పాలనా కేంద్రం విశాఖే అమరావతి నిర్మాణం అసాధ్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అక్కడ అసెంబ్లీ, హైకోర్టు బెంచి చాలు
న్యాయ సంబంధిత విభాగాలన్నీ కర్నూల్లో
ప్రజలు రాజధానికి రావాల్సిన పని లేకుండా 6 ప్రాంతాల్లో శాటిలైట్‌ కమిషనరేట్లు పెట్టాలి
నివేదిక ఇచ్చిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌
ఇక ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయమే తరువాయి
 అమరావతి

అంతా అనుకున్నట్లుగానే బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు పదేపదే ఇస్తున్న సంకేతాలకు తగ్గట్టే.. జీఎన్‌ రావు కమిటీ నివేదిక తరహాలోనే ఇది సాగింది. అమరావతిలో రాజధాని నిర్మాణం అసాధ్యమని బీసీజీ చెప్పింది.  రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి.. 10-15 ఏళ్ల తర్వాత ఎకరం రూ.20 కోట్లకు విక్రయిస్తే గానీ అది జరిగే పని కాదని చెప్పింది. రాష్ట్ర రాజధాని ఒకేచోట కాకుండా, ఆ నమూనా విస్తరించుకుని ఉండాలంటూ.. పేరుకు రెండు ఆప్షన్లు ప్రతిపాదించింది. కానీ.. రెండింటిలోనూ విశాఖవైపే మొగ్గుచూపింది.

బీసీజీ ఒక ప్రతిపాదనలో.. అమరావతిలో శాసనసభ, హైకోర్టు బెంచితోపాటు 15 కమిషనరేట్లు ఏర్పాటుచేయాలని సూచించగా.. రెండోదాంట్లో కేవలం అసెంబ్లీ, హైకోర్టు బెంచికే పరిమితం చేసింది. మొత్తానికి అమరావతిని నామమాత్రం చేసింది. హైకోర్టు, కమిషన్లు, అప్పిలేట్లు, ఇతర న్యాయ సంబంధిత కార్యాలయాలన్నీ కర్నూలు కేంద్రంగా ఉండాలని ప్రతిపాదించింది. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి శాఖాధిపతుల కార్యాలయాలకు అనుబంధంగా శాటిలైట్‌ కమిషనరేట్లు ఉండాలని సూచించింది. రాష్ట్రంలో ఒక పక్కగా ఉన్న విశాఖను సీమవాసులు ఎలా చేరుకుంటారన్న విమర్శలకు.. అసలు సచివాలయానికి సందర్శకులు రావాల్సిన అవసరాన్నే తగ్గించాలన్న పరిష్కారాన్ని సూచించింది. వ్యవసాయం, నీటిపారుదలలో పెట్టుబడులు భారీగా పెంచాలని సిఫార్సు చేసింది. జీఎన్‌ రావు కమిటీ నివేదికతో పాటు.. ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బీసీజీ నివేదిక సైతం రావడంతో.. ఇక మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ వీటిని అధ్యయనం చేసి.. అమలు ప్రణాళికను సిఫార్సు చేయటమే మిగిలింది. బీసీజీ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి నివేదిక సమర్పించారు. దీని సారాంశాన్ని ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ విలేకరులకు వివరించారు.

బీసీజీ ప్రతిపాదించిన 2 ఆప్షన్లు ఇవీ..
ఆప్షన్‌1

విశాఖలో..
* గవర్నర్‌, సీఎం కార్యాలయాలు, సచివాలయం
* అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచి
* పారిశ్రామిక-మౌలికవసతులు, పర్యాటకశాఖలకు సంబంధించిన ఏడు విభాగాధిపతుల కార్యాలయాలు
* జీఏడీ, న్యాయశాఖ, అటవీ వంటి అన్ని ప్రభుత్వ శాఖలతో సంబంధం ఉండే 8 విభాగాలు
అమరావతిలో..
* శాసనసభ, విద్యకు సంబంధించి మూడు, వ్యవసాయానికి సంబంధించి నాలుగు, స్థానిక సంస్థలు, సంక్షేమానికి సంబంధించిన విభాగాలు… మొత్తం కలిపి 15 హెచ్‌ఓడీలు
* సంక్షేమ-స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌
కర్నూలులో..
* హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు
ఆప్షన్‌ 2

విశాఖలో..
* సచివాలయం, గవర్నర్‌, ముఖ్యమంత్రి కార్యాలయాలు, అన్ని విభాగాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచి
అమరావతిలో..
* అసెంబ్లీ, హైకోర్టు బెంచి
కర్నూలులో..
* హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

విశాఖే ఉత్తమం
రాజధానిపై విస్తరణ నమూనాను అనుసరించాలి
విశాఖ, అమరావతిలో నిర్మిస్తే రూ.4,645 కోట్లు ఖర్చవుతాయి
వైజాగ్‌లోనే అన్నీ ఏర్పాటు చేస్తే రూ.3,500 కోట్లు చాలు
బీసీజీ నివేదికలో సూచనలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఒకే చోట ఏర్పాటు చేయకుండా… ఒక విస్తరణ రాజధాని నమూనాను(డిస్ట్రిబ్యూటెడ్‌ కేపిటల్‌ మోడల్‌ని) అనుసరించాలని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) తన నివేదికలో సూచించింది. పేరుకు రెండు ఐచ్ఛికాలను(ఆప్షన్లు)  ప్రతిపాదిస్తూనే… విశాఖలోనే పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు చేయడం మంచిదని సూచించింది. రకరకాల సమీకరణాలు, సంభావ్యతల్ని ప్రతిపాదిస్తూనే… సచివాలయం, ప్రభుత్వ విభాగాలు, ముఖ్యమంత్రి, గవర్నర్‌ క్యాంపు కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్‌ వంటివన్నీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలంది. దీనివల్ల పరిపాలనా సౌలభ్యం ఉంటుందని..మొత్తం మీద విశాఖే రాజధానిగా ఉంటే మంచిదని స్పష్టం చేసింది.
ప్రజలకు పరిపాలన చేరువ చేసేందుకు ఆరు శాటిలైట్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చేందుకు, చారిత్రకంగా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికీ మధ్య అసమానతల్ని తొలగించేందుకు, అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందేందుకు, రాజధాని నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు, ప్రజలకు ప్రభుత్వ సేవల్ని మరింత చేరువ చేసేందుకు విస్తరణ రాజధాని డిస్ట్రిబ్యూటెడ్‌ కేపిటల్‌ నమూనాని అనుసరించాలని పేర్కొంది. 1937 నాటి శ్రీబాగ్‌ ఒప్పందం సహా, వివిధ చారిత్రక హామీలనూ, ఇతర అంశాల్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సిఫారసులు చేస్తున్నట్టు తెలిపింది.

25 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం చాలు
దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా సగటున శాసనసభ, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టుకు కలిపి 22-25 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతమే ఉందని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. అమరావతిలో మాత్రం 55 లక్షల చ.అడుగులు ప్రతిపాదించారని తెలిపింది. ఆప్షన్‌-1 ప్రకారం విశాఖలోను, అమరావతిలోను రాజధానిని విస్తరిస్తే నిర్మాణాలకు రూ.4,645 కోట్లు, ఆప్షన్‌-2 ప్రకారం విశాఖలోనే అన్నీ ఏర్పాటు చేస్తే నిర్మాణాలకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది.

ఇదీ ప్రాతిపదిక
* ప్రజల ఆశయాలు, కోరికలు, ఆకాంక్షల్ని సమతులం చేయడం, చారిత్రక హామీలను నెరవేర్చడం, రాజధానులు కిక్కిరిసిన జనాభాతో ఉండకుండా ఎలా విస్తరించాలి?అన్న అంశాల్ని ప్రాతిపదికగా చేసుకుని ఈ సిఫారసులు చేసినట్టు తెలిపింది.
* దక్షిణాఫ్రికా, జర్మనీ, ఎస్తోనియా, మలేషియా, దక్షిణ కొరియా వంటి పలు ఉదాహరణల్ని ప్రస్తావించింది.
* మన దేశంలోను ఏడు రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు మరో చోట ఉన్నాయని తెలిపింది.
* కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో శాసనసభ సమావేశాలు 2 చోట్ల జరుగుతున్నాయని ప్రస్తావించింది.

 

RELATED ARTICLES

Latest Updates