మంచి నీళ్ల వ్యాపారం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మంచి ఎండాకాలం. నంద్యాలలో బస్సెక్కి కర్నూలు బయలుదేరాను. తెచ్చుకున్న బాటిల్లో నీళ్ళు వేడెక్కాయి. ఇంతలో ‘వాటర్‌ ప్యాకెట్‌…’ అంటూ అబ్బాయి వస్తే రెండు రూపాయలిచ్చి ఒకటి కొని తాగి సేద తీరాను. పక్కనున్న పంజాబీ ‘మా రాష్ట్రంలో నీళ్ళు అమ్మము, ఊరకే ఇస్తాము’ అన్నాడు. ఇది జరిగి చాలా రోజులయ్యింది. కాని కొన్ని ఆలోచనలు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి.

మనింటికి వచ్చిన పెద్దోళ్ళు చెప్పే మాటలిలా ఉంటాయి ”అసలు మేము పుట్టినప్పటి నుండి ఒకే బావి నీళ్ళు తాగాం. ఇలా ఎక్కడి నుంచో వచ్చిన నీళ్ళు అస్సలు ముట్టేవాళ్ళం కాము. ఎండాకాలం మన బావి లోంచే వీధిలో అందరూ నీళ్ళు చేదుకొని పోయేవాళ్ళు. ఇలా నీళ్ళు అమ్మడం అస్సలు లేనే లేదు. ఇంటికి ఎవరు వచ్చినా మొదట మంచి నీళ్ళిచ్చేవాళ్ళం. అసలు పాలు, పెరుగు, కూరగాయలు కూడా అమ్మేవాళ్ళు కాదు” అని. గత ఇరవై ఐదు సంవత్సరాల్లో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కాదు. వాటిలో ఈ నీళ్ళు ఒకటి. ఇప్పుడు నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళకు బాగా గుర్తు, చిన్నప్పుడు మామూలు కొళాయి నీళ్ళే కుండల్లో పోసుకొని తాగేవాళ్ళం. వర్షాకాలంలో క్లోరిన్‌ వేసిన నీళ్ళను (ఆ వాసన గురించి తిట్టుకుంటూనే) తాగేవాళ్ళం. తరువాత స్టీల్‌ ఫిల్టర్లు వచ్చాయి. వాటిలో పోసుకొని తాగే వాళ్ళం. నీళ్ళు ఎక్కువగా దిగకపోతే సెరామిక్‌ ఫిల్టర్లు మార్చే వాళ్ళం. తరువాత మినరల్‌ వాటర్‌ అని, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ అని టిన్నులలో నీళ్ళు రావడం మొదలైంది.

మొదట ఎనిమిది రూపాయలతో మొదలైన ఈ టిన్నులు ఇప్పుడు ముప్పై రూపాయల దాకా వున్నాయి. పేరుమోసిన కంపెనీలవైతే రెండు వందల రూపాయల పైన ఉన్నాయి రేట్లు. ఏమంటే లీటర్‌ నీళ్ళు ఇరవై ఐదు రూపాయలు ఉన్నప్పుడు ఇరవై లీటర్ల టిన్ను రేటు పోల్చుకొని ఆనందపడతారు. నీళ్ళ ఫిల్టర్లు కూడా కరెంటుతో నడిచేవి, ఆర్‌.వో.సిస్టం అనో ఇంకో పేరుతోనో వచ్చాయి. అన్నీ కొన్నాం. నీళ్ళు తాగుతున్నాం. ఐనా మామూలుగానే జబ్బులకు గురవుతున్నాము. ఇదంతా చూస్తుంటే దీని వెనకాతల ఓ పెద్ద వ్యాపారం దాగుందని అనిపించదూ? తప్పకుండా అనిపిస్తుంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్ళ కుళాయిలకు మీటర్లు కూడా పెట్టారు కొన్ని నగరాల్లో. కరెంటు ఎంత వాడితే అంత బిల్లు అన్నట్లు నీళ్ళు ఎన్ని వాడితే అంత బిల్లు. రైతుకు నీళ్ళు ఇవ్వలేని కొన్ని ప్రభుత్వాలు బహుళజాతి కూల్‌ డ్రింక్‌, మినరల్‌ వాటర్‌ సంస్థలకు ఫ్యాక్టరీల దాకా నీళ్ళు చేరుస్తున్నాయి. ఒక పక్క రైతుల ఆత్మహత్యలు, ఇంకో పక్క చల్లటి పానీయాలు, చల్లటి మినరల్‌ వాటర్‌. ఇదీ మన దేశ పరిస్థితి.

ఇంతకూ తాగే నీళ్ళు కొనవలసిన అవసరం ఎందుకొచ్చింది? లేదా ఆర్‌.వో. సిస్టం అనో ఇంకోటో వాడినా రెండు బిల్లులు ఒకటే అవుతున్నాయి. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? మనం నీటి పన్నులు కడుతూనే ఉన్నాం కదా! అన్న అనుమానం కూడా వస్తుంది. ఒక పక్క ప్రయివేటు ఆసుపత్రులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పారిశుధ్యానికి, మంచినీటి సరఫరాకు, వైద్యానికి కేటాయిస్తున్న మొత్తాలు తగ్గుతూ ఉన్నాయి. ప్రయివేటు విద్యా సంస్థలు, టెలిఫోన్‌ సంస్థలు, మందుల కంపెనీలు వచ్చాయి, అలాగే ఇంకొన్ని మార్పులు చూస్తున్నాము. బిస్లరి, కిన్లే, ఆక్వాఫినా, టాటా మొదలైన బ్రాండెడ్‌ మినరల్‌ వాటర్‌ సంస్థలు రాజ్యమేలుతున్నాయి. బాగా గమనిస్తే ఇవన్నీ 1990-91 తరువాత జరుగుతున్నాయని మనకు తెలిసిపోతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. 1991 తరువాత వచ్చిన ప్రపంచీకరణ మార్పులే దీనికి కారణం అనుకున్నాక దాని వెనుక ఉన్న ఒప్పందాల గురించి కూడా తెలుసుకోవాలి. దేశాలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అంటే ఐ.ఎం.ఎఫ్‌ ఊరకే అప్పులివ్వవు. వడ్డీతో పాటు కొన్ని ఆంక్షలు పెడతాయి. మొదటిది దేశీయ రంగాలన్నింటినీ ప్రపంచీకరణకు అనువుగా అంతర్జాతీయ సంస్థలకు అనువుగా తెరచిపెట్టాలి. వాటిని స్వాగతించాలి. వాళ్ళ అప్పు ఇ.ఎం.ఐ. కట్టడానికి గాను కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. అందుకే కొన్ని ప్రభుత్వ సంస్థల్ని మూసెయ్యాలి, కొన్నింటిని అమ్మేయాలి, ఉద్యోగుల్ని తగ్గించాలి. ఇంకా ఇలాంటి చర్యలే చేపట్టాలని షరతులు పెడతాయి.

ఇప్పుడు నింపాదిగా ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగాయో లేదో ఆలోచించండి. ఎన్నో దేశాల్లో జరిగిందే. ఈ సరళీకత ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రభుత్వాలు తమ ప్రథమ కర్తవ్యం నుంచి పక్కకు తప్పుకుని పోతున్నాయి. అందులో భాగంగానే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలు రక్షిత మంచి నీటి సరఫరా సరిగా చేయకపోవడంతో…ప్రజలు వాటిపై విశ్వాసం కోల్పోతున్నారు. అందుకే ప్రైవేటు మినరల్‌ వాటర్‌ సరఫరా మీద ఆధారపడుతున్నారు. కానీ అవి అంతంత మాత్రంగా శుభ్రమైన వాటినే సరఫరా చేస్తున్నాయి. నిజానికి ఈ మినరల్‌ వాటర్‌ ప్రత్యామ్నాయం కానే కాదు. అసలు మరగకాచి చల్లార్చిన నీళ్లు తాగడం ఆరోగ్యకరం. దానికి మంచి ఉదాహరణ కేరళ. ఇక్కడి ప్రజలందరూ కాచి చల్లార్చిన నీటినే తాగుతారు. ఇందుకోసం అక్కడి ‘కెఎస్‌ఎస్‌పి’ (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు) ఎంత గానో కృషి చేసి ప్రజలలో అవగాహన పెంచింది. మనం కూడా జన విజ్ఞాన వేదిక తరఫున తెలుగు ప్రజలలో మంచి నీటి పట్ల, శుభ్రమైన నీటి పట్ల అవగాహన పెంచి, ‘మినరల్‌ వాటర్‌’ వాడకాన్ని తగ్గించి, కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రచారం చేయడం మన కర్తవ్యం.

జంధ్యాల రఘుబాబు
జనవిజ్ఞాన వేదిక, కర్నూలు

Courtesy Prajasakti

RELATED ARTICLES

Latest Updates