దారిలోనే రాలిపోయారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సొంత ఊరివైపు సాగిపోతూ నలుగురు వలస కూలీల దుర్మరణం

కామారెడ్డి- కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కరోనాతో వలస కూలీల బతుకు చిత్రం ఛిద్రంగా మారుతోంది. ఉపాధి కోల్పోయి సొంతూరి బాట పట్టిన అభాగ్యులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కాలినడకన బయలుదేరి అస్వస్థులై దారిలో మరణిస్తుండగా.. మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడి విగత జీవులవుతున్నారు. మంగళవారం వేర్వేరు ఘటనల్లో నలుగురు కన్నుమూశారు.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి శివారులో వాహనం బోల్తా పడి ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 15 మందికి గాయాలయ్యాయి. మరో ఘటనలో కాలినడకన స్వగ్రామానికి వెళుతున్న ఒడిశా యువకుడు భద్రాచలంలో మరణించారు. వీరందరూ హైదరాబాద్‌ నుంచి స్వస్థలాలకు బయలుదేరినవారే.

డ్రైవర్‌ మాట విని విగతజీవులయ్యారు..
రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో ఝార్ఖండ్‌కు వలస కూలీలు భవన నిర్మాణ పనులు చేసేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుత్తేదారులు చేతులెత్తేయడంతో తిండి లేక.. కాలినడకన ఇంటిబాట పట్టారు. కొంత దూరం వెళ్లాక.. వీరికి శంకర్‌పల్లి సమీపంలో టాటామ్యాజిక్‌ వాహనం తారసపడింది. ఒక్కొక్కరికి రూ.200 తీసుకుని నిర్మల్‌ వద్ద దింపుతానని డ్రైవర్‌ చెప్పడంతో కూలీలు వాహనం ఎక్కారు. దగ్గి శివారు వద్ద వేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సుదేశ్వర్‌రాం(33) కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు అవదేశ్‌ (39), బీహారీరాం(35)లు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో మరణించారు. క్షతగాత్రులైన సంజయ్‌రాం, అంబ్రీష్‌రాం, వినయ్‌రాంల పరిస్థితి విషమంగా ఉంది. వీరు కూడా గాంధీలో చికిత్స పొందుతున్నారు. సుదేశ్వర్‌రాంకు ముగ్గురు కుమార్తెలున్నారని.. ఇక వారికి దిక్కెవరంటూ తోటి వలస కూలీలు కన్నీరుమున్నీరయ్యారు.

ఆగిన వలసజీవి గుండె
భద్రాచలం, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలి నడకన సుదీర్ఘ ప్రయాణానికి ఉపక్రమించిన ఓ వలస జీవి గుండె మార్గంమధ్యలోనే ఆగిపోయింది. భద్రాచలంలో మంగళవారం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన యువకుడు మడకం కాసా(22) హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తోటివారితో కలిసి ఇంటికి రావాలని నిర్ణయించుకున్నారు. వాహనంలో రావడానికి డబ్బుల్లేకపోవడంతో ఆదివారం హైదరాబాద్‌ నుంచి నడక ప్రారంభించి సుమారు 350 కిలోమీటర్లు ఎర్రని ఎండలో నడిచారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలం చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో తోటి కూలీలు ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అప్పటికే కాసా వడదెబ్బతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. హడావుడిగా  ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు. వాహనం ఎవరు ఏర్పాటు చేశారో తెలియరాలేదు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates