రైతు ఆత్మహత్యలను నివారించలేని కేంద్ర బడ్జెట్

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 సారంపల్లి మల్లారెడ్డిImage result for sarampally malla reddy

ఈసారి రూ.30,42,230 కోట్లతో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2019-20 కంటే రూ.2,55,885 కోట్లు ఎక్కువ. 2020-21 బడ్జెట్‌ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి పెద్ద అంగలతో అభివృద్ది చెందుతుందని, 2025 నాటికి భారత జీడీపీ 5 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని బడ్జెట్‌ ఉపన్యాసంలో చెప్పారు. బడ్జెట్‌ అంకెలు పరిశీలిస్తే ప్రభుత్వం చెప్పినదానికి, అంకెలకూ ఎలాంటి పోలికా లేదు. భారతదేశంలో రోజుకు 447 ఆదాయం లోపు వున్నవారిని మాత్రమే దారిద్య్రరేఖకు దిగువవారిగా పరిగణిస్తారు. నెలకు 2,250 ఆదాయం లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. కనీస వేతనం నెలకు రూ.18,000 నుంచి 21,000కు పెంచిన ప్రభుత్వం అంత తక్కువ ఆదాయం ఉన్నవారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిగా గుర్తించడం సరికాదు. నెలకు కనీస వేతనం రానివారిని దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారుగా గుర్తించాలి. 1994లో 35శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖ దిగువ ఉండగా 2019లో 21.9శాతానికి తగ్గినట్టు ఐక్యరాజ్యసమితి భారతదేశ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ తాగునీటి సౌకర్యం లేనివారు 14.5శాతం ఉన్నారు. అక్షరాస్యతలో 10వ తరగతిలో 79.4శాతం ఉండగా, ఇంటర్‌మీడియట్‌ నాటికి 56.5శాతానికి తగ్గిపోతున్నారు. దీనినిబట్టి అక్షరాస్యతలో డ్రాపౌట్స్‌ గుర్తించవచ్చు. కేంద్రప్రభుత్వం విద్యపై రూ.99,291 కోట్లు (గత బడ్జెట్‌పై +రూ.4,438 కోట్లు) మాత్రమే కేటాయించింది. పాఠశాల విద్య, ఉన్నత విద్యకు కేటాయింపులు పెంచకపోగా విద్యలో విదేశీ పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రయివేటు విద్య కొనలేక అక్షరాస్యత పెరగడంలేదు. ఆరోగ్యశాఖకు కూడా కేటాయింపులేమీ పెంచలేదు.

వ్యవసాయశాఖ కేటాయింపులు పరిశీలిస్తే, గత కేటాయింపులపై 4 వేల కోట్లు మాత్రమే పెంచారు. ఈ రంగానికి కేటాయించిన 1,34,399 కోట్లలో, ప్రభుత్వ పథకాలైన వడ్డీ మాఫీ 21,175, కిసాన్‌ సమ్మాన్‌ 75 వేలు, పంటల బీమా 15,695, ఇరిగేషన్‌ 4 వేలు, మార్కెట్‌ జోక్యం 2 వేలు, రైతు పింఛన్‌ రూ.220, ఎఫ్‌పీఓలకు 500 కోట్ల చొప్పున కేటాయింపు చూపారు. ఈ పథకాలను మినహాయిస్తే వ్యవసాయరంగానికి కేటాయించింది 16 వేల కోట్లు మాత్రమే. అందువల్ల వ్యవసాయాభివృద్ధి 2శాతానికి మించడంలేదు. వాస్తవానికి ఎకనామిక్‌ సర్వే ప్రకారం 2017-18, 2018-19లో 28.5కోట్ల టన్నుల ఆహారధాన్యాలు మాత్రమే ఉత్పత్తి అయింది. 2017-18తో పోలిస్తే ఈసారి 40లక్షల టన్నుల ముతక ధాన్యాలు, 20లక్షల టన్నుల పప్పులు తక్కువగా ఉత్పత్తి అయ్యాయి. ధరలు పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి వృద్ధిరేటు 2.1శాతంగా చూపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలుకాక పోవడంతో రైతులు ఏటా రూ.3లక్షల కోట్లు నష్టపోతున్నట్టు ఆర్థిక నివేదికలు తెలుపుతున్నాయి.

ఏటా 12 వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత మూడేండ్లుగా కొత్తగా కౌలు చట్టం తెస్తామని నిటి అయోగ్‌ ద్వారా ముసాయిదా ప్రకటించి నేటికీ పార్లమెంటులో ఆమోదించలేదు. ఆమోదించాలని రాష్ట్రాలను కోరింది. ఏ రాష్ట్రం అందుకు సుముఖంగా లేదు. పాల ఉత్పత్తి రెట్టింపు, 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి లక్ష్యం నిర్ణయించారు. ఇప్పటికే ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. అయినా న్యూజిలాండ్‌ లాంటి దేశాల నుంచి పాల దిగుమతులు పెద్దఎత్తున వచ్చిన స్థానిక పాల ఉత్పత్తిదారుల్ని దివాళా తీయిస్తున్నాయి. సకాలంలో రైతులకు నిర్ణీత రుణ ప్రణాళిక ప్రకారం అప్పులివ్వలేని బ్యాంకులకు 3.5లక్షల కోట్లు మూలధన వ్యయం కింద కేంద్రం సహకరిస్తుందని ప్రకటించారు. ఈ నిధులన్నీ గుత్త సంస్థలకే వెళ్తాయి. ఇప్పటికే 27 బ్యాంకుల్ని 12 గ్రూపులుగా మార్చేశారు. వ్యవసాయ రుణాలే కాక బలహీనవర్గాలకు ఇచ్చే రుణాలను కూడా బ్యాంకులు క్రమంగా కోతపెడుతున్నాయి. రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తానన్న మోడీ ప్రచారం ఆచరణకు నోచనిదే. గతేడాది కిసాన్‌ సమ్మాన్‌ కింద కేటాయించిన 75వేల కోట్లలో 54వేల కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో మధ్యదళారీలను తొలగిస్తానన్న ప్రభుత్వం ఆ పని చేయకపోగా ప్రభుత్వ కొనుగోలు సంస్థల్ని ఎత్తివేస్తున్నది. ఎఫ్‌సీఐ, నాఫెడ్‌, టొబాకో బోర్డు వంటి సంస్థలను మూసివేస్తున్నది. పంటలబీమా పథకంలో వేలకోట్లు బీమా కంపెనీలు కాజేస్తున్నాయి. రుణమాఫీ అమలుకాక పోవడం, బ్యాంకులు పంటరుణాలు ఇవ్వనందున బీమా ప్రీమియమ్‌ చెల్లింపులు జరగలేదు. ఈ సంవత్సరం బీమా ఉండదు. విత్తన పరిశోధనల టెక్నాలజీ కూడా దిగుమతి చేసుకోవడానికే సుముఖంగా ఉన్నారు. దేశీయ పరిశోధనా కేంద్రాలన్నీ మూలబడ్డాయి.

30లక్షల కోట్ల బడ్జెట్‌లో 7లక్షల కోట్లు (26 శాతం) వడ్డీల కింద భారత ప్రభుత్వం చెల్లిస్తున్నది. రక్షణకు 17శాతం ఖర్చుచేస్తున్నది. సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు వ్యయం చేయకుండా కోతలు పెడుతున్నారు.

(రూ.కోట్లలో)
రంగం 2018-19 2019-20 2020-21
వాస్తవం రివైజ్డ్‌ బడ్జెట్‌
దళితులు 7,574 5,568 6,242
గిరిజనులు 3,821 4,194 4,190
మైనార్టీలు 3,564 4,700 5,029
మహిళలు, కుటుంబ సంక్షేమం 52,953 62,559 65,011
వికలాంగులు 1,009 1,100 1,325
వివక్షకు గురైన వర్గాలు 1,563 1,845 2,210

పై కేటాయింపులను గమనిస్తే కేంద్రప్రభుత్వం ఆ వర్గాలను ఏ మేరకు అభివృద్ధిలోకి తెస్తుందో అర్థమవుతోంది. బలహీనవర్గాలకు కేటాయింపులు పెద్దగా చేశామని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికున్న 101శాఖలనుంచి 15శాతం దళితులకు, 6శాతం గిరిజనులకు సబ్‌ప్లాన్‌ కింద కేటాయింపులు చేశారు. ఇవి కూడా ఆ వర్గాల అభివృద్ధికి తోడ్పడటంలేదు. సబ్‌ప్లాన్‌ నిధులు ఈ విధంగా కేటాయించారు.

(రూ.కోట్లలో)
సంవత్సరం దళితులు గిరిజనులు
2017-18 49,492 31,913
2018-19 51,342 36,889
2019-20 72,936 49,268
2020-21 83,256 53,652

ఈ నిధులు సకాలంలో రాష్ట్రాలకు విడుదల చేయకపోడంతో దళిత, గిరిజనుల అభివృద్ధికి వీటిని వినియోగించడంలేదు. శాఖల తరఫునే ఈ నిధులు ఖర్చుచేసి దళితుల, గిరిజనుల అభివృద్ధికి వ్యయం చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి నోడల్‌ ఆఫీసర్‌ను నియమించి అతని ద్వారా ఈ నిధులను ఆ వర్గాలకు వ్యయం చేయాలి. నేటికీ దళిత, గిరిజనులు ఇల్లూ విద్యా, వైద్యానికి దూరంగానే బతుకుతున్నారు. పౌష్టికాహారం లోపం ప్రధానంగా ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేక దారిద్య్రరేఖకు దిగువన కొనసాగుతున్నారు. ఇదే సందర్భంలో 2019-20లో ఇచ్చిన సబ్సిడీలను కూడా తగ్గించి వేశారు. ఆహార సబ్సిడీ కింద 2019-20లో 1,84,220 కోట్లు కేటాయించగా, 2020-21లో 1,15,569 కోట్లు మాత్రమే కేటాయించారు. కిరోసిన్‌ సబ్సిడీ 4,489 కోట్ల నుంచి 3,659 కోట్లకు తగ్గించారు. రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీని 80 వేల కోట్ల నుంచి 71 వేల కోట్లకు తగ్గించారు. ఉపాధి హామీ పథకానికి 71 వేల కోట్ల నుండి 61,500 కోట్లకు తగ్గించారు. రోజుకి రూ.600 కూలి చొప్పున 200 రోజులు పని కల్పించడానికి సంవత్సరానికి 1.20లక్షల కోట్లు కేటాయించాలి.

ప్రస్తుతం కేటాయించిన నిధులలో కూడా 45 శాతం యాంత్రీకరణకు కేటాయించారు. రైతు కుటుంబాలలో 82శాతంగా ఉన్న పేదరైతులకు జనాభాలో 85శాతం పేదలకు బడ్జెట్‌లో కేటాయింపులు 30శాతానికి మించలేదు. కేంద్ర బడ్జెట్‌ను పెంచడానికి దేశ జీడీపీ పెరుగుదల లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడానికి నిర్ణయించుకున్నారు. 31లక్షల కోట్ల ఆస్తులు గల జీవిత బీమా సంస్థలో వాటాలు అమ్మడానికి ప్రకటించారు. ప్రయివేటు రైల్వే సర్వీసుల్ని ప్రవేశపెట్టబోతున్నారు. విద్యారంగాన్ని విదేశీ సంస్థలకు హస్తగతం చేయబోతున్నారు. చివరికి ఆరోగ్య రంగాన్ని కూడా విదేశీ సంస్థలకు అంటగడుతున్నారు. వ్యవసాయ రంగంలోకి 100శాతం ఎఫ్‌డీఐ (విదేశీ సంస్థాగత పెట్టుబడి) ఆకర్షిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల రాకతో పై సంస్థల లాభాల్ని తరలించుకుపోతారు. లాభాలలో ఉండడమే కాక వేలకోట్ల పన్నులు సక్రమంగా చెల్లిస్తున్న బీమా సంస్థ, రైల్వేలు, అదనపు ఆదాయాన్ని సృష్టిస్తున్న వ్యవసాయరంగం పూర్తిగా విదేశీ సంస్థల్ని ప్రవేశం పెట్టడం ఈ బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ బడ్జెట్‌ సందర్భంగా చేసిన ప్రచారానికి, ఆచరణకు సంబంధం లేదు. గత బడ్జెట్‌పై 5,6 శాతం మాత్రమే పెంచి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, విదేశీ రుణం పెంచడం లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించారు. దీనివల్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి ఆదాయాలు పెరగడం, రైతులకు అదనపు ఆదాయం వంటి లక్ష్యాలేవీ నెరవేరవు. కాబట్టి బడ్జెట్‌ను పునఃపరిశీలించి దిగువ తరగతులకు ఆదాయం పెరిగే విధంగా మార్పులు చేయాలి.

Courtesy nava Telangana

RELATED ARTICLES

Latest Updates