నీటి వనరులు ప్రయివేటీకరణ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-నదులు, కాలువులు, చెరువుల్లో చేపల వేట.. ప్రయివేటు చేతుల్లోకి..
-ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసిన మోడీ సర్కార్‌
– ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ’ మత్స్యపరిశ్రమకు మేలు చేయదు: నేషనల్‌ ఫిష్‌ వర్కర్స్‌ ఫోరం
– నదులు, సముద్రతీర ప్రాంతాల్లో మత్స్యకారులకు తీరని నష్టం

దేశ సంపద అయిన నదులు, కాలువలు, సముద్ర తీర ప్రాంతాలపై ఆధారపడి జీవించే హక్కు ఈ దేశ ప్రజలందరికీ ఉంది. కోట్లాదిమంది కుటుంబాలు చేపలు, రొయ్యల పెంపకం, చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతటి కీలకమైన ఈ రంగంలో ప్రయివేటు శక్తులకు ప్రాధాన్యత ఇస్తూ మోడీ సర్కార్‌ ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ- 2020’ని రూపొందించింది. ఇది అమల్లోకి వస్తే చేపలవేటపై ఆధారపడ్డ వివిధ సామాజికవర్గాలు తీవ్రంగా నష్టపోతాయని సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చేపలవేట సాగించే రైతులు…కాంట్రాక్ట్‌ లేబర్‌గా మారిపోయే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.

న్యూఢిల్లీ : కేంద్రం ఇటీవల తెరమీదకు తీసుకొచ్చిన ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ’పై మత్స్యకారుల్లో, చేపల వేటపై ఆధారపడిన సామాజిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మత్స్యపరిశ్రమలో బడా పెట్టుబడిదారుల హవాను మరింత పెంచేవిధంగా విధానపరమైన కీలక మార్పులున్నాయని సమాచారం. కేంద్రం రూపొందించిన ముసాయిదా విధానం మత్స్యపరిశ్రమపై ఆధారపడ్డ వారిని, తీర ప్రాంతాల్లో పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని ‘నేషనల్‌ ఫిష్‌వర్కర్స్‌ ఫోరం’ ఆరోపించింది. ముఖ్యంగా చేపల వేట జీవనోపాధిగా ఉన్న..చిన్న, మధ్యస్థాయి మత్స్యకారులు, మహిళలు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని ఫిష్‌ వర్కర్స్‌ ఫోరం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో మత్స్యపరిశ్రమను ఎగుమతి ఆధారిత పరిశ్రమగా మార్చితే, అది బడా వ్యాపారస్థులకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఉత్పత్తిని విపరీతంగా పెంచటం, భారీ పెట్టుబడులు…ఇదంతా చేపలవేటపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తాయని పరిశోధకులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ’లో మహిళల ప్రస్తావనే లేదని, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు లేవని వారు అన్నారు. కొన్ని శతాబ్దాలుగా చేపలవేటపై ఆధారపడిన వివిధ జాతులు, కులాలను మోడీ సర్కార్‌ పరిగణలోకి తీసుకోకుండా ముసాయిదా విధానాన్ని తయారుచేశారని వారు ఆరోపించారు.

సముద్రంపై చేపలవేట ఎంతో శక్తియుక్తులతో, నైపుణ్యంతో కూడిన వ్యవహారం. ప్రాణాలు ఫణంగా పెట్టి మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు. వీరికి ప్రత్యేక నైపుణ్య శిక్షణ, ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలను ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ’ ప్రస్తావించలేదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి…’గిల్‌ నెట్టర్స్‌’తో చేపలవేట సాగించేవారికి పాలసీలో పెద్దపీట వేశారు. భారీ రుణాలు, సాంకేతిక నైపుణ్యం,వారికి శిక్షణ అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ముందు ముందు పర్యావరణానికి ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏది అమలు..ఏది పక్కకు..
నేషనల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ పాలసీ-2017 ప్రస్తుతం అమల్లో ఉంది. నేషనల్‌ ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌, ఆక్వాకల్చర్‌ పాలసీ-2019 ముసాయిదా ప్రతిపాదనల్ని 2019లో మోడీ సర్కార్‌ రూపొందించింది. అలాగే నేషనల్‌ మెరికల్చర్‌ పాలసీ-2019ను కూడా ప్రకటించింది. తాజాగా ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ-2020’ను సిద్ధం చేసింది. ఇందులో ఏది అమల్లో ఉంటుంది? దేనిని పక్కకు పెడతారు? అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వటం లేదు.

‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ’ని కేంద్ర మత్స్యశాఖ వెబ్‌సైట్‌లో విడుదలచేశారు. ఫిబ్రవరి 12 నుంచి ముసాయిదా ప్రతి అందుబాటులో ఉంది. ప్రజలు, మత్స్యపరిశ్రమకు చెందినవారి నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెబుతున్న మోడీ సర్కార్‌, మరోవైపు ముసాయిదా ప్రతికి తుది మెరుగులు దిద్దుతోంది. ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు జరుపుతున్నది.

కోట్లాది కుటుంబాలకు జీవనాధారం
ప్రపంచంలో చేపలు, రొయ్యలు…ఎగుమతి చేస్తున్న ముఖ్యదేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఎగుమతుల ద్వారా భారత్‌కు పెద్ద మొత్తంలో విదేశీ మారకం కూడా సమకూరుతున్నది. 2017-18లో జీడీపీలో మత్స్యపరిశ్రమ వాటా 1.75 లక్షల కోట్ల రూపాయలు ఉంది. మత్స్య పరిశ్రమ 7శాతం వృద్ధిరేటును నమోదుచేస్తున్నది. 2017-18 జీడీపీలో మత్స్యపరిశ్రమ వాటా 1.03శాతం. వివిధ సామాజిక వర్గాలకు చెందిన కోటీ 60లక్షల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. భారత తీర ప్రాంతాల్లో, నదుల్లో, చెరవుల్లో…ఎంతో జీవవైవిధ్యమున్న చేపలు, రొయ్యలు, ఇతర జీవాలు ఉన్నాయి.

సునీల్‌ మహమ్మద్‌, సైంటిస్ట్‌,
సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌, కోచీ – మాజీ హెడ్‌
మత్స్యపరిశ్రమలో ఎన్నో విభాగాలున్నాయి. వీటన్నింటినీ ఒకే గాటన కట్టి విధానాన్ని తయారుచేయటం మూర్ఖత్వం. ఇంతకుమించిన పొరపాటు లేదు. సముద్రంపై చేపలవేట, నదులు, చెరవులపై చేపల వేట…భిన్నమైనవి. వీటిపై ఆధారపడి జీవిస్తున్న వర్గాలు కూడా సామాజికంగా, ఆర్థికంగా భిన్నమైనవి. మహిళల్ని పరిగణలోకి తీసుకోలేదు.

ప్రదీప్‌ ఛటర్జీ, కన్వీనర్‌,
నేషనల్‌ ఫ్లాట్‌ఫాం ఫర్‌ స్మాల్‌స్కేల్‌ ఫిష్‌ వర్కర్స్‌
మనదేశంలో నదులు, కాలువలు లెక్కలేనన్ని ఉన్నాయి. రిజర్వాయర్లు, సరస్సులు, చెరువులలో చేపలవేట సాగిస్తూ వివిధ సామాజికవర్గాలు, మత్స్యకారులు జీవనోపాధిని పొందుతున్నారు. చేపల ఉత్పత్తిని పెంచడమనే లక్ష్యం పేరుతో ఈ ప్రాంతాల్ని ప్రయివేటు పెట్టుబడుదారులకు అప్పగించేందుకు ‘నేషనల్‌ ఫిషరీస్‌ పాలసీ’ రూపొందించారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates