మంచినీళ్లు ఫ్రీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • జీహెచ్‌ఎంసీలో నెలకు 20 వేల లీటర్ల వరకూ ఉచితం
  • గ్రేటర్‌ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరం
  • జలమండలిపై 300-400 కోట్ల భారం.. మేమే భరిస్తాం
  • రాష్ట్రమంతా 24 గంటల మంచినీరు అందించడం నా కల
  • ప్రైవేటు పాఠశాలలకు కూడా నీటి సరఫరా ఉచితమే
  • రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు
  • లాక్‌డౌన్‌ కాలంలో రవాణా వాహనాలకు పన్నులు రద్దు
  • వ్యాపార సంస్థలకు 6 నెలల విద్యుత్తు కనీస చార్జీ కూడా
  • ఆ కాలంలో సినిమా థియేటర్లకు కరెంటు బిల్లులూ మాఫీ
  • థియేటర్లలో ఇక మరిన్ని షోలు వేసుకోవడానికి అనుమతి
  • సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడంపైనా వెసులుబాటు
  • బడ్జెట్‌ సినిమాల నిర్మాతలకు రాష్ట్ర జీఎస్టీ వెనక్కి ఇస్తాం
  • అర్హులకు ఎన్నికల తర్వాత వరద సాయం పంపిణీ
  • కర్ఫ్యూల నగరం కావాలా? ప్రశాంత నగరం కావాలా?
  • హైదరాబాద్‌ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే
  • తమాషాగా ఓటేస్తే అది మనల్నే కాటేస్తుంది
  • హైదరాబాద్‌ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు సహకారం కావాలి
  • కరోనా రెండో దశ వస్తోంది జాగ్రత్త.. తీవ్రమైతే లాక్‌డౌనే
  • త్వరలో దేశానికి కొత్త దశ, దిశ చూపిస్తా
  • టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేసీఆర్‌

లౌకిక నగరాన్ని మనమంతా కాపాడుకోవాలి. అలవోకగా, ఆషామాషీగా ఓటేస్తే.. మన వేలుతో మన కన్నే పొడుచుకున్నట్లు అవుతుంది. హైదరాబాద్‌లో మత కల్లోలాలు చెలరేగితే.. పిచ్చి పిచ్చి ఘటనలు జరిగితే రియల్‌ ఎస్టేట్‌ 100 శాతం కుదేలవుతుంది. భూముల ధరలు పూర్తిగా పడిపోతాయి. హైదరాబాద్‌ మార్కెట్టే కుప్పకూలిపోతుంది.
– ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ వరాలు ప్రకటించారు. నెలకు 20 వేల లీటర్ల కంటే తక్కువ తాగునీరు వినియోగించే నగరవాసులు డిసెంబరు నుంచి నీటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. జంట నగరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వేల నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు, రజకుల ధోబీఘాట్లకు కూడా ఉచిత విద్యుత్తు అందిస్తామన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో 6 నెలలపాటు రవాణా వాహనాల మోటారు వాహన పన్నును రద్దు చేశారు. కరోనాతో నష్టపోయిన వ్యాపార వర్గాలకు 6 నెలల కనీస డిమాండ్‌ విద్యుత్తు చార్జీలను కూడా రద్దు చేశారు. సినీ కార్మికులకు రేషన్‌ కార్డులు, ఆరోగ్య కార్డులు అందిస్తామని, చిన్న థియేటర్లు కూడా ఎక్కువ షోలు వేసుకునేలా, సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, చిన్న చిన్న వ్యాపారులకు తాగునీరు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ‘‘20 వేల లీటర్లలోపు నీరు వాడుకునే వారందరికీ ఉచితమే. ఈ నెలకు బిల్లు కడితే చాలు. వచ్చే నెల డిసెంబరు నుంచి నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు. నగరంలోని దాదాపు 97 శాతం ప్రజలకు ఇది వర్తిస్తుంది’’ అని వెల్లడించారు. ఇంతవరకు ఇలాంటి పథకాన్ని దేశంలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని, తాజా నిర్ణయంతో తెలంగాణ దేశంలో రెండో రాష్ట్రం కానుందని తెలిపారు. ఈ విషయమై కేజ్రీవాల్‌తోనూ మాట్లాడానని, ఆయన కూడా అభినందించారని చెప్పారు. ఉచిత నీటి సరఫరాతో రూ.300-400 కోట్ల  భారం పడుతుందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వమే జల మండలికి ఇస్తుందని తెలిపారు.

‘‘రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్‌ భగీరథ, ధరణి ప్రకటించినప్పుడు అనేక మందికి అనేక అనుమానాలుండేవి. అన్నిటినీ విజయవంతంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ 24 గంటల నిరంతర నీరు అందించడం నా కల. ప్రజలు నీటి దుబారా అరికడితే ఇది సాధ్యమే. ప్రజలు నీటి దుబారాను అరికట్టే చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) ఇటీవలే నివేదిక కూడా సమర్పించింది. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి, నీటి దుబారాను అరికడితే 24 గంటల నీరు అందించగలం. దీనిని గ్రేటర్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. ఇక్కడ విజయవంతమైతే నాలుగైదు మాసాల తర్వాత ఇతర మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోనూ అమలు చేస్తాం’’ అని వివరించారు. ప్రజలు దుబారా తగ్గించి, క్రమశిక్షణ పాటిస్తే మిగిలిన నీటిని పారిశ్రామిక అవసరాలకు ఇచ్చి ఆదాయాన్ని కూడా రాబడతామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లకు కూడా ఉచితంగా నీటిసరఫరా చేస్తామని చెప్పారు.

లాండ్రీలు, సెలూన్లకు ఉచిత విద్యుత్తు
జంట నగరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులకు 60-70 వేల సెలూన్లు ఉన్నాయని, అన్నిటికీ 100ు ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పారు. అలాగే, జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లాండ్రీలు, ధోబీఘాట్‌లకు వాడే విద్యుత్తును కూడా డిసెంబరు నుంచి ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

3.36 లక్షల వాహనాలకు పన్ను రద్దు
‘‘కరోనాతో రాష్ట్రానికి రూ.52,750 కోట్ల నష్టం వచ్చింది. అనేక వ్యాపార సంస్థలు కూడా భారీగా నష్టపోయాయి. అందుకే, వ్యవసాయం, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, గృహ విద్యుత్తు వినియోగం మినహాయిస్తే అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సంస్థలకు కనీస విద్యుత్తు చార్జీని రద్దు చేస్తున్నాం. సినిమా థియేటర్లకు మార్చి నుంచి సెప్టెంబరు వరకు 6 నెలల కాలనికి విద్యుత్తు చార్జీలు కూడా రద్దు’’ అని వరాలు కురిపించారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు ట్రాన్స్‌పోర్ట్‌ ఆటోలు.. అన్నీ కలిపితే రాష్ట్రంలో 3.36 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయని, వీటికి మార్చి నుంచి సెప్టెంబరు వరకు విధించిన రెండు త్రైమాసికాల రూ.267 కోట్ల వాహన పన్ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.

అర్హులకు ఎన్నికల తర్వాత వరద సాయం
‘‘వరదలు ఒక్క హైదరాబాద్‌లోనే రాలేదు. ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో కూడా వచ్చాయి. ఎక్కడా కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకోలేదు. వరదల సమయంలోనే దసరా పండుగ వచ్చింది. నా మనసుకు బాధయింది. నన్ను ఎవరూ అడగలేదు. డిమాండ్‌ చేయలేదు. సీఎస్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని పిలిచి మాట్లాడా. ప్రతి కుటుంబానికి వరద సాయం కింద రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించా. ఇప్పటి వరకు 6.56 లక్షల కుటుంబాలకు రూ.656 కోట్లను పంపిణీ చేశాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అనంతరం, మీసేవ ద్వారా 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందులో 1.60 లక్షల మందికి నగదు జమ చేశామని తెలిపారు.

‘‘అర్హులందరికీ వరద సాయం అందజేస్తాం. ఇంకో లక్ష, రెండు లక్షల కుటుంబాల వరకు ఉండొచ్చు. రూ.650 కోట్లను పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇంకో రూ.200, 300 కోట్ల విషయంలో వెనక్కు పోదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత 100 శాతం వరద సాయం అందజేస్తాం’’ అని హామీ ఇచ్చారు. కొత్త కార్పొరేటర్లు, మేయర్‌ సారథ్యంలో పారదర్శకంగా పంపిణీ చేపడతామన్నారు. ‘‘వరదల సమస్యను దేశంలోని అన్ని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్నాయి.

గత వర్షాలకు చెన్నై 21 రోజులు, ముంబై 14 రోజులపాటు నీటిలోనే ఉంది. ఢిల్లీ, కోల్‌కతాలోనూ ఈ సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలని కోరుతూ గతంలో కేంద్రానికి కొన్ని సూచనలు చేశా. ఏటా రూ.6 వేల కోట్లు ఇస్తే రాష్ట్ర వాటాగా మేం 6 వేల కోట్లు ఇస్తామని చెప్పా. ఈ నిధులతో నగరాల్లోని అనేక సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. కానీ, కేంద్రం ఎలాంటి కమిటీ వేయలేదు. ఇక వేస్తారన్న నమ్మకం కూడా లేదు’’ అని విమర్శించారు.

విమానాశ్రయం వరకు మెట్రో
మూసీని పునరుద్ధరిస్తామని, మూసీని, గోదావరిని అనుసంధానం చేస్తామని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. పడవలో షికార్‌ చేసేలా మూసీని తీర్చిదిద్దుతామని తెలిపారు. మెట్రో 2వ విడతను త్వరలో పూర్తి చేస్తామని, ఎయిర్‌పోర్ట్‌ వరకు విస్తరిస్తామని వివరించారు. శివారుల్లోని హెచ్‌ఎండీఏ ప్రాంతాలను కలుపుకొంటే నగర జనాభా 1.67 కోట్లుగా ఉందని, ఈ రద్దీని తట్టుకునేలా రీజనల్‌ రింగ్‌ రోడ్‌ను ప్రతిపాదించామని వివరించారు. దీనిని కేంద్రం తీసుకున్నట్టే తీసుకుని వీపు చూపి పారిపోయిందని, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించి మరీ పారిపోయారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫునే పూర్తి చేస్తామని చెప్పారు.

‘‘గత ఆరేళ్లలో దేశం సాధించలేని అద్భుతమైన ప్రగతిని సాధించాం. దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధి 9.2 శాతం అయితే.. తెలంగాణలో జీఎ్‌సడీపీ వృద్ధిరేటు 12.6. వృద్ధిలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంటే గుజరాత్‌ 8, మహారాష్ట్ర 10, బిహార్‌ 29, రాజస్థాన్‌ 18, మధ్యప్రదేశ్‌ 23, పశ్చిమబెంగాల్‌ 19, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన తెలంగాణలో సామరస్యాన్ని, శాంతిపూర్వక వాతావరణాన్ని కాపాడుకోవాలన్నారు.

టీఎ్‌సబీపా్‌సల హైదరాబాదా? కర్ఫ్యూపా్‌సల హైదరాబాదా?
‘‘ఎవరిని ఎన్నుకోవాలో.. భవిష్యత్తులో ఎలాంటి హైదరాబాద్‌ ఉండాలో మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న, అందరూ సామరస్యంగా బతికే హైదరాబాదే కావాలా? పొద్దున లేస్తే మత కల్లోలం, కర్ఫ్యూ కావాలా? టీఎ్‌సబీపా్‌సల హైదరాబాదా? కర్ఫ్యూపా్‌సల హైదరాబాదా? తేల్చుకుని నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

లౌకిక నగరాన్ని మనమంతా కాపాడుకోవాలని, అలవోకగా, ఆషామాషీగా ఓటేస్తే.. మన వేలుతో మన కన్నే పొడుచుకున్నట్లు అవుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు చెలరేగితే.. పిచ్చి పిచ్చి ఘటనలు జరిగితే రియల్‌ ఎస్టేట్‌ 100 శాతం కుదేలవుతుందని, భూముల ధరలు పూర్తిగా పడిపోతాయని, హైదరాబాద్‌ మార్కెట్టే కుప్పకూలిపోతుందని వ్యాఖ్యానించారు. ‘‘తమాషాగా ఓటేస్తే.. ఆ ఓటు మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది. తప్పుడు శక్తులు, వ్యక్తులకు ఓటేస్తే అది కాలనాగు అవుతుంది. చాలా జాగ్రత్త. ఆలోచించి ఓటు వేయండి’’ అని హితవు పలికారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వేరే వాళ్లు గెలిస్తే సాధించేదేమీ ఉండదని, హైదరాబాద్‌ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పారు.

మహిళా భద్రతలో వెనకడుగు వేయం
‘‘శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్‌ గొప్పగా ఉంది. గత ఏడేళ్లుగా కర్ఫ్యూలు, కత్తిపోట్లు, మాఫియా ముఠాలు, భూకబ్జా గూండాల్లేరు. మహిళలపై దుర్మార్గాలు జరిగితే ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే’’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ మహిళా భద్రత విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, దుర్మార్గులను ఉక్కుపాదంతో అణిచి వేస్తామని తెలిపారు.

బీజేపీ అట్టర్‌ ఫ్లాప్‌.. దేశానికి దిశ చూపిస్తా
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ‘‘మాటలు పెద్దగా చెబుతున్నారు. చేతలు శూన్యం. పిట్ట కథలు చెప్పి ప్రభుత్వాలు నడుపుతున్నారు. దేశానికి దిశ, దశ, మార్గదర్శనం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్‌ విఫలమయ్యాయి. ఆ పార్టీల పాలసీలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. దేశంలో కొత్త ప్రయోగం జరగాల్సిన అవసరం 100 శాతం ఉంది. దేశంలో సంపద సృష్టించే ప్రభుత్వం రావాలి. ఆ సంపదను పేదలకు పంచాలి. దేశం కొత్త మార్గం, కొత్త పంథాలో వెళ్లాలి. ఆ ఆవిష్కర్తగా నేనే ఎదుగుతా కావొచ్చు. నాకు ఆ ఆలోచన ఉంది. త్వరలోనే మీరు చూస్తారు’’ అని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

దేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి తెలంగాణ బిడ్డగా.. జాతి ప్రయోజనాల కోసం ఏ త్యాగం చేసేనా సరే ముందుకు పోతానని మరోసారి ప్రకటించారు. ‘‘రాబోయే కొద్దికాలంలో దేశంలోని పార్టీలతో సమావేశం నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు యుద్ధభేరి మోగిస్తాం. కార్మికులారా.. మీరు ఒంటరని అనుకోకండి. మీపక్షాన కేసీఆర్‌ పోరాడుతాడు’’ అని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

సెకండ్‌ వేవ్‌ వస్తోంది.. జాగ్రత్త!
‘‘రాష్ట్రంలో కరోనాను నియంత్రించే స్థాయికి వచ్చాం. రికవరీ రేటులో బాగున్నాం. ఈ స్థితిని ఇలాగే కాపాడుకోవాలి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా.. నాకేం అవుతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదు. సెకండ్‌వేవ్‌ వస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరమని చెబుతున్నారని తెలిపారు. అందుకే, ప్రతిరోజూ 74 వేల టెస్ట్‌లు చేయాలని ఆదేశించామని, మరో 2 లక్షల కరోనా కిట్లు తెప్పించి అందుబాటులో ఉంచాలని చెప్పామని వివరించారు. కరోనా తీవ్రమైతే లాక్‌డౌన్‌లు పెట్టాల్సి వస్తుందని, కర్వ్యూ విధించే అవకాశం ఉంటుందని చెప్పారు. కనీస జాగ్రత్తలు పాటించి ప్రజలు సహకరించాలని కోరారు.

అందమైన పూలబొకే.. హైదరాబాద్‌
‘‘ఘనమైన సంస్కృతి, అన్ని మతాల వారి కలయికతో కూడిన విలక్షణ నగరం హైదరాబాద్‌. ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినా అక్కున చేర్చుకుంటుంది. గుజరాతీ గల్లీ, పార్సీ గుట్ట, అరబ్‌ గల్లీలతో వివిధ సంస్కృతుల సమ్మేళనం ఇక్కడ ఉంది. గుజరాతీ, బిహారీ సమాజ్‌తోపాటు వివిధ రాష్ట్రాల సమాజ్‌లు ఉన్నాయి. అందమైన పూలబొకేలాంటిది మన నగరం. గత ఆరేళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం. ఐటీలో దేశంలోనే నెంబర్‌-2 స్థానంలో ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు కల్లోలం సృష్టించాలని చూస్తున్నారు.

అందరి హైదరాబాద్‌ను కొందరికే పరిమితం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ప్రశాంత హైదరాబాద్‌ కావాలా? కల్లోల హైదరాబాద్‌ కావాలా? తేల్చుకోవాల్సింది నగర ప్రజలే’’ అని హితవు పలికారు. ఈ ప్రశాంతత కొనసాగాలంటే జంట నగరాల భవిష్యత్తు కోసం ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని, గతంకంటే ఉన్నతమైన విజయం అందించాలని కోరారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates