రైతు ఆదాయం రెట్టింపు కలేనా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • బడ్జెట్‌ అంకెల్లో భారీతనం.. వాస్తవ వ్యయంలో కోతలు
  • 2018-19లో కేటాయింపులకు..వ్యయానికి తేడా 29వేల కోట్లు
  • కిసాన్‌ సమ్మాన్‌, ధరల మద్దతు, పాల ఉత్పత్తి…అన్నింట్లోనూ కోతలే న్యూఢిల్లీ : ప్రధాని మోడీ

నేతృత్వంలోని బీజేపీ చేసిన ఎన్నికలవాగ్దానాల్లో అతి ముఖ్యమైనది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం. లక్ష్యాన్ని 2022కల్లా చేరుకుంటామని ఆనాడు (2014) మోడీ సర్కార్‌ ఘనంగా ప్రకటించింది. అయితే గత కొన్నేండ్లుగా వ్యవసాయరంగంపై కేంద్రం చేస్తున్న వ్యయం ఎంతుందని లెక్కచూస్తే నిరాశ కలగకమానదు. అంతేగాక…బడా కార్పొరేట్లకు అనుకూలించే విధంగా ఆహార, వ్యవసాయరంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు అనుకూల విధానాల్ని అమలుజేయటంలో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాల్సిన కేంద్రం ఈవిధంగా ఉండటాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిపై తగ్గిన ప్రభుత్వ వ్యయం రైతు ఆదాయం రెట్టింపు, వ్యవసాయ అభివృద్ధిపై కేంద్రం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతనలేదన్న విమర్శలు బలపడుతున్నాయి. వ్యవసాయరంగంలో ప్రభుత్వ వ్యయం ఓవైపు గణనీయంగా తగ్గుతుంటే రైతు ఆదాయం రెట్టింపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. వ్యవసాయరంగానికి సంబంధించి వివిధ పథకాల అమలులో నిధుల వ్యయం తగ్గిందని (ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ ఆధారంగా) రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2015-16 నుంచి మోడీ సర్కార్‌ ప్రచారాన్ని మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నది. బడ్జెట్‌లో కేటాయింపులు కూడా పెద్దమొత్తంలో చూపుతున్నారు. వాస్తవ వ్యయం దగ్గరకు వచ్చేసరికి కేంద్రం లెక్కలు మారిపోతున్నాయి.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌, మద్దతు ధర కల్పించటం, హార్టికల్చర్‌, ఆహార భద్రత, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన..ఈ పథకాల పేర్లు, వాటికి కేటాయింపులు బడ్జెట్‌లో ఘనంగా చూపుతున్నారు. వాస్తవ వ్యయాన్ని పరిశీలిస్తే…దేంట్లోనూ పూర్తిస్థాయిలో నిధుల వ్యయం జరగటం లేదు. ఉదాహరణకు 2019-20 బడ్జెట్‌నే తీసుకుంటే 30 నవంబరు 2019నాటికి 8 నెలలు కాలంలో మొత్తం వ్యవసాయరంగంపై వ్యయం49శాతం దాటలేదు. 2018-19లో రైతు సంక్షేమం కోసం రూ.1,38,564కోట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. సవరించిన అంచనాల ప్రకారం నిధుల వ్యయం రూ.1,09,750కోట్లుగా ఉందని తేలింది. అనేక పథకాల్లో నిధుల వ్యయాన్ని తగ్గించటం ద్వారా దాదాపు 20 శాతం (రూ.29వేల కోట్లు) కోతపెట్టారు.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌
2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ పథకాన్ని మోడీ సర్కార్‌ ప్రకటించింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.75వేల కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం ఈ పథకంలో చేసిన వ్యయం రూ.54,370కోట్లు. నిధుల వ్యయంలో దాదాపు 20వేల కోట్లు(27.5శాతం) తగ్గింది.

హార్టికల్చర్‌
2018-19లో హార్టికల్చర్‌కు బడ్జెట్‌ కేటాయింపుల్ని భారీగా తగ్గించారు. రూ.2225కోట్ల నుంచి రూ.1584కోట్లకు నిధుల్ని తగ్గించారు. దీనికంటే రెండేండ్ల ముందు ప్రభుత్వ వ్యయం రూ.2027తో పోల్చుకుంటే నిధుల వ్యయం పెంచాల్సింది పోయి…క్రమంగా తగ్గిస్తున్నారు.

ఆహార భద్రత
బడ్జెట్‌ కేటాయింపుల్ని రూ.2వేల కోట్ల నుంచి రూ.1777కోట్లకు తగ్గించారు. 11శాతంమేర నిధుల్లో కోతలు విధించారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రూ.3745కోట్ల నుంచి రూ.2760కోట్లకు తగ్గించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లోనే 26శాతం కోతపెట్టారు. కృషి సించారు యోజనలో (అన్ని మంత్రిత్వశాఖల వ్యయాన్ని కలుపుకొని) కేటాయింపులు రూ.9843కోట్లుకాగా, సవరించిన అంచనా ప్రకారం వ్యయం రూ.7958కోట్లు. క్రితం బడ్జెట్‌ (2018-19)తో పోలిస్తే వ్యయం (రూ.8221కోట్లు) తగ్గింది.

మద్దతు ధరల పథకం
మార్కెట్‌ జోక్యం, ధరల మద్దతు పథకం(ఎంఐఎస్‌-పీఎస్‌ఎస్‌) కోసం 2019-20లో 3వేలకోట్లు కేటాయిం చారు. సవరించిన అంచనా ప్రకారం చేసిన వ్యయం రూ.2010 కోట్లుగా ఉందని తేలింది. పాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన ‘శ్వేత విప్లవం’పై కేటాయింపులు రూ.2240కోట్లుకాగా, సవరించిన అంచనా 1799కోట్లుగా ఉందని తేలింది.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates