్చారు.

92 పట్టణ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి.. 225 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ సారి వీటి ఊసేలేదు.

2లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల హామీ అలాగే కొనసాగుతోంది.

రూ. 5కే భోజనం కేంద్రాలను 200కు పెంచుతామని గత మేనిఫెస్టోలో ప్రకటించారు. వాటిల్లో 150 మాత్రమే పూర్తయ్యాయి.

టాస్క్‌ వంటి శిక్షణ కేంద్రాలతో 4 లక్షల మంది యువతకు వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇవ్వాలని గత మేనిఫెస్టోలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో పెద్దగా పురోగతి లేదు.

ఉత్పాదక రంగంలో 2.5 లక్షలు, పరిశ్రమలను పెంచడం ద్వారా మరో 10 లక్షల ఉద్యోగాల సృష్టిపై వాగ్దానం చేశారు. అన్ని రంగాలు కలిపి 19.05 లక్షల ఉద్యోగాల భర్తీ అయినట్లు తాజా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

లైబ్రరీ సెస్‌ను గ్రంథాలయాల అభివృద్ధికే వినియోగించే హామీ నెరవేరలేదు. ఈ-లైబ్రరీలు ప్రారంభం కాలేదు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates