సగం మండలాల్లో కరువే

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఆగస్టు ముగిసినా అంతే
  • ఖరీఫ్‌కు మిగిలింది నెలే
  • 3.5 లక్షల హెక్టార్లలో సాగు లేదు

ఖరీఫ్‌ సేద్యానికి సరిగ్గా నెల రోజులే గడువుంది. ఇప్పటికి సీజన్‌లో మూడు మాసాలు గడిచిపోయాయి.. నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతే. సీజన్‌ ప్రారంభంలోనే వర్షాభావం తిష్ట వేసింది. జూన్‌, జులై నెలల్లో చినుకు లేదు. ఆగస్టులో అడపాదడపా కురిసిన వానల వలన కొన్ని ప్రాంతాలు వర్షాభావం నుంచి ఉపశమనం పొందినప్పటికీ ఆగస్టు 31 నాటికి ఇంకా ఆరు జిల్లాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. శ్రీకాకుళంలో సాంకేతికంగా సాధారణ వర్షం పడిందంటున్నా తక్కువ వర్షం కేటగిరీకి అత్యంత చేరువలో ఉంది. ఎపిలో 670 మండలాలుండగా 361 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. శనివారం సాయంత్రానికి సగటున రాష్ట్రంలో 20.4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గణాంకాల పరంగా ఒక రోజు సాధారణం, మరొక రోజు లోటు వర్షం నమోదవుతున్నప్పటికీ కరువు మ్యాన్యువల్‌ ప్రకారం చూస్తే కనీసం 300 మండలాలను కరువు మండలాలుగా గుర్తించేందుకు నిబంధనలు సరిపోతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. మండలాల సంఖ్య ఇంకా పెరిగినా పెరగొచ్చని సమాచారం. కరువు మండలాలు అత్యధికంగా రాయలసీమలోనే ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులకు వరదలొచ్చినప్పటికీ సింహభాగం సముద్రం పాలయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సీమకు కొంత మేర నీరు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో గతేడాది కంటే తక్కువ నీటి నిల్వలుండటం గమనార్హం. నాగార్జునసాగర్‌ కొంత వరకు ఆదుకునే అవకాశం ఉన్నప్పటికీ దాని యాజమాన్యం తెలంగాణ కింద ఉన్నందున వరద లేని సమయంలో ఆ జలాశయం నుంచి ఎపికి నీటి విడుదలకు ఇబ్బందులున్నాయని చెబుతున్నారు. వరదలు, ఆలస్యంగానైనా కురిసిన వానలు కొంత వరకు కొన్ని ప్రాంతాలకు ఊరట కలిగించినా, రాయలసీమ, నెల్లూరులో మొత్తంగా, విజయనగరం, శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది.

20 శాతం తక్కువ
జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 మధ్య రాష్ట్రంలో సగటున 405.3 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 322.7 మిమీ పడింది. పడాల్సినదానిలో 20.4 శాతం తక్కువ. జులై నెలాఖరు వరకు సరైన వానల్లేవు. ఆగస్టు మొదటి వారం నుంచి కొన్ని జిల్లాల్లో అడపాదడపా వానలు కురిశాయి. ప్రస్తుతం అనంతపురంలో 37.5 శాతం, కడప 32.1, కర్నూలు 28.2, నెల్లూరు 22.1, కృష్ణా, 22.2, పశ్చిమగోదావరి 25.3 శాతం లోటు వర్షం నమోదైంది. చిత్తూరులో సాధారణ వర్షం పడిందంటున్నా ఆలస్యంగా పడటంతో సాగుకు పెద్దగా ఉపయోగపడలేదని చెబుతున్నారు. ఈ మారు ప్రకాశంలో సాధారణ వర్షం పడటం ఆ జిల్లాకు కొంత వరకు ఉపశమనం. అయితే సాగుపై పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో అక్కడా వానల్లేవంటున్నారు.

లక్షల హెక్టార్లు బీడు
ఖరీఫ్‌లో ఇప్పటి వరకు సాగు కావాల్సిన పంటల్లో మూడున్నర లక్షల హెక్టార్లు తగ్గాయి. వరి లక్ష హెక్టార్లు, చిరుధాన్యాలు 11 వేల హెక్టార్లు, పప్పులు 8 వేల హెక్టార్లు, వెరసి ఆహార ధాన్యాలు 1.15 లక్షల హెక్టార్లలో తగ్గాయి. రాయలసీమలో వర్షాభావం వలన నూనెగింజల సాగు బాగా క్షీణించింది. ఇప్పటికి సాగు కావాల్సిన దాంట్లో 2.63 లక్షల హెక్టార్లు తగ్గింది. సీమలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా కంది సాగు చేస్తుండటంతో ఈ తడవ ఆ పంట సాగు స్వల్పంగా పెరిగింది. పత్తి, మొక్కజొన్న, రాగి, సోయాచిక్కుడు, మిరప, పొగాకు పంటల సాగు ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉన్నాయి. తతిమ్మా పంటలన్నీ తక్కువగా సాగయ్యాయి.

COURTECY NAVA TELANGANA

RELATED ARTICLES

Latest Updates