నిరసన హక్కులపై నిరంకుశ దాడి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తేల్తుంబే, నవ్లఖల అరెస్ట్‌ అక్రమం
కోరెగావ్‌ కేసులో అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలి
వివిధ రంగాల ప్రముఖుల డిమాండ్‌

హైదరాబాద్‌: పౌరహక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రొఫెసర్‌ ఆనంద్‌ తేల్తుంబే, జర్నలిస్ట్‌ గౌతమ్‌ నవ్లఖలను అరెస్ట్‌ చేయడాన్ని ఫోరమ్‌ ఫర్‌ సోషల్‌ ఛేంజ్‌(ఎఫ్‌ఎస్‌సీ) ఖండించింది. వీరిని అరెస్ట్‌ చేయడంతో కేంద్ర ప్రభుత్వ లక్క్ష్యం నెరవేరినట్టు అయిందని పేర్కొంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ వీరిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఆ ఇ​ద్దరినీ ఉపా చట్టం కింద అరెస్ట్‌ చేయడం దారుణమని పేర్కొంది. గతంలో ఇదే కేసులో 9 మంది మేధావులు, క్రియాశీలక కార్యకర్తలను అరెస్ట్‌ చేసి ఏడాదిన్నరగా జైలులో ఉంచారని తెలిపింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఎఫ్‌ఎస్‌సీ డిమాండ్‌ చేసింది. భావప్రకటన స్వేచ్ఛ, నిరసన హక్కులపై బీజేపీ నిరంకుశ దాడికి పాల్పడుతోందని విమర్శించింది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌సీ కన్వీనర్‌ అల్లం నారాయణ, రమణి, భూమన్‌, సాంబమూర్తి, ఆర్‌.వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌, ఆశాలత, జిట్టా బాల్‌రెడ్డి, తో పాటు మరో 30 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒక ప్రకటన విడుదల చేశారు. నిరంకుశ చట్టాలను రద్దు చేసి, బీమా కోరెగావ్‌ కేసులో జైలులో ఉన్న 11 మందిని విడుదల చేయాలని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌ చలం, చందు సుబ్బారావు, అబ్దుల్‌ నూర్‌ భాషా, ఆర్వీ రామారావు, ఎ. సుబ్రమణ్యం తదితరులు డిమాండ్‌ చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా కోరేగావ్‌ కేసులో సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్తుంబ్డే, ప్రకాశ్‌ అంబేద్కర్‌, పౌరహక్కుల కార్యకర్త గౌతమ్‌ నవలఖ ఏప్రిల్‌ 14న జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ తెల్తుంబ్డే, నవలఖతో పాటు పలువురు పౌర కార్యకర్తల ఉపా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్చి 17న సుప్రీంకోర్టు కూడా వారి అభ్యర్థనలను తిరస్కరించి మూడు వారాలలోగా లొంగిపోవాలని ఆదేశించింది. వారు లొంగిపోవడానికి ఏప్రిల్‌ 9న సుప్రీంకోర్టు మరో వారం గడువు పొడిగించింది. ఈ గడువు ముగియడంతో వారిద్దరూ ఎన్‌ఐఏ కోర్టులో లొంగిపోయారు.

RELATED ARTICLES

Latest Updates