మోడీ సర్కార్ మొండి వైఖరి వీడకపోతే..భారీ మూల్యం తప్పదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– కార్పొరేట్లకు కేంద్రం జీహుజూర్‌ : సీఐటీయూ అధ్యక్షులు కె.హేమలత, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

న్యూఢిల్లీ : చలికి వణుకూ ఆందోళన చేస్తున్న రైతులకు పెద్దఎత్తున మద్దతు లభిస్తున్నది. రైతుల ఆందోళనకు ప్రజా సంఘాలు సోమవారం సంఘీభావం తెలిపాయి. సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ యూ, ఐద్వా తదితర ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. కె.హేమలత, కరుమలయన్‌ (సీఐటీయూ), బి వెంకట్‌, విక్రమ్‌ సింగ్‌ (ఏఐఏడబ్ల్యూయూ), జగ్మతి సంగ్వాన్‌, ఆశా శర్మ (ఐద్వా) తదితరులు ఢిల్లీ-హర్యానా సరిహద్దు టిక్రీ వద్ద రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. మోడీ సర్కారు మొండి వైఖరి వీడకపోతే.. భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. రైతులకు మద్దతుగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. టిక్రీ వద్ద పంజాబ్‌కు చెందిన గాయని రూపినందర్‌ హండా సంఘీ బావం తెలిపారు. రైతుల ఉద్యమానికి స్థానిక ప్రజల నుంచి అపారమైన మద్దతు లభిస్తున్నది. యువకుల బృందాలు, పౌర సమాజ సంస్థలు ఆహారపదార్థాలను పంపిణీ చేస్తున్నాయి.

ఎన్డీయే నుంచి బయటకు వెళ్తాం: ఆర్‌ఎల్‌పీ
రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్డీయే పక్షాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే చిరకాల బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) ఎన్డీయే నుంచి బయటకు వెళ్లింది. కాగా, ఇప్పుడు మరో ఎన్డీయే పక్షం అల్టిమేటం ఇచ్చింది. రైతు వ్యతిరేక చట్టాలను రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు చేయకపోతే ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నాగౌర్‌ ఎంపీ, ఆర్‌ఎల్‌పీ అధినేత హనుమాన్‌ బెనివాల్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోతే, తాము కూడా రైతు ఉద్యమంలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు.

డిసెంబర్‌ 3న రహదారుల దిగ్బంధానికి సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ మద్దతు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా ఏఐకేఎస్‌, ఇతర రైతు సంఘాలు ఇచ్చిన రహదారుల దిగ్బంధానికి సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ మద్దుతునిచ్చాయి. డిసెంబరు 3 నుంచి 10 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చాయి. డిసెంబర్‌ 3న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లో గంట సేపు రహదార్లు దిగ్బంధానికి పిలుపు నిచ్చాయి. చారిత్రాత్మకంగా జరుగుతున్న రైతాంగ ఆందోళనను బలహీన పరిచేందుకు బీజేపీ ప్రభుత్వం అత్యంత హీనంగా వ్యవహరించడం దారుణమని సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. రైతులతో ప్రధాని మోడీ, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాసమని హెచ్చరించారు.

రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తోన్నాయి: ప్రధాని మోడీ
రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారణాసిలో ప్రధాని మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను శక్తివంతం చేస్తాయనీ, వారికి మరిన్ని అవకాశాలు ఇస్తాయని అన్నారు. గతంలో రుణమాఫీ, ప్యాకేజీలను ప్రకటించారనీ, అయితే ఇటువంటి పథకాలు రైతులకు ప్రయోజనం చేకూరేందుకు ఎప్పుడూ ఉపయోగపడలేదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం కోసం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు, సంస్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకేననీ, దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కూడా దాని ప్రయోజనాలను పొందుతారని చెప్పారు.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates