భారత కార్మికోద్యమ పితామహుడు నారాయణ్ మేఘాజీ లొఖాండే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
చల్లపల్లి స్వరూపరాణి

మేడే ప్రపంచ కార్మిక దినం, ప్రపంచంలోని కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రోజు. కానీ, భారత దేశంలో కులం శ్రామికులను కలిపి వుంచలేకపోయింది. ‘శ్రామిక వర్గ నియంతృత్వం’ యెంత మంచి మాట! అది ఇక్కడ సాధ్యం కాదనే అసంతృప్తి తప్ప ఆ భావనమీద గానీ, దానిని ప్రతిపాదించిన మార్క్స్ , ఏంగిల్స్ మీద గానీ అభిమానం, గౌరవం తక్కువేమీ కాదు.

ఆమధ్యన ఒక ప్రముఖుడు విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడ ఎర్ర జెండాలు మేడలమీద, మూడు రంగుల కాంగ్రెస్ జెండాలు గుడిసెలమీద ఎగరడం చూసి ఆశ్చర్యపోయాడంట. కమ్యూనిస్టు సిద్ధాంతం పుస్తకాలలోనే వుండే చోట ఎర్ర జెండా కూడా పుస్తకాలు, లైబ్రరీలు, ప్రింటింగ్ ప్రెస్ వుండేవారి ఇళ్ళమీదనే ఎగురుతుంది. వారి విముక్తికి దారులువేసే రాజకీయాలు శ్రామికుల గడప తొక్కకపోతే, ప్రజలంటే ‘ఓటర్లు’ అని భావించే పార్టీలు సహజంగానే తమ జెండాలు, బ్యానరు గుడ్డల్ని గుడిసెలు కప్పుకోడానికి యిచ్చిపోతుంటాయి.

భారత దేశంలో కార్మికోద్యమానికి పునాదులు వేసిన సత్యశోధకుడు, తర్వాత అంబేడ్కర్ ని ప్రభావితం చేసిన ‘లొఖాండే’ ఈదేశ శ్రామికులకు ప్రాతఃస్మరణీయుడు.

భారత కుల సమాజంలో కష్టపడే వారిని అందునా శారీరక శ్రమ చేసేవారిని జంతువులకంటే హీనంగా చూడడం అనే దుర్మార్గపు ధోరణిని బ్రాహ్మణవాదం అందరికీ అంటించింది. 1880 వ దశకంలోనే భారతదేశం లో కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించి వారికి గౌరవ ప్రదమైన జీవితం, వారి శ్రమకు తగిన ప్రతిఫలం, పనిచేసే స్థలాల్లో భద్రత, విశ్రాంతి కావాలని ఇక్కడి కమ్యూనిస్టులకంటే ముందుగా గుర్తించింది అణగారిన కులాలనుంచి వచ్చిన సంస్కర్తలే! తొలితరం కమ్యూనిస్ట్ నాయకులు తమ బంధువులైన తిలక్, పటేల్ మాదిరిగానే జాతీయవాద ప్రభావంలో ఉండగా శ్రామిక సమస్యల పట్ల కమ్యూనిస్టులకంటే భిన్నమైన ప్రాపంచిక దుక్పధంతో బ్రాహ్మణేతర సంస్కర్తలు ఉండడం చూస్తాం. Bombay Mill Hands Association పేరున 1884 లో దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని ప్రారంభించిన కార్మికోద్యమ పితామహుడు, నారాయణ్ మేఘాజీ లొఖాండే అటు ట్రేడ్ యూనియన్ ఉద్యమ చరిత్రను రికార్డ్ చేసే వామపక్ష మేధావుల చేత, ఇటు సామాజిక ఉద్యమ చరిత్రకారులచేత విస్మరణకు గురవ్వడమే విషాదం.

బొంబాయి వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికుల పనిగంటలు తగ్గించడానికి, కార్మికులకు ఆదివారం సెలవు దినం గా ప్రకటించడానికి, స్త్రీలకు, చిన్నపిల్లలకు పనిలో మద్యాహ్నం గంట పాటు విశ్రాంతి కల్పించడానికి, పనిలో గాయపడి అనారోగ్యం పాలై, కొన్నిసార్లు శాస్వతంగా పని చెయ్యలేని స్తితిలోకి వెళ్ళిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, వేతనాలు కల్పించడానికి ఎంతో శ్రమించి పరిశ్రమల యజమానులతోనూ, బ్రిటీషు ప్రభుత్వంతోనూ పోరాడి సాధించిన ఫూలే సహచరుడు, సత్యశోధక సమాజ సభ్యుడు లొఖాండేని భారత ట్రేడ్ యూనియన్ చరిత్రలో లేకుండా చేసినా బ్రిటీషు ప్రభుత్వం 1895 లో ‘రావు బహద్దూర్’ బిరుదు ఇచ్చి సన్మానించింది. గ్రామాలలో కులం కారణంగా బతకలేక పని వెతుక్కుంటూ బొంబాయి వంటి పట్టణాలకు వలస వెళ్ళే శ్రమ జీవులంతా ఎక్కువ శాతం దళితులే. వారు 1879- 1896 మధ్యకాలంలో సుమారు 80,000 మంది ఉండేవారని లెక్కలు చెబుతున్నాయి. సహజంగానే వారి శ్రమకు డిమాండ్ ఉండడం, లేకపోవడం బయట బ్రిటీషు ప్రభుత్వ వ్యాపార లావాదేవీలపై ఆధారపడి ఉండేది. అయితే వేరే గత్యంతరం లేక అత్యంత చవకగా కార్మికులు దొరకడం, వారికి బేరమాడే శక్తి లేక యజమానులు చెప్పినట్టు రేయింబవళ్ళు గొడ్డులాగా బట్టల మిల్లులో వారు పనిచెయ్యడం వలన బొంబాయి మిల్లులలో వస్త్రాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ రోజుల్లోనే లొఖాండే ట్రేడ్ యూనియన్ ఉద్యమం లోకి వేలాదిమంది కార్యకర్తలను సమీకరించగలగడం అనేదాన్ని ‘చరిత్ర’ జాగ్రత్తగా దాచిపెట్టింది.

ఆయన క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన విద్యా సంస్థల్లో చదువుకుని చైతన్యవంతమైన తొలితరం విద్యావంతుడు, సంఘ సంస్కర్త అయిన లొఖాండే 1848 లో ఫూలే జన్మించిన ‘మాలి’ కులంలో పుట్టాడు. బొంబాయి మిల్లు కార్మిక సమాఖ్యని ఏర్పాటు చేసి వారికి కనీస సౌకర్యాలను కల్పించడానికి శ్రమించాడు. మహారాష్ట్రలో హిందూ ముస్లిం మతస్తుల మధ్య అల్లర్లు, హింస చెలరేగినప్పుడు బాలగంగాధర్ తిలక్ లాంటి ‘దేశభక్తులు’ ముస్లిములను దానికి బాధ్యులని చేస్తూ ‘కేసరి’ పత్రికలో విషం కక్కితే దానికి లొఖాండే ‘దీనబంధు’ పత్రికలో కుహనా దేశభక్తుల ముస్లిం వ్యతిరేకతను ఎండగట్టాడు. ఆనాటి హింసకు బలైన ఇరు మతస్తులను ఆదరించాడు లొఖాండే. ఆ మతపతమైన అల్లర్లకు భయపడి బొంబాయి వస్త్ర పరిశ్రమకు పనికోసం వలస వచ్చిన కార్మికులు పని మానేసి తిరిగి గ్రామాలకు వెళ్ళగా వారు తిరిగి మిల్లు పనికి వచ్చేలాగా వారిలో ధైర్యం నింపాడు. బ్రాహ్మణ వర్గాల స్త్రీల కొరకు ఫూలే నిర్వహించిన సంస్కరణ కార్యక్రమాలను శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళడంలో నారాయణ్ మేఘాజీ లొఖాండే ముందుండేవాడు. బ్రాహ్మణ వితంతువులకు శిరోముండనం చెయ్యకుండా మంగలి పనివారితో (1890) సహాయ నిరాకరణ చేయించింది ఈయనే! లొఖాండే ఫూలే ప్రారంభించిన ‘దీనబంధు’ పత్రికను నడిపి సత్యశోధక సమాజపు కార్యక్రమాలను ఫూలే మరణానంతరం ముందుకు తీసుకెళ్ళి అన్ని రంగాలలో తిష్ట వేసుకుని ప్రజల్ని పీడించుకు తినే బ్రాహ్మణ వాదుల్ని చివరి వరకూ ఎదుర్కున్న లొఖాండే ప్లేగు వ్యాధి బారిన పడి 1897 లో మరణించాడు.

ఉద్యమాల పరంగా తన పూర్వీకుడు, స్పూర్తి ప్రదాత అయిన లొఖాండే కార్మికోద్యమ స్పృహను మరింత ముందుకు తీసుకెళ్ళి వారికి మరికొన్ని హక్కులు కల్పించిన అంబేడ్కర్ ని కూడా కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తించకపోవడం చూస్తాం. లొఖాండే, అంబేడ్కర్ లు కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలను, వారి కృషిని కార్మికోద్యమ చరిత్రలో కనిపించకుండా చేసిందెవరు?

ఎవరు ఎంతగా తొక్కి పాతరేయాలనుకున్నా అసలు చరిత్ర భూమి పొరల్ని చీల్చుకుని రాక మానదు. కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ఈదేశంలో కార్మికులను మనుషులుగా గుర్తించి వారి హక్కులకొరకు ఉద్యమాన్ని ప్రారంభించిన నారాయణ్ మేఘాజీ లొఖాండే, బాబాసాహెబ్ అంబేడ్కర్ లకు జోహార్లు…

RELATED ARTICLES

Latest Updates