50 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
15-24 ఏండ్ల వారే 26.7 కోట్లు
పనిచేస్తూ.. తీవ్ర పేదరికంలో ఉన్నవారు 63 కోట్ల మంది..
యూఎన్‌ తాజా నివేదికలో వెల్లడి
పరిస్థితి మేం ఊహించినదానికంటే అధ్వానంగా ఉంది : ఐఎల్‌వో చీఫ్‌ గై రైడర్‌
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది నిరుద్యోగులున్నారని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) తెలిపింది. ప్రపంచ నిరుద్యోగిత రేటు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతుందే తప్ప ఏమాత్రమూ తగ్గడం లేదని తాజాగా అది విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో).. ‘వరల్డ్‌ ఎంప్లాయి మెంట్‌ అండ్‌ సోషల్‌ అవుట్‌లుక్‌’ నివేదికను మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. చేయడానికి పనులు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ పరిస్థితి సామాజిక అశాంతికి దారితీస్తుందని ఐఎల్‌వో అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేవనీ, ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేసింది.
నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం… 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్ల మంది నిరుద్యోగులు రిజిష్టర్‌ అయి ఉన్నారు. అది ఈ ఏడాది మరో రెండు కోట్ల (19.5 కోట్లు)కు చేరే అవకాశం ఉంది. వీరందరూ చేయ డానికి ఏం పని లేక ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నవారే. ఇక తమ సామర్థ్యానికి తగిన పని దొరక్క ఏదైనా ఉపాధి చూసుకోవడమో (పార్ట్‌ టైం జాబ్‌ లాంటిది) లేదా ఉద్యోగాన్వేషణను వదిలేయడమో చేసిన వారు 28.5 కోట్ల మంది ఉన్నారు. మొత్తంగా వీరందరూ కలిసి 47.3 కోట్ల మంది. వీరు ప్రపంచ కార్మిక శక్తిలో 13 శాతం మంది ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు గత దశాబ్దం నుంచి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. గతేడాది అది 5.4 శాతం నమోదైంది.
మరోవైపు 47 కోట్ల మందిలో సుమారు 26.7 కోట్ల మంది నిరుద్యోగులు 15-24 ఏండ్ల మధ్య ఉన్నవారే. వీరు నిరుద్యోగులే గాక ఎలాంటి ఉపాధి శిక్షణా కోర్సులలోగానీ, వృత్తి విద్యా కోర్సులలో గాని శిక్షణ పొందడం లేదు. అంతేగాక ప్రపంచ కార్మిక శక్తిలో 60 శాతానికి పైగా మంది అసంఘితరంగ ఆర్థిక వ్యవస్థలోనే పనిచేస్తున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 63 కోట్ల మంది (ప్రపంచ కార్మిక శక్తిలో ఐదోవంతు) తీవ్ర పేదరికంతో బతుకులీడుస్తున్నారు. వీరి కనీస ఆదాయం రోజుకు రూ. 210 (3 యూఎస్‌ డాలర్లు) కూడా ఉండటం లేదు. కాగా, 2004-2017 మధ్య కాలంలో వేతనాలు, ఇతర శ్రమ ఖర్చుల నిమిత్తం చెల్లించే జాతీయాదాయం వాటా కూడా 54 శాతం నుంచి 51 శాతానికి తగ్గింది. ఇదే విషయమై ఐఎల్‌వో చీఫ్‌ గై రైడర్‌ స్పందిస్తూ… ‘పరిస్థితి మేం ఊహించినదానికన్నా అధ్వానంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. అంతేగాక ప్రజల మధ్య ఉన్న ఆదాయ అసమానతలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నవి. తక్కువ వేతనాలు ఉన్న 20 శాతం మంది తమకంటే ఎక్కువ వేతనాలు పొందేవారితో సమానంగా రావడానికి పదకొండేండ్ల సమయం పట్టింది. ఇవన్నీ సమాజంలో అశాంతిని, అలజడిని పెంపొదించే ప్రమాదం ఉంది. దీనిని రూపుమాపాలంటే అర్హులైనవారికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం, వారి ఆదాయ అసమానతలను తొలగించే చర్యలు చేపట్టాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవు’ అని హెచ్చరించారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates