గుప్తనిధుల గుట్టు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అధికారంలో ఉన్నప్పుడు ఆ సౌభాగ్యమే వేరు. భారతీయ జనతాపార్టీకి నిధులు వరదలా వచ్చిపడుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీకి 742కోట్లు విరాళాలుగా అందాయనీ, ఇది అంతకుముందు ఏడాదికంటే డెబ్బయ్‌శాతం ఎక్కువని ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకోసం తాపత్రయపడుతున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ప్రకటించింది.

2017-18కాలంలో బీజేపీకి 437కోట్లు, కాంగ్రెస్‌కు 26కోట్లు సమకూరితే, మరుసటి ఏడాది కాంగ్రెస్‌కు 148కోట్లు అందాయి. 2018–19 లో ఐదు జాతీయపార్టీలు అందుకున్న విరాళాల సగటు కంటే అధికార పార్టీకి మూడురెట్లు అందాయని ఎన్నికల సంఘానికి ఈ పార్టీలు సమర్పించిన వివరాల ఆధారంగా ఏడీఆర్‌ విశ్లేషణలు చేసింది. కాంగ్రెస్‌తో పోల్చితే కార్పొరేట్‌ సంస్థల ద్వారా బీజేపీకి అందిన విరాళాలు చాలా ఎక్కువ.

సార్వత్రక ఎన్నికల ముందు ప్రధాన రాజకీయపార్టీలకు విరాళాలు ఒక్కసారిగా పెరిగాయనీ, ముందు ఏడాది కంటే ఇది దాదాపు ఐదువందలకోట్లు ఎక్కువని ఏడీఆర్‌ చెబుతోంది. మొత్తం విరాళాల్లో కార్పొరేట్‌ సంస్థల వాటా 92శాతం మేరకు ఉన్నది. ఈ కార్పొరేట్‌ ప్రేమ అన్ని పార్టీలకూ ఎంతో కొంత దక్కినా అగ్రస్థానం అధికారపక్షానిదే. బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ పార్టీలకు టాటా గ్రూప్‌ అధీనంలో ఏర్పడిన ‘ప్రొగ్రెసివ్‌ ఎలక్టొరల్‌ ట్రస్ట్‌’ ఒక్కటే 455 కోట్ల మేరకు సమకూర్చింది. అలాగే విరాళాలు అందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు తమ దాతల పాన్‌ నెంబర్లు, చిరునామాలు అందించడం లేదంటూ ఎప్పటిలాగానే ఏడీఆర్‌ ఇప్పుడూ వాపోయింది. ఆదాయం లెక్కలు చెబుతున్నట్టు కనిపిస్తూనే, చెక్కు డీడీ ఇత్యాది వివరాలు కూడా ఎన్నికల సంఘం ముందు దాచేస్తే దాతలు, విరాళాలు, పార్టీల మధ్య రహస్య బంధాన్ని ఛేదించడం ఎలా? అని ఏడీఆర్‌ బాధపడిపోతోంది. ఉభయ కమ్యూనిస్టులతో సహా ఏడు జాతీయపార్టీలు వందలాది దాతల వివరాలు అసమగ్రంగా చూపుతూ ఎంతో గోప్యత పాటించాయట. ఎలక్టొరల్‌ ట్రస్టులు కూడా ఆయా కంపెనీల వివరాలు తెలియచేయకుండా సాధ్యమైనంత మాయచేస్తున్నాయట.

ఎలక్టొరల్‌ బాండ్స్‌ అసలు లక్ష్యమే మాయ. ఈ పథకానికి వ్యతిరేకంగా ఏడీఆర్‌ వేసిన కేసుపై సుప్రీంకోర్టు అన్ని పక్షాలనూ నిలదీస్తున్నది. ఎన్నికల సంఘం కూడా ఎలక్టొరల్‌ బాండ్స్‌ని వ్యతిరేకిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. స్వచ్ఛత, పారదర్శకత అంటూ తెచ్చిన ఈ బాండ్ల పథకంలో వాటికి చోటు లేదని వాపోతోంది. కాంగ్రెస్‌, బీజేపీ ఇత్యాది ప్రధాన రాజకీయపార్టీల సంగతి అటుంచితే, ‘సబ్‌ సే బడా పార్టీ’, ‘హిందూస్థాన్‌ యాక్షన్‌ పార్టీ’ వంటి డెబ్బయ్‌కు పైగా గుర్తింపులేని పార్టీలకు కూడా ఈ మార్గంలో విరాళాలు అందుతున్నాయని ఈ మధ్యనే చెప్పింది. నిధుల అక్రమ రవాణాకు ఈ బాండ్ల మార్గం ఉపకరిస్తున్నదన్న అనుమానాలూ ఉన్నాయి. ఈ బాండ్లు ప్రవేశపెట్టిన తరువాత దేశవ్యాప్తంగా అనేక కొత్త రాజకీయపార్టీలు పుట్టుకొచ్చాయనీ, వాటి సంఖ్య రెండున్నరవేల వరకూ ఉండవచ్చుననీ అంచనా.

ప్రామిసరీ నోటులాంటి ఈ బాండ్లను నచ్చిన విలువకు స్టేట్‌బ్యాంకునుంచి కొని, దాతలు ఏ రాజకీయపార్టీకైనా ఇవ్వవచ్చు. ఈ ప్రక్రియలో దాతకూ స్వీకర్తకూ మధ్య బంధం బయటకు పొక్కకుండా, పారదర్శకతకు అవకాశం లేకుండా ప్రతీదశలోనూ ప్రభుత్వమే వివిధ చట్టాల సవరణల ద్వారా జాగ్రత్తపడింది. అంతిమంగా మనకు తెలిసేదల్లా ఎన్నికల సంఘానికి సదరు పార్టీలు విరాళాల రూపేణా ఎంత సమకూరినదీ చెబుతున్న మొత్తం మాత్రమే. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 20సి ప్రకారం ఇరవైవేల రూపాయల్లోపు విరాళం ఇచ్చిన దాతల వివరాలు ఎలాగూ పార్టీలు చెప్పనక్కరలేదు. ఎలక్టొరల్‌ బాండ్స్‌ కొన్నవారి వివరాలు చెప్పమని స్టేట్‌బ్యాంకును అడిగితే ఆర్టీఐ చట్టంలోని అరడజను సెక్షన్లను ఉటంకిస్తూ కాదు పొమ్మంటుంది. బాండ్ల ద్వారా అందే విరాళాలతోనే రాజకీయపార్టీలు ఎన్నికల యుద్ధం చేస్తున్నాయన్న భ్రమ ఎవరికీ లేదు. కానీ, ఓ అధికారిక మార్గంలో అధికారపక్షాన్ని ఇలా ప్రసన్నం చేసుకుంటున్న కార్పొరేట్‌ సంస్థలు ఇందుకు ప్రతిగా ఏ విధంగా లబ్ధిపొందుతున్నాయో తెలియకుండా పోవడమే విషాదం. ప్రజలను తమ పుట్టుపూర్వోత్తరాలు చూపమంటున్న పాలకులను ఈ గుప్త నిధుల గుట్టు విప్పనంతకాలం ‘హమ్‌ కాగజ్‌ నహీ దిఖాయేంగే’ అని నిలదీయక తప్పదు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates